కేంద్ర శాఖల మధ్య లాక్-డౌన్ చిచ్చు.. ఇలాగైతే కష్టమే!

కేంద్ర శాఖల మధ్య లాక్-డౌన్ చిచ్చు.. ఇలాగైతే కష్టమే!

లాక్-డౌన్ రెండు కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్య చిచ్చు రేపుతోంది. ప్రజారోగ్యం పేరిట మొత్తం లాక్-డౌన్ విధిస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింటుందని వాణిజ్య, వ్యవసాయ శాఖలు వాదిస్తున్నాయి. వారితో హోం శాఖ విభేదిస్తోంది. ఈ వివాదం కాస్తా.. లేఖాస్త్రాల దాకా వెళ్ళడంతో మోదీ, అమిత్‌షా రంగంలోకి దిగినట్లు సమాచారం.

Rajesh Sharma

|

Apr 13, 2020 | 1:32 PM

లాక్-డౌన్ కొనసాగించాలన్న నిర్ణయం కేంద్రంలోని పలు ప్రభుత్వ శాఖల మధ్య చిచ్చు రేపుతున్నాయి. దేశ ప్రజల ఆరోగ్యం కోసం లాక్-డౌన్ కొనసాగించాలని కేంద్ర హోం శాఖ భావిస్తుండగా.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే వాణిజ్య, వ్యవసాయ శాఖలు మాత్రం దాంతో విభేదిస్తున్నాయి. ఇలాగే లాక్-డౌన్ కొనసాగితే… దేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికీ కోలుకోలేదని రెండు శాఖల ఉన్నతాధికారులు వాదిస్తున్నారు. ఇందులో వాణిజ్య శాఖ ఏకంగా హోంశాఖకు లేఖ రాసింది. సడలింపు అనివార్యమని సూచించింది.

‘‘ వాణిజ్య కార్యకలాపాలకు అనుమతించండి.. కొంతమేరకు లాక్ డౌన్ నిబంధనలు సడలించాలి.. ’’ ఇదీ కేంద్ర వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు కేంద్ర హోంశాఖకు చేసిన తాజా సూచన. ఈ మేరకు వాణిజ్య శాఖ కార్యదర్శి హోం శాఖ కార్యదర్శికి సోమవారం ఉదయం లేఖ రాశారు. కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు లాక్ డౌన్ అనివార్యమే అయినప్పటికీ, ఇప్పుడు అమలు చేస్తున్న నిబంధనలను కొనసాగిస్తే మాత్రం దేశం తీవ్రంగా నష్టపోతుందని, లాక్ డౌన్ నిబంధనలను సడలించి, వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించుకునేందుకు అనుమతించాలని కేంద్ర వాణిజ్య శాఖ కోరింది. ఈ మేరకు కొన్ని సలహాలు, సూచనలతో హోమ్ శాఖకు ఓ లేఖను రాసింది. రక్షణాత్మక చర్యలు పూర్తి స్థాయిలో తీసుకుంటూ, వాహన, టెక్స్ టైల్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఫ్యాక్టరీలను తిరిగి తెరిచేందుకు అనుమతించాలని సిఫార్సు చేసింది.

కాగా, ఇప్పటికే 21 రోజులు అమలైన లాక్ డౌన్‌ను నెలాఖరు వరకూ పొడిగిస్తూ సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తున్న సమయంలో వాణిజ్య శాఖ లేఖ రాయడం గమనార్హం. “లాక్ డౌన్ పై తుది నిర్ణయం తీసుకునే ముందు మా సలహాలు పరిశీలించడం.. జాతీయ ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు, ప్రజల వద్ద ద్రవ్య లభ్యత పెంచేందుకు కొన్ని సడలింపులు ఉండాలి”  అని వాణిజ్య శాఖ కార్యదర్శి గురు ప్రసాద్ మోహపాత్రా తన లేఖలో పేర్కొన్నారు.

వ్యవసాయ శాఖ సైతం ఇదే విధమైన సూచనలతో హోమ్ మంత్రిత్వ శాఖను కోరినట్లు తెలుస్తోంది. వ్యవసాయం అత్యంత కీలకమని, పంట చేతికి వచ్చే ఈ సమయంలో వ్యవసాయ కార్యకలాపాలకు ఆటంకం లేకుండా చూడాల్సివుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, పరిశ్రమల ప్రతినిధులతో సంప్రదించిన తరువాత, సామాజిక దూరం పాటిస్తూ, ఉద్యోగులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచి పరిశ్రమలు తెరచుకునే వీలు కల్పించాలని కోరారు. ఇప్పటికే భారత్ లో ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిందని, కరోనా మహమ్మారి ప్రభావంతో అది మరింతగా కుదించుకుపోకుండా చర్యలు చేపట్టాలని సిఫార్సు చేశారు. అయితే వాణిజ్య, వ్యవసాయ శాఖల సూచనలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖా మంత్రి అమిత్ షా ఏమేరకు పరిశీలిస్తారో, పరిగణలోకి తీసుకుంటారో వేచి చూడాలి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu