Birth Star Astrology: వారి జీవితం రాజసంగా గడిచిపోతుంది.. ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటబోతుందంటే..?
ఒక్కో నక్షత్రానికి ఒక్కో గ్రహం అధినాయకుడుగా ఉంటాడు. మొత్తం 27 నక్షత్రాలకు 9 గ్రహాలు అధినాయకులుగా లేదా అధిపతులుగా ఉండడం జరుగుతుంది. అంటే ఒక్కో గ్రహానికి మూడు నక్షత్రాలు ఉంటాయి.

ఒక్కో నక్షత్రానికి ఒక్కో గ్రహం అధినాయకుడుగా ఉంటాడు. మొత్తం 27 నక్షత్రాలకు 9 గ్రహాలు అధినాయకులుగా లేదా అధిపతులుగా ఉండడం జరుగుతుంది. అంటే ఒక్కో గ్రహానికి మూడు నక్షత్రాలు ఉంటాయి. సంబంధిత గ్రహాన్ని బట్టి నక్షత్ర బలం ఆధారపడి ఉంటుంది. నక్షత్రాల వారీగా ఫలాలను చెప్పుకునేటప్పుడు ఆ నక్షత్ర నాథుడు ఏ రాశిలో ఏ స్థితిలో ఉన్నాడన్నది ప్రాధాన్యం సంతరించుకుంటుంది. దీన్ని బట్టి ఆ నక్షత్రాలకు సంబంధించిన వ్యక్తుల భవిష్యత్తును ఇక్కడ పరిశీలిద్దాం.
- అశ్విని, మఖ, మూల: ఈ మూడు నక్షత్రాలకు అధిపతి కేతువు. ఇది సహజమైన వక్ర గ్రహం. ఈ కేతు గ్రహం ప్రస్తుతం తులా రాశిలో సంచరిస్తోంది. కేతు గ్రహానికి తులా రాశి శత్రు క్షేత్రం. అందువల్ల శుభ ఫలితాలను ఎక్కువగా ఇవ్వడం జరగదు. ప్రయత్నాల విషయంలో రెండు అడుగులు ముందుకు వేస్తే ఒక అడుగు వెనక్కు వేయడం జరుగుతుంది. ఒక పట్టాన ఏదీ ముందుకు సాగనివ్వదు. ఇది అక్టోబర్ 24న ఈ రాశి నుంచి కన్యారాశికి మారుతుంది. అంతవరకు ఈ నక్షత్రాల వారికి విఘ్నాలు తప్పవు.
- భరణి, పుబ్బ, పూర్వాషాఢ: ఈ నక్షత్రాలు శుక్ర గ్రహానికి చెందినవి. ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్న శుక్ర గ్రహం వల్ల ఈ నక్షత్రాల వారికి ప్రయాణాల వల్ల ఎక్కువగా కలిసి వస్తుంటుంది. వృత్తి, ఉద్యోగాలే కాకుండా, వ్యాపారాలు సైతం ఆశాజనకంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబ జీవితంలో అన్యోన్యత, సామరస్యం పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఘన విజయాలు సాధిస్తారు. పుర ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం, ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటాయి.
- కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ: ఈ నక్షత్రాలకు అధిపతి అయిన రవి గ్రహం ప్రస్తుతం తన స్వక్షేత్రమైన సింహరాశిలో సంచరిస్తు న్నందువల్ల జీవితం రాజసంగా గడిచిపోతుంది. సహాయ సహకారాలు అందించే బంధుమిత్రులుంటారు. సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. తండ్రి నుంచి వారసత్వంగా ఆస్తి లభిస్తుంది. ప్రతి క్షణం హుందాగా జీవితం గడుపుతారు.
