ఇక రాహువు కొండంత అండ! వచ్చే ఏడాది జూన్ వరకు ఆ రాశులకు శుభయోగాలు
కష్టనష్టాలను కలిగించే రాహువు గురు బలంతో శుభ ఫలితాలు ఇవ్వనున్నాడు. కుంభంలో సంచరిస్తున్న రాహువును గురువు వీక్షించడంతో కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభం, మీన రాశులవారికి మే నుండి ఎదురైన కష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక లాభాలు, పదోన్నతులు, కుటుంబ సౌఖ్యం వంటి శుభ యోగాలు వచ్చే ఏడాది జూన్ వరకు వీరికి సంభవించనున్నాయి. గురుబలంతో రాహువు శుభప్రదంగా మారే కాలం ఇది.

Shubh Yoga
కష్టనష్టాలను కలిగించడంలో రాహవు శనీశ్వరుడి కన్నా బలవంతుడు. అత్యంత పాప గ్రహమైన రాహువు 1, 4, 7, 8, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు బాగా ఇబ్బందులు పెడతాడు. గురువుకు మాత్రమే రాహువు లొంగుతాడని, గురువు మాటే వింటాడని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ప్రస్తుతం కుంభ రాశిలో సంచారం చేస్తున్న రాహువును గురువు పంచమ స్థానం నుంచి వీక్షించడం వల్ల రాహువు తప్పకుండా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభం, మీన రాశులవారిని గత మే నెల నుంచి తీవ్రస్థాయిలో పీడిస్తున్న రాహువు వచ్చే ఏడాది జూన్ వరకు ఇక నుంచి శుభ యోగాలను ఇచ్చే అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశికి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు కారణంగా ఈ రాశివారికి ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు వృద్ధి చెందుతాయి. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. కష్టార్జితం హారతి కర్పూరం అవుతుంది. అనారోగ్యాలు పీడిస్తాయి. అయితే, గురువు గత 6వ తేదీన మిథున రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి రాహువు ప్రవర్తన మారి, ఈ రాశివారిని ధన యోగాలనివ్వడం, పదోన్నతులు కలిగించడం ప్రారంభం అవుతుంది.
- సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న రాహువు వల్ల దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. మోసాలు, ద్రోహాలు చేసేవారు చుట్టూ చేరతారు. అయితే, రాహువు మీద గురు దృష్టి పడిన దగ్గర నుంచి అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాహువు సంచారం వల్ల కుటుంబంలో సుఖశాంతులు తగ్గుతాయి. వ్యక్తిగతంగా సుఖ నాశనం జరుగుతుంది. ఆస్తి, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. సొంత ఇంటి ప్రయత్నాల్లో మోసపోవడం జరుగుతుంది. తల్లి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. రాహువు మీద గురు దృష్టి పడడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
- కుంభం: ఈ రాశిలో రాహువు సంచారం వల్ల శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎంత శ్రమ పడ్డా ఆదా యం పెరిగే అవకాశం గానీ, ఉద్యోగంలో గుర్తింపు లభించడం గానీ ఉండకపోవచ్చు. వృత్తి, వ్యాపా రాలు మందకొడిగా సాగుతాయి. అయితే, గురు దృష్టితో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.
- మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో రాహు సంచారం వల్ల ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటుంది. రాజపూజ్యాల కన్నా అవమానాలు ఎక్కువగా ఉంటాయి. బాగా సన్నిహితులు నమ్మక ద్రోహానికి పాల్పడతారు. ఏ సమస్యా ఒక పట్టాన పరిష్కారం కాదు. రహస్య శత్రువులు తయారవుతారు. అయితే, రాహువు మీద గురువు దృష్టితో జీవితంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. శత్రువుల మీద పైచేయి సాధిస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.



