Job Astrology: వారికి అధికార యోగం..! ఈ నాలుగు రాశుల వారికి ఉద్యోగపరంగా కొత్త జీవితం.. అందులో మీరున్నారా?

సాధారణంగా శనీశ్వరుడి కారణంగానే ఉద్యోగాలలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగ స్థానంతో శనికి సంబంధం ఏర్పడినప్పుడు ఉద్యోగంలో అనివార్యంగా మార్పు జరుగుతూ ఉంటుంది.

Job Astrology: వారికి అధికార యోగం..! ఈ నాలుగు రాశుల వారికి ఉద్యోగపరంగా కొత్త జీవితం.. అందులో మీరున్నారా?
Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 28, 2023 | 5:09 PM

సాధారణంగా శనీశ్వరుడి కారణంగానే ఉద్యోగాలలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగ స్థానంతో శనికి సంబంధం ఏర్పడినప్పుడు ఉద్యోగంలో అనివార్యంగా మార్పు జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ స్థానం అయినా దశమ స్థానం మీద శని దృష్టిపడినా లేక దశమ స్థానంలో శని సంచరిస్తున్నా ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడటం, మరో సంస్థకి మారటం, ఉద్యోగం పోవటం, దూర ప్రాంతంలో ఉద్యోగం రావడం, ఉద్యోగంలో బాధ్యతలు పెరగటం లేదా పని భారం ఎక్కువ కావడం వంటివి శని గ్రహం కారణంగానే జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న శనీశ్వరుడి వల్ల నాలుగు రాశుల వారి ఉద్యోగ పరిస్థితిలో భారీగా మార్పు జరగబోతోంది. వృషభం, కర్కాటకం, వృశ్చికం, కుంభరాశులకు ఉద్యోగ పరంగా కొత్త జీవితం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

వృషభ రాశి: 

ఈ రాశి వారికి దశమ స్థానమైన కుంభ రాశిలో శని సంచారం జరుగుతోంది. కుంభరాశి శనికి స్వక్షేత్రమైనందువల్ల వృషభ రాశి వారికి ఉద్యోగ పరంగా స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం పెరగటం, అదనపు బాధ్యతలు మీద పడటం వంటివి తప్పనిసరిగా జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికార యోగానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన విధంగానే ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి.

కర్కాటక రాశి:

ఈ రాశి వారికి దశమ స్థానాన్ని అంటే ఉద్యోగ స్థానాన్ని శని వీక్షించడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వివిధ వృత్తుల్లో ఉన్నవారు సైతం పని భారం వల్ల ఇబ్బంది పడటం జరుగుతుంది. ఉద్యోగంలో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులు అతి కష్టం మీద చిన్న ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు. అధికారంలో ఉన్నవారికి నిర్వహణ బాధ్యతలు బాగా పెరిగి తమ పదవి ఒక ముళ్ళ కిరీటంగా మారుతుంది. ఉద్యోగ జీవితం ఆశించినంత సజావుగా, సాఫీగా సాగే అవకాశం తక్కువగా ఉంటుంది. మంచి సంస్థలోకి ఉద్యోగం మారినప్పటికీ పని భారం మాత్రం తగ్గే అవకాశం ఉండదు.

వృశ్చిక రాశి:

ఈ రాశి వారికి దశమ స్థానాన్ని శని వీక్షించడం వల్ల ఉద్యోగ పరంగా కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో ప్రశాంతత తగ్గుతుంది. ఇంతవరకు అనుభవించిన ప్రాభవం కూడా తగ్గిపోతుంది. ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు ఒక పట్టాన సఫలం కావు. ప్రతిభా వంతులైన నిరుద్యోగులు సైతం మంచి ఉద్యోగం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. ఉద్యోగం మారేందుకు ప్రయత్నాలు చేయటానికి ఇది అనుకూల సమయం కాదనే చెప్పాలి. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగంలోనే కొనసాగడం మంచిది. సాధారణంగా ఉద్యోగ స్థానం మీద శని దృష్టి పడటం వల్ల ఉద్యోగం ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు తలవంచుకొని బాధ్యతలు నిర్వహించడం మంచిది.

కుంభ రాశి:

ఈ రాశి వారికి కూడా ఉద్యోగ స్థానం మీద పూర్తిస్థాయిలో శని వీక్షణం ఉండటం వల్ల ఉద్యోగంలో సానుకూల మార్పులు ఎక్కువగాను, ప్రతికూల మార్పులు తక్కువగాను చోటు చేసు కునే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రస్తుతానికి ఎంత ఒదిగి ఉంటే అంత మంచిది. అయితే, కుంభరాశి శనీశ్వరుడికి స్వస్థానం అయినందు వల్ల, ఉద్యోగానికి ప్రమాదం ఉండకపోవచ్చు కానీ ఒత్తిడి, శ్రమ మాత్రం తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. ఈ శ్రమ వల్ల భవిష్యత్తులో సత్ఫలితా లను పొందటం జరుగుతుంది. ఉద్యోగం మారటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులు తమకు వచ్చిన ఉద్యోగంతో సంతృప్తి పడటం లేదా రాజీపడటం జరుగుతుంది.

ముఖ్యమైన పరిహారాలు:

ఉద్యోగ స్థానం మీద శని దృష్టి పడటం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుకుండా ఉండాలన్న పక్షంలో ఎక్కువగా శివార్చన చేయించడం మంచిది. తరచూ శివాలయానికి వెళ్లి పూజ చేయించడం వల్ల శని తీవ్రత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా కర్కాటక వృశ్చిక రాశి వారు ప్రతి రోజు ఉదయం శివ స్తోత్రం పఠించడం చాలా అవసరం. సోమవారం గానీ, శనివారం గానీ ఉపవాసం ఉండటం కూడా చాలా మంచిది.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..