Zodiac Signs: ఈ నాలుగు రాశులకు ఆధ్యాత్మిక యోగం.. మరి అందులో మీ రాశి ఉందా.?
ఆధ్యాత్మిక సాధకులు, ఆధ్యాత్మిక చింతన పట్ల ఆసక్తి ఉన్నవారు కొత్త సంవత్సరంలో గ్రహ సంచారం వల్ల ఏ విధంగా ప్రయోజనం పొందబోతున్నారన్నది ఆసక్తికర విషయం..
ఆధ్యాత్మిక సాధకులు, ఆధ్యాత్మిక చింతన పట్ల ఆసక్తి ఉన్నవారు కొత్త సంవత్సరంలో గ్రహ సంచారం వల్ల ఏ విధంగా ప్రయోజనం పొందబోతున్నారన్నది ఆసక్తికర విషయం. ప్రాపంచిక జీవితం తో పాటు ఆధ్యాత్మిక జీవితానికి కూడా ప్రాధాన్యం పెరుగుతున్న ఈ రోజుల్లో ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఆధ్యాత్మిక యోగం పట్టబోతోందో తెలుసుకోవాల్సి ఉంది. జ్యోతిషపరంగా ఆధ్యాత్మిక చింతనకు, సాధనకు కారకుడు గురువు. వ్యక్తిగత జాతకంలో గానీ, గ్రహ సంచార పరంగా గానీ గురుగ్రహం బలీయంగా ఉన్న పక్షంలో ఆధ్యాత్మిక పురోగతి సునయాసంగా జరిగిపోతుంటుంది. రాశులలో 1, 5, 9, 12వ రాశులు ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినవి. ఇక ధను రాశి, కుంభరాశి, మీన రాశి కూడా జ్యోతిష పరంగా ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినవే.
ఈ ఏడాది ప్రస్తుతం గురు గ్రహం తన స్వక్షేత్రమైన మీన రాశిలో సంచరిస్తోంది. ఏప్రిల్ 23 తర్వాత తన మిత్ర క్షేత్రమైన మేష రాశి లోకి ప్రవేశిస్తుంది. దీని ప్రకారం ఏ రాశి వారు ఏ విధంగా, ఏ మార్గంలో ఆధ్యాత్మిక చింతనను అనుసరిస్తారు అన్నది పరిశీలించవలసి ఉంటుంది. కాగా, ఆధ్యాత్మిక సాధనలో పురోగతికి సంబంధించినంత వరకు మేష, ధను, రాశి వారికి చాలావరకు సమయం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక చింతనకు, వైరాగ్య భావనలకు శని గ్రహంతో కూడా సంబంధం ఉంది.
మేషం
ఈ రాశి వారికి ప్రస్తుతం వ్యయ స్థానమైన మీన రాశిలో గురుగ్రహం సంచరిస్తోంది. మార్మిక స్థానమైన కుంభరాశి నుంచి శని మేషరాశిని వీక్షించడం జరుగుతోంది. అందువల్ల ఆధ్యాత్మిక సాధకులు, యోగ సాధకులు ఈ సంవత్సరం ఎంతగానో పురోగతి సాధించే అవకాశం ఉంది. భక్తి మార్గంలో ఉన్నవారు కూడా ఎక్కువగా ఆలయాలను సందర్శించడం, తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. ఈ రాశి వారికి 12, 1 రాశుల్లో గురు గ్రహం సంచరించడం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లడానికి వీలైనంత తోడ్పడుతుంది.
ధనుస్సు
ఈ రాశికి అధిపతి అయిన గురుగ్రహం తన స్వక్షేత్రమైన మీనరాశి లోను, ఏప్రిల్ 23 తర్వాత మిత్ర క్షేత్రమైన మేష రాశి లోను సంచరించడం వల్ల ఆధ్యాత్మిక పురోగతికి, సాధనకు, యోగ మార్గం అనుసరించడానికి ఎంతో అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా ఎవరైనా గురువులు తటస్థపడి ఈ రాశి వారికి మార్గదర్శనం చేసే అవకాశం కూడా ఉంది. యోగ మార్గంలోనూ, ధ్యాన మార్గంలోనూ కొత్త పుంతలు తొక్కడానికి కూడా అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఏప్రిల్ 23 తర్వాత వీరి ఆధ్యాత్మిక చింతన మరింతగా పెరిగే సూచనలు ఉన్నాయి.
