విదేశాల్లో కొండంత భరోసా.. ఇండియాలో గోరంత ప్యాకేజీనా?

– జీ20 దేశాలతో పోలికే లేని ప్యాకేజీ – ఆసియా‌ దేశాల్లోనూ భారీ ఉద్దీపనలు – ఇండియాలో పెరగనున్న మరింత పేదరికం -UN – హెలికాప్టర్‌ మనీ ఇస్తే నష్టమేనంటున్న నిపుణులు దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది. వలస కార్మికులు సొంత ప్రాంతాలకు పయనమవుతున్నారు. యాక్టివిటీ తగ్గతోంది. ఆర్ధిక కష్టాలు చుట్టుముడుతున్నాయి. కరోనా వ్యాధి కంటే దేశంలో ఆకలి చావులు ఎక్కువగా ఉంటాయన్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. అటు సాయం కోసం ఎదురు చూస్తున్నాయి రాష్ట్రాలు. ఈ నేపథ్యంలో […]

విదేశాల్లో కొండంత భరోసా.. ఇండియాలో గోరంత ప్యాకేజీనా?
Follow us

| Edited By: Team Veegam

Updated on: May 08, 2020 | 7:48 PM

– జీ20 దేశాలతో పోలికే లేని ప్యాకేజీ

– ఆసియా‌ దేశాల్లోనూ భారీ ఉద్దీపనలు

– ఇండియాలో పెరగనున్న మరింత పేదరికం -UN

– హెలికాప్టర్‌ మనీ ఇస్తే నష్టమేనంటున్న నిపుణులు

దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది. వలస కార్మికులు సొంత ప్రాంతాలకు పయనమవుతున్నారు. యాక్టివిటీ తగ్గతోంది. ఆర్ధిక కష్టాలు చుట్టుముడుతున్నాయి. కరోనా వ్యాధి కంటే దేశంలో ఆకలి చావులు ఎక్కువగా ఉంటాయన్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. అటు సాయం కోసం ఎదురు చూస్తున్నాయి రాష్ట్రాలు. ఈ నేపథ్యంలో మోదీ ఏం చేయబోతున్నారు? కోవిడ్‌ తెచ్చిన సవాళ్లకు ఎలాంటి పరిష్కారం చూపిస్తారన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

దేశీయ మార్కెట్లో డిమాండ్‌ పడిపోయింది. ఉత్పత్తి రంగం పడకేసింది. సప్లై చేయిన్‌ సిస్టమ్‌ మొత్తం దెబ్బతింది. దేశ ఆర్ధిక వ్యవస్థ అంతా ఛిన్నాభిన్నమైంది. 2019-20 ఆర్ధిక సంవత్సరంలోనే డబ్బులపరంగా దేశం పీకల్లోతు కష్టాల్లోకి కూరకుపోయింది. ఆటో మొబైల్‌, రియల్‌, ఇన్‌ఫ్రా రంగాలు సంక్షోభంలోకి వెళ్లాయి. గత ఏడాది ఆగస్టులో ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించింది కేంద్రం. అయినా మందగమనం అలాగే ఉంది. మూలిగే నక్కపై తాటిపండు పడినట్టుగా కోవిడ్‌ వచ్చి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో నెలకు సాధారణంగా అయితే 15వేల కోట్లు ఆదాయం వస్తుంది. కానీ ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా 16వందల కోట్లు మాత్రమే వస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేశమంతా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నెల గడవాలంటే కష్టంగా మారడంతో రాష్ట్రాలన్నీ ఇప్పుడు కేంద్రం వైపు చూస్తున్నాయి. ఆదాయం తగ్గిన రాష్ట్రాలు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి.. ఆదుకోవాలని ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో వినతులంటాయి. FRBM పెంచి అప్పులు చేయడానికి అయినా అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి రాష్ట్రాలు‌. అయినా కేంద్రం నుంచి ఉలుకు లేదు.. పలుకు లేదంటూ మంగళవారం మీడియా సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు కేసీఆర్‌. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దంగా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయన్న భావన రాష్ట్రాల్లో పెరగడం మంచిది కాదన్నది నిపుణుల వాదన. కష్టసమయంలో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