- రోహిణి, హస్త, శ్రవణం: ఈ నక్షత్రాలకు చంద్రుడు అధిపతి. చంద్రుడు పరాధీన గ్రహం అయినందువల్ల, అంటే సూర్యుడి మీద ఆధారపడిన గ్రహం అయినందువల్ల ఈ నక్షత్రాల వారు కూడా ఇతరుల సహాయం లేనిదే అభివృద్ధి చెందడం సమస్యగా ఉంటుంది. అయితే, ఈ నక్షత్రాల వారు స్నేహానికి విలువనిచ్చే వ్యక్తులు అయినందువల్ల సహాయ సహకారాలు అందించగల స్నేహితులుంటారు. సాధారణంగా ఈ నక్షత్రాలవారు ఆర్థికంగా కంటే పేరు సేవల్లోనూ, ప్రతిష్టలు తెచ్చుకోవడంలోనూ ముందుంటారు.
- మృగశిర, చిత్త, ధనిష్ట: ఈ నక్షత్రాలు కుజుడికి సంబంధించినవి. వీరిలో కోపతాపాలతో పాటు ఆధిపత్య ధోరణి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ కుజ గ్రహం బుధుడి రాశి అయిన కన్యారాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక విషయాల్లో, బ్యాంకింగ్ విషయాల్లో ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించడం జరుగుతుంది. ఆర్థికంగా పైకి రావడంలో, అధికారం చేపట్టడంలో, పురోగతి సాధించడంలో రాజీలేని ధోరణి అనుసరిస్తారు. పట్టుదలగా ప్రయత్నాలను కొనసాగించి, చివరికి ఆశించిన విజయం అందుకుంటారు.
- ఆర్ద్ర, స్వాతి, శతభిషం: రాహువుకు చెందిన ఈ నక్షత్రాలు దినదినాభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రాల వారికి ఏదో విధంగా అధికారం చేపట్టాలని, ఏదో విధంగా సంపాదించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రాహువు గురువుతో కలిసి మేష రాశిలో సంచరిస్తున్నందువల్ల ఈ నక్షత్రాల వారికి తప్పకుండా శుభ యోగాలు కలుగుతాయి. క్రమక్రమంగా కోరికలు, ఆశయాలు నెరవేర్చుకోవడం జరుగుతుంది. అక్టోబర్ 24లోగా ఈ రాశివారు అధికారానికి రావడం, సంపాదించడం జరుగుతుంది.
- పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర: ఈ నక్షత్రాలకు గురువు అధిపతి అయినందువల్ల, ఆ గురువు ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్నందువల్ల వీరికి తప్పకుండా ఆర్థికంగా, అధికారపరంగా అదృష్టం పడుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ గురువు మేషరాశిలోనే సంచరిస్తున్నందువల్ల ఈ నక్షత్రాల వారికి తిరుగుండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వీరి మాట బాగా చెల్లుబాటు అవుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగం కలుగుతుంది.
- పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర: ఇవి శనీశ్వరుడి నక్షత్రాలు. శని ప్రస్తుతం తన స్వక్షేత్రమైన కుంభరాశిలో సంచారం చేస్తున్నందు వల్ల ఈ రాశివారికి విశేషంగా కలిసి వస్తుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. అటు వృత్తి, ఉద్యోగాల్లోనూ, ఇటు ఆర్థికంగానూ స్థిరత్వం లభిస్తుంది. సహాయ కార్యక్రమాల్లోనూ, వితరణ కార్య క్రమాల్లోనూ పాల్గొంటారు. అయితే, కెరీర్ పరంగా బాగా శ్రమకు, ఒత్తిడికి గురి కావడం జరుగుతుంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు.
- ఆశ్లేష, జ్యేష్ట, రేవతి: ఈ తారలకు అధిపతి అయిన బుధుడు ప్రస్తుతం తన మిత్ర క్షేత్రమైన సింహరాశిలో, మిత్రుడైన రవితో కలిసి సంచారం చేస్తున్నందువల్ల కొన్ని శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి కావడం, నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగాలు లభిం చడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనూహ్యంగా లాభాలు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.



