Zodiac Signs: ఈ అయిదు రాశులవారు పరోపకార పాపన్నలు.. వారి దయా గుణానికి హద్దులుండవు..!
జ్యోతిష శాస్త్రం ప్రకారం ఐదు రాశుల వారు ఇతరులకు మేలు చేయడానికే పుడతారు. వృషభం, తుల, మకరం, కుంభం, మీన రాశుల వారు సాధారణంగా ఎవరికో ఒకరికి ఏదో విధంగా ఉపయోగపడుతూనే ఉంటారు. మిగిలిన రాశుల వారు కూడా ఇదే విధంగా ఇతరులకు సహాయ పడుతూనే ఉండే అవకాశం ఉంది..
జ్యోతిష శాస్త్రం ప్రకారం ఐదు రాశుల వారు ఇతరులకు మేలు చేయడానికే పుడతారు. వృషభం, తుల, మకరం, కుంభం, మీన రాశుల వారు సాధారణంగా ఎవరికో ఒకరికి ఏదో విధంగా ఉపయోగపడుతూనే ఉంటారు. మిగిలిన రాశుల వారు కూడా ఇదే విధంగా ఇతరులకు సహాయ పడుతూనే ఉండే అవకాశం ఉంది కానీ కొన్ని గ్రహాల కలయిక మీద, స్థితి మీద ఈ లక్షణం ఆధారపడి ఉంటుంది. కానీ, పైన పేర్కొన్న ఐదు రాశుల వారు మాత్రం సహజసిద్ధమైన పరోపకారి పాపన్నలు. ఈ రాశుల వారికి ఈ ఏడాది మూడు శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వీరి పరోపకార పరాయణత్వం మరింత విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశుల వారు ఇతరులకు ఏ విధంగా సహాయపడబోయేది ఇక్కడ పరిశీలిద్దాం.
- వృషభ రాశి: ఈ రాశి వారిలో ఔదార్యం, దయాగుణం వంటివి కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. ఇతరులకు సహాయం చేయడంలో అందరికంటే ముందుంటారు. కుల, మత, వర్గ, ప్రాంత తేడా లేకుండా ఎవరికో ఒకరికి కొద్దో గొప్పో సహాయం చేస్తూనే ఉంటారు. అంతేకాక, ఎవరో ఒకరి భారం మోస్తూనే ఉండటం కూడా ఈ రాశి వారి సహజ లక్షణం. వీరి సంపాదనలో కొంత భాగం పరోప కారం మీదే వ్యయం అవుతూ ఉంటుంది. ఈ ఏడాది శుక్ర, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనాయాసంగా అప్రయత్నంగా డబ్బు రావడం సంపాదన పెరగటం వంటివి జరిగే అవకాశం ఉంది. ఫలితంగా ఈ రాశి వారి పరోపకార గుణం మరింతగా విస్తరించడం జరుగుతుంది.
- తులా రాశి: ఈ రాశి వారికి ఈ ఏడాది గురు, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరి సంపాదన బాగా మెరుగుపడటం జరుగుతుంది. ఎవరికో ఒకరికి సహాయం చేయకుండా ఉండలేని ఈ రాశి వారు అన్నదానం, వితరణ, సామాజిక సేవ వంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. సాధారణంగా వీరి సహాయం నిస్వార్ధంగా జరుగుతూ ఉంటుంది. గుప్త దానాలు చేయడంలో ఈ రాశి వారు మేటి అని చెప్పవచ్చు. పేదల పట్ల, జంతువుల పట్ల, అనాధల పట్ల వీరికి దయాగుణం ఎక్కువగా ఉంటుంది. చిన్న సేవలకు కూడా ఎక్కువగా ముట్టజెప్పడం వీరి సహజ లక్షణం. ఈ ఏడాది వీరు ఇతరులకు సహాయం చేయడంలో కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది.
- మకర రాశి: సాధారణంగా ఈ రాశి వారి పరోపకార గుణానికి హద్దులు ఉండవు. తమకు ఇష్టమైన వారికి, తమకు నచ్చిన వారికి, తమ దృష్టి పడిన వారికి ఏదో విధంగా సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా రహస్య సహాయం లేదా గుప్త సహాయం చేయడం వీరికి సహజ లక్షణంగా ఉంటుంది. వీరు ఎవరికి ఎందుకు సహాయం చేస్తున్నారన్నది ఒక అంతు పట్టని విషయంగా ఉంటుంది. ముఖ్యంగా పేదల పట్ల, అట్టడుగు వర్గాల పట్ల, ఆర్థిక సమస్యలలో ఉన్న వారి పట్ల వీరిలో కనిపించే దయాగుణం సాటిలేనిది. సామాజిక సేవ వీరికి ఎంతో ఇష్టమైన అంశం. ఏదో ఒక కుటుంబం వీరి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటుంది. ఈ ఏడాది ఈ రాశి వారికి గురు, బుధ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వితరణ కార్యక్రమాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది.
- కుంభ రాశి: ఈ రాశి వారు ఎక్కువగా ప్రజాసేవ కోసమే పుట్టినట్టుగా జీవితం గడుపుతుంటారు. బాగా పిసినార్లుగా బయటికి కనిపించినప్పటికీ వీరి దయా గుణానికి, పరోపకార పరాయణత్వానికి హద్దులు ఉండవు. వ్యక్తిగత ఖర్చులు కూడా తగ్గించుకొని, అవసరమైతే వైద్య ఖర్చులను కూడా దూరం పెట్టి ఇతరులకు సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది. బుధ శుక్ర గ్రహాలు ఈ ఏడాది బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం పెరగటం, అందుకు తగ్గట్టుగా వితరణలు పెరగటం తప్పకుండా జరుగుతుంది. అన్నదానం, ఆర్థిక సహాయం వంటివి మరీ ఎక్కువగా చోటుచేసుకుంటాయి. ఒకటి రెండు కుటుంబాలను పూర్తిస్థాయిలో ఆదుకోవడం కూడా జరుగుతుంది.
- మీన రాశి: సహజంగా ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా కలిగి ఉండే మీన రాశి వారు డబ్బు సంపాదన మీద లేదా సంపద కూడబెట్టుకోవడం మీద దృష్టి పెట్టరు. వీరిలో మానవత్వం కాస్తంత ఎక్కువగానే వెల్లి విరుస్తూ ఉంటుంది. అవతలి వారిలో చిన్న బాధ కనిపించినా వీరిలో పరోపకార గుణం కట్టలు తెంచుకుంటుంది. ఈ రాశి వారు సున్నిత మనస్కులు కూడా అయినందువల్ల ఎక్కువగా అనాధలకు, వృద్ధులకు, రోగులకు అండగా ఉండటం జరుగుతూ ఉంటుంది. వీరు చేసే వృత్తి ఉద్యోగాలు కూడా ఇందుకు అనుకూలంగానే ఉంటాయి. పేద పిల్లలను దత్తత తీసుకోవడం, పేద పిల్లలకు చదువులు చెప్పించడం వంటివి వీరి జీవితాలలో ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ రాశి వారికి ఈ ఏడాది గురు బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం పెరిగి ఎక్కువగా వితరణ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..