WORLD MILK DAY-2021: నేడు ప్రపంచ పాల దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా..? దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటి..
WORLD MILK DAY-2021: పోషకాహార ప్రధాన వనరు పాలు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతి సంవత్సరం
WORLD MILK DAY-2021: పోషకాహార ప్రధాన వనరు పాలు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపు కుంటారు. పాడి రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రపంచ పాల ఉత్పత్తుల ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఐక్యరాజ్యసమితికి సంబంధించిన ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) ప్రపంచ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇది జూన్ 1, 2000 సంవత్సరం నుంచి ప్రారంభమైంది. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం పాల గురించిన విషయాలు, సంఘటనలను ప్రజలకు తెలియజేయాలని ప్రపంచ పాల దినోత్సవ వెబ్‌సైట్ ఈవెంట్ నిర్వాహకులను కోరింది.
ప్రపంచ పాల దినోత్సవం వెనకున్న ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే.. మన నిత్య జీవితంలో పాలు, పాల ఉత్పత్తుల ప్రాముఖ్యత గురించి ప్రజలు తెలుసుకోవటం. పోషకాహార ప్రధాన వనరుగా పాలు, పాల ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఒక బిలియన్ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. పాల ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా పాలు ఉత్పత్తి చేసే దేశాలలో భారత్ ఒకటి. ప్రతి సంవత్సరం ఒక థీమ్‌తో ప్రపంచ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దాని ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం థీమ్‌గా పర్యావరణ, పోషణ, సామాజిక ఆర్థిక సాధికారతతో పాటు పాడి రంగంపై దృష్టి సారించే ఇతివృత్తంతో పాల దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.
ఇక రోజూ పాలు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో కొన్ని రకాల హార్మోన్ల ఉత్పత్తికి అవసరమయ్యే కొవ్వుపదార్థాలు పాలద్వారా లభిస్తాయి. పాలలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలు చురుగ్గా పని చేసేందుకు కావలసిన పోషకాలను అందిస్తాయి. రోజూ మూడు గ్లాసుల పాలు తాగేవారు వ్యాధులకు దూరంగా ఉంటారని పలు పరిశోధనల్లో తేలింది. పాలు తాగడం వల్ల బరువు పెరుగుతామన్నది అపోహ మాత్రమే. పాలలోని కొవ్వులు అధిక బరువును తగ్గించడంలో సాయపడుతాయి. నిద్ర లేమితో బాధపడేవారు, పడుకునే ముందు ఓ గ్లాసు పాలలో కాస్త తేనె కలుపుకొని తాగితే చక్కని ఫలితం ఉంటుంది.
చిన్నప్పటినుంచీ పాలు తాగే అలవాటు ఉన్నవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ఆస్కారం చాలా తక్కువని ఓ అంచనా. పాలలోని క్యాల్షియం, సహజ కొవ్వులు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. పాలు తాగడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కరోనా సమయంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో పాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. పసుపు, మిరియాలు, శొంఠి వంటివి కలుపుకొని తాగడం వల్ల వైరస్, బ్యాక్టీరియా వంటి రోగకారకాలు నశిస్తాయి.