ఇక దేశంలో మరో ఆందోళనకరమైన విషయం నిరుద్యోగం. గడిచిన కొన్నేళ్లుగా 7 నుంచి 9శాతం మధ్య ఉండే నిరుద్యోగ రేటు ఏకంగా మే3 నాటికి 27శాతానికి ఎగబాకింది. ప్రతి నలుగురిలో ఒకరి జాబ్‌ పోయిందని CMIE నివేదిక స్పష్టం చేస్తోంది. అటు అసంఘటిత రంగంలో పనిచేసే 40కోట్లమంది ప్రజలూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చేసేందుకు పనిలేదు.. తినేందుకు తిండిలేదు. ఇందులో 14 కోట్ల మంది వలస కూలీలు పట్నం నుంచి మళ్లీ పల్లెబాట పట్టారు. వీరంతా తిరిగి వచ్చేదెప్పుడు.. ఎకనామిక్‌ యాక్టివిటి పెరిగేదెప్పుడన్నది మౌలికమైన ప్రశ్న. లాక్డౌన్ విషయంలో లోపభూయిష్ట నిర్ణయం కూడా ఇందుకు కారణమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పేదలనే కాదు.. వలస కూలీలకు అన్నం పెట్టి ఆదుకోవాలి. దీనిపై స్పష్టమైన విధానం ప్రభుత్వం నుంచి రావాలి.

ఈ నేపథ్యంలోనే అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు ఉపాధి పోవడంలో దేశంలో పేదరికం పెరుగుతుందని యూఎన్‌ నేతృత్వంలోని అంతర్జాతీయ లేబర్‌ ఆర్డనైజేషన్ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 62 కోట్ల 30లక్షల మందికి రేషన్ కార్డులున్నాయి. వారికి ప్రభుత్వం పేదలుగా గుర్తించింది. తాజా సంక్షోభం కారణంగా మరో 35 కోట్లమంది కూడా ఉపాథి లేక పేదరికంలోకి నెట్టబడతారని చెబుతోంది UN లేటెస్ట్‌ రిపోర్ట్‌. దేశీయంగా అన్ని రంగాల్లోనూ రిక్రూట్‌ మెంట్లు నిలిచిపోయాయి. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. చాలావరకు కంపెనీల్లో తీసివేతలు మొదలయ్యాయి. తాజాగా నౌకరీ డాట్‌ కామ్‌ సంస్థ ఇచ్చినివేదిక ఇందుకు అద్దం పడుతోంది. ట్రావెల్ రంగం అత్యధికంగా నష్టపోతుంది. ఈ పై ఛార్టు ఆయా రంగాల్లో పొతున్న ఉద్యోగాల సంఖ్యకు అద్దం పడుతోంది.

అటు ఉత్పత్తి సహా అన్ని రంగాలు ఉద్దీపన ప్యాకేజీల కోసం ఎదురుచూస్తున్నాయి. ఫిక్కీ, CII వంటి సంస్థలు కూడా కేంద్రంపై ఉద్దీపన ప్యాకేజీల కోసం ఒత్తిడి పెంచుతున్నాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం జీడీపీలో 0.8శాతం అంటే లక్షా 70వేల కోట్లు మాత్రమే ప్యాకేజీ ప్రకటించి చేతులు దులుపుకుంది. వాస్తవానికి చాలాదేశాలు కోవిడ్‌ రూపంలో వచ్చిన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారీ ప్యాకేజీలు ప్రకటించాయి. జపాన్‌ ఏకంగా జీడీపీలో 21శాతం కేటాయించగా… అమెరికా 11శాతం వరకూ ఇచ్చింది. G20 దేశాల్లో అడుగు నుంచి రెండోస్థానంలో మనదేశం ఉండటం ఆందోళన కలిగిస్తుంది. విపక్షాల విమర్శలకు కారణమవుతోంది.