కుంభం
ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినంత వరకు కుంభరాశి ఒక మార్మిక రాశి. ఈ రాశి వారు సాధారణంగా ఆధ్యాత్మిక చింతనను మనసులోనే ఉంచుకుంటారు. వీరు ఉపాసకులు అవడానికి, అతి రహస్యంగా యోగ సాధన చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ప్రస్తుతం ఆధ్యాత్మిక చింతనకు, వైరాగ్య భావాలకు కారకుడైన శని సంచరించడం వల్ల, వీరి ఆధ్యాత్మిక భావాలు వేగం పుంజుకుంటాయి. ఆధ్యాత్మికంగా వీరు చిత్ర విచిత్రమైన మార్గాలను అనుసరిస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆధ్యాత్మికంగా పరిపక్వత సిద్ధించే అవకాశం కూడా ఉంది.
మీనం
ఈ రాశికి గురు గ్రహమే అధిపతి. మీనరాశిని మోక్ష స్థానం అని కూడా వ్యవహరిస్తారు. వీరికి స్వస్థానంలోనే ఏప్రిల్ 23 వరకు గురు గ్రహం సంచరిస్తున్నందువల్ల అతివేగంగా ఆధ్యాత్మిక సాధన ముందుకు సాగుతుంది. 12వ రాశిలో శని సంచారం వల్ల ఈ రాశి వారికి ఎక్కువగా ఆటంకాలు కూడా ఉండవు. ఆలయాల సందర్శన నుంచి తీర్థయాత్రల వరకు అనేక శుభ పరిణామాలు ఈ ఏడాది చోటు చేసుకునే అవకాశం ఉంది. సాధువులను, సర్వ సంగ పరిత్యాగులను, యోగులను ఎక్కువగా కలుసుకునే సూచనలు ఉన్నాయి.
నిజానికి, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక సాధన అనేవి ఒక్కో రాశికి ఒక్కో విధంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఈ ఏడాది కుటుంబ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం, ఆధ్యాత్మిక జీవితానికి తక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మొదట తన బాధ్యతను నిర్వర్తించడానికే కట్టుబడి ఉంటారు. ఆలయాల సందర్శనకే తన ఆధ్యాత్మిక చింతనను పరిమితం చేసుకుంటారు. మిధున రాశి వారు ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన పుస్తకాలను పఠించడానికే పరిమితం అవుతారు. వీరి ఆధ్యాత్మిక చింతన విషయ పరిజ్ఞానానికి, మేధోపరమైన ఆలోచనలకు మాత్రమే చాలావరకు పరిమితం అవుతుంది. కర్కాటక రాశి వారు ఈ ఏడాది ఆధ్యాత్మిక చింతన తో పాటు, ప్రాపంచిక చింతనకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. వీరికి కుటుంబ బాధ్యతలు అన్నిటికన్నా ముఖ్యం.
సింహ రాశి వారు ఈ ఏడాది ఎక్కువగా తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. వీరి ఆధ్యాత్మిక చింతన అంతవరకే పరిమితం. వీరికి ఉద్యోగ, కుటుంబ వ్యవహారాలే ప్రధానం. ఆధ్యాత్మిక చింతన అనేది వృద్ధాప్యంలో అనుసరించవలసిన వ్యవహారం అని వీరు భావిస్తారు. కన్యా రాశి వారికి ఏప్రిల్ 23 వరకు ఆధ్యాత్మిక చింతన పురోగతిలో ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఈ రాశి వారు ఎక్కువగా లౌకిక విషయాలకే ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబ సమస్యల కారణంగా వీరు ఈ ఏడాది ఆధ్యాత్మిక చింతనను సీరియస్ గా తీసుకునే అవకాశం లేదు. తులా రాశి వారు ప్రాపంచిక విషయాలకు, ముఖ్యంగా విలాస జీవితానికి ఇచ్చినంత ప్రాధాన్యం ఆధ్యాత్మిక చింతనకు, భక్తికి ఇచ్చే అవకాశం లేదు.
వృశ్చిక రాశి వారు కూడా ఏప్రిల్ 23 వరకు భక్తి మార్గంలో నడిచే అవకాశం ఉంది కానీ, వీరు సాధారణంగా సామాజిక హోదా కోసం భక్తి మార్గాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల మీద వీరికి ఈ ఏడాది ఎక్కువగా శ్రద్ధ ఉంటుంది. లౌకిక వ్యవహారాలలో మునిగి తేలుతుంటారు. ఆధ్యాత్మిక చింతనలో కూడా ఆడంబరాలకు, ఆర్భాటాలకు, భేషజాలకు ఇస్తారు. భక్తి పరంగా వీరికి ఒక లక్ష్యం అంటూ ఉండదు. ఇక మకర రాశి విషయానికి వస్తే, ఈ ఏడాది వీరి ఆధ్యాత్మిక చింతన సాధారణ స్థాయిలోనే ఉంటుందని చెప్పవచ్చు. ఈ రంగంలో వీరికి పెద్దగా పురోగతి ఉండకపోవచ్చు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడం మీద వీరు ఎక్కువగా శ్రద్ధ పెడతారు.