Astrology: కర్కాటక రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారు కాస్తంత జాగ్రత్త..! ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడి తర్వాత కుజుడిని అత్యంత ప్రమాదకర గ్రహంగా పరిగణిస్తారు. ఏప్రిల్ 3 నుండి జూన్ 6 వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. ఇది కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ వివాదాలు వంటివి సంభవించే అవకాశం ఉంది. సుందరకాండ పారాయణ, సుబ్రహ్మణ్యాష్టక పఠనం వంటి పరిహారాల ద్వారా ఈ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

Telugu Astrology
జ్యోతిషశాస్త్రం ప్రకారం శనీశ్వరుడి తర్వాత అత్యంత ప్రమాదకారి గ్రహం కుజుడు. అధికారం, ఆదాయంతో పాటు పోరాటాలకు, రక్త పాతానికి, విభేదాలకు, వివాదాలకు కూడా కారకుడైన కుజుడు ఏ క్షణంలో ఎటువంటి ఉపద్రవాన్ని, ఉత్పాతాన్ని కలిగిస్తాడన్నది ఊహకందని విషయం. ఏప్రిల్ 3న కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశించి నీచబడడం జరుగుతోంది. నీచబడిన కుజుడు ఒక మారణాయుధంతో సమానమని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. సుందరకాండ పారాయణ, సుబ్రహ్మణ్యాష్టక పఠనం వల్ల కుజుడి చెడు ఫలితాలు బాగా తగ్గడం జరుగుతుంది. కర్కాటక రాశిలో జూన్ 6 వరకూ సంచారం చేయబోతున్న కుజుడి వల్ల మిథునం, సింహం, ధనుస్సు, మకరం, కుంభ రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
- మిథునం: ఈ రాశికి ధన స్థానంలో కుజుడి ప్రవేశం వల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరగడంతో పాటు, మిత్రుల వల్ల, బంధువుల వల్ల డబ్బు నష్ట పోయే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబంలో ఊహించని విభేదాలు, అపార్థాలు తలెత్తుతాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు తగ్గుతాయి. ఉద్యోగులకు ప్రాధాన్యం తగ్గుతుంది. ఆదాయ ప్రయత్నాల్లో ఆటంకాలు, అవరోధాలు ఏర్పడతాయి.
- సింహం: ఈ రాశికి వ్యయ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఏ ప్రయత్నమూ కలిసి రాదు. అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు బాగా పెరుగుతాయి. రావలసిన సొమ్ము ఒక పట్టాన చేతికి అందదు. సహాయం పొందిన బంధుమిత్రులు ముఖం చాటేసే అవకాశం ఉంది. దాంపత్య సుఖం లోపిస్తుంది. అనవసర ప్రయాణాలతో ఇబ్బంది పడతారు. సొంత వాహనాలను నడపడంలో ప్రమాదాలు ఎదురవుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి స్థానభ్రంశం కలుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి అష్టమ స్థానంలో నీచ కుజుడి సంచారం వల్ల జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తడం, ఏదో రూపేణా ఎడబాటు కలగడం, జీవిత భాగస్వామి అనారోగ్యంతో ఇబ్బంది పడడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల వల్ల, ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే లేదా మోస పోయే అవకాశం ఉంటుంది. ఆస్తి వివాదాలు ముదిరే సూచనలున్నాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన కలిసి రావు. ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
- మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో నీచ కుజుడి సంచారం వల్ల సుఖ సంతోషాలు కొద్దిగా తగ్గుతాయి. కుటుంబంలో టెన్షన్లు పెరుగుతాయి. ప్రతి ప్రయత్నంలోనూ, ప్రతి పనిలోనూ వ్యయప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. కొందరు బంధుమిత్రులు ఆర్థికంగా మోసగించే అవకాశం ఉంది. జీవిత భాగ స్వామితో విభేదాలు, అపార్థాలు తలెత్తుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు వెళ్లవు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎదురవుతాయి. ఆదాయ వృద్ధికి ఆటంకాలు కలుగుతాయి.
- కుంభం: ఈ రాశికి ఆరవ స్థానంలో నీచ కుజుడి ప్రవేశం వల్ల రుణ, రోగ, శత్రు బాధలు వృద్ధి చెందే అవకాశం ఉంది. మనశ్శాంతి తగ్గిపోతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగాల్లో అధికారులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా తగ్గుతాయి. కొందరు బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసర పరిచయాలకు, నష్ట దాయక వ్యవహారాలకు అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల వల్ల బాగా నష్టపోవడం జరుగుతుంది.