మీ వ్యక్తిగత పురోగతికి వారితో అవరోధాలు.. ఆటంకాలు కల్పించే గ్రహాలు ఏవో తెలుసా..?
జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రతి రాశివారికి ఒక ‘బాధక’ గ్రహం ఉంటుంది. బాధక గ్రహమంటే ఆటంకాలు, అవరోధాలు సృష్టించే గ్రహమన్నమాట. వ్యక్తిగత పురోగతికి అడ్డుపడే ఈ గ్రహాన్ని బట్టి ఒక వ్యక్తి జీవితంలో పురోగతికి ఎటువంటి వ్యక్తులు అడ్డుపడతారన్నది అర్థం చేసుకోవచ్చు. జ్యోతిష గ్రంథాలను బట్టి, చర రాశులైన మేషం, కర్కాటకం, తుల, మకర రాశులకు..
Astrology in Telugu: జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రతి రాశివారికి ఒక ‘బాధక’ గ్రహం ఉంటుంది. బాధక గ్రహమంటే ఆటంకాలు, అవరోధాలు సృష్టించే గ్రహమన్నమాట. వ్యక్తిగత పురోగతికి అడ్డుపడే ఈ గ్రహాన్ని బట్టి ఒక వ్యక్తి జీవితంలో పురోగతికి ఎటువంటి వ్యక్తులు అడ్డుపడతారన్నది అర్థం చేసుకోవచ్చు. జ్యోతిష గ్రంథాలను బట్టి, చర రాశులైన మేషం, కర్కాటకం, తుల, మకర రాశులకు 11వ స్థానాధిపతి బాధకుడవుతాడు. స్థిర రాశులైన వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులకు 9వ స్థానాధిపతి బాధకుడు. ఇక ద్విస్వభావ రాశులైన మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశులకు 7వ స్థానాధిపతి బాధకుడవుతాడు. బాధక స్థానాధిపతి బాధక స్థానంలోనే ఉండే పక్షంలో సాధకుడు అవుతాడని గ్రంథాలు చెబుతున్నాయి. అప్పుడు ఆ గ్రహం ఏ ఆటంకాలూ లేకుండా చేస్తుంది. వివిధ రాశులను ఈ బాధకుడు ఏ విధంగా బాధపెడతాడో ఇక్కడ పరిశీలిద్దాం.
- మేషం: ఈ చర రాశికి 11వ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు బాధకాధిపతి. వృత్తి, ఉద్యోగాలలో పురోగతికి అడ్డుపడుతుంటాడు. ముఖ్యంగా కింది స్థాయి ఉద్యోగులు కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటారు. అధి కారులతో కుమ్మక్కయి, ఈ రాశివారిని దెబ్బ తీస్తుంటారు. దుష్ర్పచారం సాగిస్తుంటారు. కొందరు స్నేహితులు కూడా శత్రువులుగా మారడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ బాధక స్థానంలో బాధకాధి పతి శనీశ్వరుడే ఉన్నందువల్ల 2025 మార్చి వరకు ఈ కుట్రలు, కుతంత్రాలు పని చేయక పోవచ్చు.
- వృషభం: ఈ రాశికి 9వ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు బాధకాధిపతి. ఈ రాశివారిని కాయకష్టం మీద తప్ప అదృష్టం మీద ఆధారపడనివ్వడు. పురోగతి ఉంటుంది కానీ, నత్తనడకగా సాగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎక్కువగా శ్రమపడడం జరుగుతుంది. కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. తండ్రి నుంచి సమస్యలు ఉంటాయి. పితృభాగ్యం బాగా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ శనీశ్వరుడు దశమ స్థానంలో ఉన్నందువల్ల ఉద్యోగంలో మందకొడిగా పురోగతి ఉంటుంది.
- మిథునం: ఈ రాశివారికి సప్తమ స్థానాధిపతి అయిన గురువు బాధకాధిపతి. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వా ములతో బాగా సమస్యలుంటాయి. వీరి వ్యూహాలకు భాగస్వాములు అడుగడుగునా అడ్డుపడు తుంటారు. వీరు సొంతగా వ్యాపారాలు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో సమస్యలుంటాయి. వీరి వల్ల పురోగతి మందగిస్తూ ఉంటుంది. ప్రస్తుతం బాధకాధిపతి గురువు లాభస్థానంలో ఉన్నందువల్ల స్నేహితులు, సన్నిహితుల వల్ల దెబ్బ తినే అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశివారికి లాభస్థానాధిపతి అయిన శుక్రుడు బాధకాధిపతి. ఈ రాశివారికి శత్రువులు స్నేహితుల రూపంలో ఉంటారు. నమ్మించి ద్రోహం చేసే వారుంటారు. వీరి వల్ల వ్యక్తిగత పురోగతి కుంటుపడుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల వల్ల నష్టపోతుంటారు. స్త్రీలతో పరిచయాలు పురోగతిని దెబ్బతీస్తూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో స్త్రీ సహోద్యోగులకు దూరంగా ఉండడం మంచిది. ప్రస్తుతం శుక్రుడు ఇదే రాశిలో సంచరిస్తున్నందువల్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
- సింహం: ఈ రాశివారికి 9వ స్థానాధిపతి అయిన కుజుడు బాధకాధిపతి. రక్త సంబంధీకులు, కనిష్ట సోదరుల వల్ల పురోగతికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు సైతం అవరోధాలు సృష్టిస్తూ ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్యాలు, శస్త్రచికిత్సల వంటి వాటితో జాగ్రత్తగా ఉండడం మంచిది. తరచూ ఉద్యోగాలు మారడం వల్ల కూడా పురోగతి కుంటుపడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నందువల్ల ఎవరితోనైనా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది.