G20 దేశాలు మాత్రమే కాదు.. మనపక్కనే ఉన్న ఆసియా దేశాలు కూడా భారీ ప్యాకేజీలతో ప్రజలకు అండగా నిలబడ్డాయి. అటు ప్రజలకు నేరుగా డబ్బు పంచుతూనే.. ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి చిన్న, పెద్ద పరిశ్రమలకు ఉద్దీపనలు ప్రకటించాయి. చివరకు పాకిస్తాన్‌ కూడా తన జీడీపీలో 2.3 శాతం ప్రకటించింది. సింగపూర్‌, వియత్నాం, మలేసియా, ఇండోనేషియా వంటి దేశాలు మనకంటే ముందున్నాయి. కానీ 29లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నా.. ఇంకా నిర్ణయం తీసుకోవడంలో తడబడుతోంది ప్రభుత్వం.

కూలీలంతా గ్రామాలకు వెళుతున్నారు. అక్కడ ఉపాధి లేదు.. పట్టణాల్లో పనులున్నా చేయడానికి కార్మికులు లేరు. లాక్‌డౌన్‌కు ముందు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలే దేశ ఆర్థిక రంగాన్ని ప్రమాదంలో పడేశాయని కొందరు ఆర్ధికవేత్తలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవన్నది నిజం. పన్నులు రూపంలో వచ్చే ఆదాయం తగ్గింది. అయితే హెలికాప్టర్‌ మనీ ద్వారా మార్కెట్లో డిమాండ్‌ సృష్టించాలని సూచిస్తున్నారు. జీడీపీలో 5 నుంచి 6శాతం వరకూ రిజర్వ్‌ బ్యాంకు నేరుగా నగదు ముద్రించి ఇవ్వడం వల్ల పెద్ద నష్టం ఉండదని ప్రముఖ ఆర్ధికవేత్త స్వామినాథన్‌ ఎస్‌. అయ్యర్‌ అభిప్రాయాపడ్డారు. పైగా చాలాదేశాల్లో ఇది విజయవంతమైందని ఆయన గుర్తుచేస్తున్నారు. నగదు ముద్రించడం వల్ల ఇన్‌ప్లేషన్ పెరుగుతుందన్నవాదనలో కొంత నిజం ఉండొచ్చు కానీ… దీని వల్లే ముందుముందు ఆకలి చావులను అరికట్టవచ్చు. ఉపాథి అవకాశాలు సృష్టించి ఆర్ధిక రంగాన్ని గాడిలో పెట్టవచ్చంటున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేసే ముందు ఆలోచించకపోవడం వల్లే వలస కార్మికులు సమస్య పెద్ద ఎత్తెన తలెత్తింది. ప్రపంచ ముందు భారత్ ప్రతిష్ట మసకబారిందన్న విమర్శలున్నాయి. ఆర్ధిక రంగానికి బ్యాక్‌ బోన్‌ అయిన వీరుంతా రివర్స్‌ వలస వెళ్లడంలో యాక్టివిటీపైనా ప్రభావం పడుతోంది. ఇప్పుడు కూడా ఆర్ధిక వ్యవస్థకు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పినట్టు కేంద్రం భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.

సోర్స్‌: వివిధ సంస్థలు, ప్రభుత్వ మరియు సర్వే సంస్థలు :

దేశంలో ఆర్ధిక రంగంపై కోవిడ్‌ ఎఫెక్ట్‌… ఆయా దేశాల్లో ఉద్దీపన ప్యాకేజీలపై జరిగిన బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ లైవ్ షో కోసం కింద లింక్‌ క్లిక్‌ చేయండి