AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Dasha Effect: జీవిత పాఠాలు నేర్పించే శని దశ.. దీని ప్రభావం ఏ రాశిపై ఎలా ఉంటుంది? ఆ రాశుల వారికి అదృష్టమే..

ఇతర గ్రహాలకు శని గ్రహానికి ఉన్న తేడా ఏమిటంటే ఇతర గ్రహాలు తెలియకుండా బాధిస్తే శని గ్రహం తెలిసేటట్టు బాధిస్తుంది. జీవిత పాఠాలు నేర్పిస్తుంది.

Shani Dasha Effect: జీవిత పాఠాలు నేర్పించే శని దశ..  దీని ప్రభావం ఏ రాశిపై ఎలా ఉంటుంది? ఆ రాశుల వారికి అదృష్టమే..
Shani Image Credit source: TV9 Telugu
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Feb 22, 2023 | 4:11 PM

Share
శని గ్రహం అంటే చాలామందికి భయం. శని పేరు కలలోకి వచ్చినా ఉలిక్కిపడి లేస్తారు. గ్రహాలన్నింటిలోకి శనీశ్వరుడికే ఎక్కువగా పూజలు, పరిహారాలు చేస్తుంటారు. జాతక చక్రంలో శని దోషం ఉన్నా, శని దశ వచ్చినా ఏదో ఉత్పాతం మీద పడినట్టు హడలిపోతుంటారు. అయితే, జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథాలలో శనిని ఇతర గ్రహాలతో సమానంగానే పరిగణించారు. ఇతర గ్రహాలకు శని గ్రహానికి ఉన్న తేడా ఏమిటంటే ఇతర గ్రహాలు తెలియకుండా బాధిస్తే శని గ్రహం తెలిసేటట్టు బాధిస్తుంది. జీవిత పాఠాలు నేర్పిస్తుంది. కర్మ ఫలాన్ని అనుభవించేటట్టు చేస్తుంది.
శని ప్రధానంగా కర్మ కారకుడు. పూర్వజన్మ సుకృతాన్ని బట్టి జీవితంలో ఏది జరగాలో అదే జరిగేటట్టు చేస్తాడు. శని దశ 19 ఏళ్ళు ఉంటుంది. జాతక చక్రంలో ఇది ఎక్కువ కాలం. మరి శని దశ ఏ రాశుల వారికి మేలు చేస్తుంది? ఏ రాశుల వారికి నష్టాన్ని కలిగిస్తుందో చూద్దాం..

ఎవరెవరికి ఇబ్బంది?

శని దశ ఎవరికీ, ఏదీ ఉచితంగానో, తేలికగానో, కష్టపడకుండానో ఇవ్వదు. కష్టపడటం అంటే శనికి చాలా ఇష్టం. వినయ విధేయతలంటే మరీ ఇష్టం. అహంకారం అంటే నచ్చదు. మేషం, మిధునం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, ధనస్సు, మీనరాశులకు శని ఎక్కువగా ఇబ్బంది పెడతాడు. విపరీతంగా కష్టపెట్టిన తరువాతే వీరికి కొద్దో గొప్పో అదృష్టం ఇస్తాడు.
శనీశ్వరుడి వల్ల సాధారణంగా నాలుగు రాశుల వారికి మాత్రమే కాస్తంత అదృష్టవంతంగా జీవితం గడిచిపోతుంది. అవి వృషభం, తుల, మకరం, కుంభం. ఏయే రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

వృషభ రాశి 

వృషభానికి శని తొమ్మిది, పదవ రాశులకు అధిపతి. అందువల్ల ఈ రాశి వారికి లేదా ఈ లగ్నం వారికి శని యోగ కారకుడు. వీరికి శని దశ అదృష్టం కలిగిస్తుంది. ఇందులో తొమ్మిదవ స్థానం అంటే భాగ్య స్థానం. పదవ స్థానం అంటే వృత్తి ఉద్యోగాలు.  ఈ రాశి వారికి జాతక చక్రంలో శని స్థితి ఏమాత్రం బాగా ఉన్నా వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నత స్థానాలకు చేరుకోవడం ఖాయం అని చెప్పవచ్చు. సాధారణంగా వీరికి శని దశలో విదేశాలకు వెళ్లడానికి, అధికార యోగం పట్టడానికి, మంచి ఆఫర్లు రావటానికి అవకాశం ఉంటుంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, మరో మాజీ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి వంటి ఉద్దండులు వృషభ రాశి వారే. శనీశ్వరుడి దశలోనే వారంతా ఉన్నత స్థానానికి చేరుకోవడం జరిగింది.