- కన్య: ఈ రాశివారికి 7వ స్థానాధిపతి అయిన గురువు బాధకాధిపతి. చిన్నప్పుడు టీచర్ల నుంచి, పెద్దయిన తర్వాత అధికారుల నుంచి అడుగడుగునా వేధింపులుంటాయి. ఈ రాశివారిని చూసి అసూయపడేవారు ఎక్కువగా ఉంటారు. అధికారులు సైతం పురోగతికి అడ్డు తగులుతుంటారు. ఇక జీవిత భాగస్వామితో సమస్యలుంటాయి. ఇవి ఈ రాశివారిని ముందుకు సాగనివ్వవు. ప్రస్తు తం ఈ గురువు అష్టమంలో ఉన్నందువల్ల జీవిత భాగస్వామి తరఫు సమస్యలు మరీ ఇబ్బంది పెడతాయి.
- తుల: ఈ రాశివారికి 11వ స్థానాధిపతి అయిన రవి బాధకాధిపతి. తండ్రి నుంచి, అధికారుల నుంచి సమస్యలుంటాయి. ప్రభుత్వ వర్గాల కారణంగా నుంచి సంపాదనంతా నష్టమైపోతుంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నతాధికారులు ఉపయోగించుకుని వదిలేస్తుంటారు వ్యాపారాల్లో పోటీదార్లు ఎక్కువగా ఉంటారు. కొందరు స్నేహితులు కూడా ఇబ్బందులు, సమస్యలు సృష్టిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ రవి గ్రహం 11వ స్థానంలోనే ఉన్నందువల్ల అంతగా సమస్యలు ఉండక పోవచ్చు.
- వృశ్చికం: ఈ రాశికి 9వ స్థానాధిపతి అయిన చంద్రుడు బాధకాధిపతి. తండ్రి వైపు నుంచే కాకుండా తల్లి వైపు నుంచి కూడా ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతుంటాయి. కుటుంబ బాధ్యతలు ఎక్కు వగా మోయవలసి వస్తుంది. వీటివల్ల వ్యక్తిగత పురోగతి మీద దృష్టి పెట్టలేని పరిస్థితి ఏర్పడు తుంది. ముఖ్యంగా తండ్రి అండదండలు కరువవుతాయి. ప్రయాణాల వల్ల, బదిలీల వల్ల బాగా నష్టపోతుంటారు. ప్రస్తుతం చంద్ర సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల పెద్దగా కష్టాలు ఉండక పోవచ్చు.
- ధనుస్సు: ఈ రాశివారికి 7వ స్థానాధిపతి అయిన బుధుడు బాధకాధిపతి. జీవిత భాగస్వామి రూపంలో వ్యక్తిగత పురోగతికి అడ్డుపడుతుంటాడు. జీవిత భాగస్వామి అనుకూలంగా లేకపోవడం, తరచూ అనారోగ్యాలకు గురవుతుండడం వంటివి కారణాలు కావచ్చు. వ్యాపార భాగస్వాముల వల్ల కూడా పురోగతి మందగిస్తుంది. మేనమామలు, మావయ్య వరుసయ్యే వారు కూడా ఇబ్బంది పెట్టే అవ కాశం ఉంటుంది. ప్రస్తుతం బుధుడు అనుకూలంగా ఉన్నందువల్ల పురోగతికి అడ్డంకులు ఉండక పోవచ్చు.
- మకరం: ఈ రాశివారికి 11వ స్థానాధిపతి అయిన కుజుడు బాధకాధిపతి. ఈ కుజుడు ఎక్కువగా సహోద్యోగుల రూపంలో ఇబ్బందులు సృష్టిస్తుంటాడు. వృత్తి, ఉద్యోగాలలో సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభించకపోవచ్చు. ఈ రాశివారిని చూసి అసూయ పడేవారు ఎక్కు వగా ఉంటారు. సోదర వర్గం వారు కూడా దుష్ప్రచారం సాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ కుజుడు 9వ స్థానంలో ఉన్నందువల్ల బదిలీలు, ప్రయాణాల వల్ల బాగా డబ్బు నష్టం జరుగుతుంటుంది.
- కుంభం: ఈ రాశివారికి 9వ స్థానాధిపతి అయిన శుక్రుడు బాధకాధిపతి కావడం వల్ల తండ్రి కారణంగా పురోగతి కుంటుపడే అవకాశం ఉంటుంది. తండ్రి పరిస్థితి బాగా లేకపోవడం వల్ల లేదా పెంపకంలో లోపం వల్ల, తండ్రి నుంచి సహకారం లభించకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో పురోగతి చోటు చేసుకోకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు ఎక్కువగా ఉండక పోవచ్చు. ప్రస్తుతం ఈ శుక్రుడు ఆరవ స్థానంలో ఉన్నందువల్ల ఉద్యోగంలో ప్రతిష్టంభన ఏర్పడుతుంది.
- మీనం: ఈ రాశివారికి ఏడవ స్థానాధిపతి అయిన బుధుడు బాధకాధిపతి. సహచరుల నుంచి బాగా సమస్యలుంటాయి. వారి నుంచి ఒక పట్టాన సహాయ సహకారాలు లభించకపోవచ్చు. జీవిత భాగస్వామి నుంచి కూడా ఆటంకాలు, అవరోధాలు ఉండవచ్చు. వ్యాపార భాగస్వాములు కూడా సమస్యలు సృష్టిస్తుంటారు. వీటన్నిటివల్ల వ్యక్తిగత పురోగతి కుంటుపడుతూ ఉంటుంది. ప్రస్తుతం బుధుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నందువల్ల జీవిత భాగస్వామి నుంచి సమస్యలు పెరగవచ్చు.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.