తన చావుకు అడ్డువస్తుందనీ.. భార్యకు నిప్పంటించి ఆపై పురుగుల మందు తాగేశాడు!
ఓ వ్యక్తి అనారోగ్యంతో విసిగి చావుకు సిద్ధ పడ్డాడు. గమనించిన అతడి భార్య పతి దేవుడిని చావొద్దని కాళ్లు పట్టుకుని బతిమిలాడింది. అయితే భార్య ప్రేమానురాగాలు అతడి చావుగా అడ్డుగా భావించి ముందు ఆమెనే చంపాలని అనుకున్నాడు. దీంతో పెట్రోల్ తీసుకొచ్చి ఆమెపై పోసి నిప్పటించాడు. ఆనక తనతో తెచ్చుకున్న పురుగుల మందు తాగేశాడు..

ఖమ్మం, మార్చి 8: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి, ఆపై భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. తిరుమలాయపాలెంకు చెందిన తోటమళ్ల నాగభూషణం రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి మూడు సార్లు ప్రయత్నించగా భార్య జయమ్మ అడ్డుపడింది. రోజురోజుకు అనారోగ్య సమస్య పెరుగుతుండడంతో అడ్డుపడుతున్న భార్యను చంపి ఆ తర్వాత తాను చనిపోవాలనే నిర్ణయానికి నాగభూషణం వచ్చాడు.దీంతో అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ముందుగానే తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు.
ఇంట్లో నుంచి మంటలు వస్తుండగా స్థానికులు గమనించి వారి కుమారుడికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కుమారుడు ఆ భార్యాభర్తలను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ నాగభూషణం మృతి చెందగా, జయమ్మ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. జరిగిన ఘటన పై తిరుమలాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగభూషణంకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా అందరికీ వివాహాలు జరిగాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