తులా రాశి 

నాలుగు, ఐదవ స్థానాల అధిపతిగా తులా రాశి వారికి కూడా శని యోగాన్ని అంటే అదృష్టాన్ని కలిగిస్తాడు. పైగా తులా రాశిలో శని ఉచ్ఛలో ఉంటాడు. అందువల్ల తులా రాశి లేదా తులా లగ్నం వారికి శని దశ ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా తులా రాశిలో శని ఉన్నవారు దేశ విదేశాల్లో సైతం పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. వారిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. ఇందులో నాలుగో స్థానం అంటే సుఖం, ఇల్లు, సామాజిక హోదా. ఐదవ స్థానం అంటే ఆలోచన, పిల్లలు, పథకాలు, ప్రణాళికలు. మహాత్మా గాంధీ, అటల్ బిహారీ వాజ్ పాయ్, నటులు చిరంజీవి, ఎన్టీఆర్ వంటి వారు ఈ తులా రాశికి చెందిన వారే. వీరికి శని కారణంగానే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

మకర రాశి

ఈ రాశికి శనీశ్వరుడే అధిపతి. తను స్థానం అంటే ఒకటవ స్థానానికి, రెండవ స్థానానికి ఈ గ్రహమే అధినాయకుడు. రెండవ స్థానం ధనానికి, కుటుంబానికి, వాక్కుకు సంబంధించినది. ఈ రాశి వారికి శని దశలో సాధారణంగా పేరు ప్రఖ్యాతులు రావడం, గుర్తింపు పొందటం, వారసత్వ సంపద సమకూరటం, ఉద్యోగ పరంగా అనూహ్యంగా అధికారం చేపట్టడం వంటివి జరుగుతుంటాయి. శని రెండవ స్థానానికి కూడా అధిపతి అయినందువల్ల ఈ రాశి వారికి కుటుంబం పట్ల ఇతరుల కంటే ఎక్కువగా ప్రేమ అనుబంధం ఏర్పడతాయి. సంపాదన విషయంలో చక్కని పథకాలు, ప్రణాళికలు వేయటం ఈ రాశి వారికి అలవాటు. ఎక్కువగా పొదుపును పాటించడం వల్ల పిసినారిగా కూడా గుర్తింపు పొందుతారు. ఆచితూచి మాట్లాడటం కూడా వీరికి అలవాటుగా మారుతుంది. మీడియా రంగంలో ప్రసిద్ధులైన జీకే రెడ్డి, వెంకటేశ్వరరావు, రామ్ నాథ్ గోయెంకా, బాపు,  రామానాయుడు వంటి ఉద్దండులు ఈ రాశికి చెందిన వారే. శని కారణంగానే వీరికి అదృష్ట యోగం పట్టింది.

కుంభ రాశి

ఈ రాశి లేదా లగ్నానికి కూడా శనీశ్వరుడే అధిపతి. ఈ రాశి వారికి శని ఒకటవ స్థానానికే కాకుండా 12వ స్థానానికి కూడా అధిపతి. 12వ రాశి అంటే మోక్ష స్థానం. అందువల్ల ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. వీరి మనసు లేదా అంతరంగం ఒక పట్టాన ఎవరికీ అంతు పట్టదు. ఈ రాశి వారు సాధారణంగా ఎక్కువగా మాట్లాడటం జరగదు. అవసరమైతే తప్ప నోరు విప్పరు. ఈ రాశి వారికి శని ప్రాపంచిక సుఖాలకంటే ఆధ్యాత్మిక విషయాల్లోనే ఎక్కువగా అదృష్టం కలిగిస్తాడు. అయితే ధీరు భాయ్ అంబానీ, హర్షద్ మెహతా వంటి వాణిజ్యవేత్తలు ఈ రాశి వారే కావటం గమనించాల్సిన విషయం. ఇక రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, సద్గురు జగ్గీ వాసుదేవ్, రాందేవ్ వంటి ఆధ్యాత్మిక గురువులు కూడా ఈ రాశికి చెందిన వారే. వీరి జాతకాలలో శని కుంభరాశి లోనే ఉండటం జరిగింది.
(కౌశిక్, ప్రముఖ జ్యోతిష్య పండితులు)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..