TDP vs YSRCP: ఏపీ రాజకీయాల్లో దుమ్ముదుమారం.. పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై విచారణకు ఆదేశం..
మాజీమంత్రి పెద్దిరెడ్డి భూ ఆక్రమణల ఆరోపణలు.. ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఇవి కక్షసాధింపు చర్యలని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే..అటు అధికార పక్షం మాత్రం విచారణలో అన్నీ వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెబుతోంది. ఈ లోపే ఉలికిపాటు ఎందుకని ప్రశ్నిస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన కమిటీ.. క్షేత్రస్థాయి పర్యటనలో అసలు విషయం బయటపెట్టేందుకు చర్యలు చేపట్టింది.

వరుస కేసులు.. ఆరోపణలు.. అనుచరుల అరెస్ట్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే.. ఇసుక దోపిడీ, ఎర్రచందనం అక్రమ రవాణా, మదనపల్లె ఫైల్స్ దహనం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు..పెద్దిరెడ్డి. ఇప్పుడు తాజాగా పెద్దిరెడ్డిని..భూ ఆక్రమణల ఆరోపణలు చుట్టుముట్టాయి. పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలోని పులిచర్ల మండలం మంగళంపేటలో 70ఎకరాలకు పైగా అటవీ భూములు ఆక్రమించి.. ఎస్టేట్ నిర్మించారనేది పెద్దిరెడ్డిపై వచ్చిన ఆరోపణలు. మంగళంపేట రెవెన్యూ గ్రామానికి చెందిన భూ రికార్డుల్లోని వివరాల ప్రకారం.. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములను అన్యాక్రాంతం చేసిందని ప్రభుత్వం భావిస్తోంది. ఫెయిర్ అడంగల్ రికార్డు, ఎఫ్ఎంబిలో ఉన్న దానికన్నా వెబ్‌ల్యాండ్ అడంగల్‌లో అదనంగా భూములున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించింది.
కలెక్టర్, జిల్లా ఎస్పీ, అనంతపురం రేంజ్ ఫారెస్ట్ కన్జర్వేటర్‌తో కమిటీ
పెద్దిరెడ్డిపై వచ్చిన భూ ఆక్రమణలపై విచారించేందుకు..చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ, అనంతపురం రేంజ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ యశోదబాయిలతో కమిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ ఆదేశాలతో ప్రాథమిక ఆధారాలతో నివేదిక సిద్ధం చేస్తున్నారు కలెక్టర్. మరోవైపు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు మంగళం పేట రెవెన్యూ రికార్డులను కలెక్టరేట్‌కు తరలించారు..పులిచెర్ల తహాశీల్దార్ జయసింహ. అయితే ప్రభుత్వం తనపై కక్షపూరితంగానే కేసులు పెడుతోందని ఆరోపిస్తున్నారు పెద్దిరెడ్డి. మంగళంపేటలో ఒక్క ఎకరా అటవీ భూమిని కూడా తాను ఆక్రమించుకోలేదన్న పెద్దిరెడ్డి..25 ఏళ్లుగా ఆ భూములు తన ఆధీనంలోనే ఉన్నాయంటున్నారు.
ఈ భూముల వ్యవహారంపై గతంలోనూ విచారణ జరిపి అటవీ భూములు లేవని తేల్చారని చెబుతున్నారు పెద్దిరెడ్డి. తాను ఎలాంటి వాడినో చిత్తూరు జిల్లా ప్రజలతో పాటు చంద్రబాబుకు కూడా తెలుసన్నారు. ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొంటాను తప్ప పారిపోయే ప్రసక్తే లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు..వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. తమ కుటుంబం కొనుగోలు చేసింది అటవీ భూమి కాదని గతంలోనే కేంద్రం చెప్పిందన్నారు. తమపై కక్ష సాధింపులో భాగంగానే విచారణకు ఆదేశించారని ఆరోపించారు..మిధున్‌రెడ్డి.
అయితే పెద్దిరెడ్డి వాదనను తప్పుపడుతున్నారు..టీడీపీ నేతలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చిత్తూరు జిల్లాలోని కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను పెద్దిరెడ్డి కొట్టేశారని ఆరోపిస్తున్నారు..టీడీపీ నేతలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజల భూములను పెద్దిరెడ్డి లాక్కున్నారని ఆరోపించిన పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లాబాబు..ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ మాజీమంత్రి భూ కబ్జాల బాగోతాన్ని కమిటీ బయట పెడుతుందని స్పష్టం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు తండ్రీ, కొడుకులు పెద్ద ఎత్తున భూ కబ్జాలు, దందాలు చేశారని ఆరోపించారు..మంత్రి రాంప్రసాద్‌రెడ్డి. మంగళంపేటలో అటవీ భూములను ఆక్రమించి ఎస్టేట్ కట్టుకున్నారన్నారు. పెద్దిరెడ్డికి 26 ఎకరాల భూమి ఉంటే.. 100 ఎకరాల్లో ఎస్టేట్ కట్టారన్నారు. అలాగే మదనపల్లిలో ఐదు ఎకరాల చెరువును ఆక్రమించారనీ..తిరుపతిలో మఠం భూములు కబ్జా చేసి కల్యాణమండపం నిర్మించారని ఆరోపించారు.
ఐదేళ్లపాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలు చేసిన పెద్దిరెడ్డి.. ఇప్పుడు తనకేం తెలియదంటే పోతుందా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. పుంగనూరులో ఓటర్ల లిస్ట్ కంటే పెద్దిరెడ్డి చేసిన పాపాల లిస్టే పెద్దగా ఉంటుందన్నారు..టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. పెద్దిరెడ్డి 75 ఎకరాల ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకోవడమే కాక దర్జాగా అడవిలోకి రోడ్డు వేసుకొని ప్యాలెస్ కట్టుకున్నారు… అనూరాధ
మరోవైపు టీడీపీ నేతలు అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు..వైసీపీ నేతలు. అరాచకాలు, ఆక్రమణలకు పెద్దిరెడ్డి వ్యతిరేకమని..తనపై వచ్చిన ఆరోపణల నుండి కడిగిన ముత్యంలా పెద్దిరెడ్డి బయటకు వస్తారని భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
సర్వే నంబరు 295, 296లలో ఎంత భూమి ఉంది?
పెద్దిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై ఓ వైపు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే..మరోవైపు ప్రభుత్వం నియమించిన కమిటీ మాత్రం వాస్తవాలను వెలికి తీసేప్రయత్నం మొదలుపెట్టింది. సర్వే నంబరు 295, 296లలో ఎంత భూమి ఉంది? పాత అడంగల్‌లో ఎవరి పేరు ఉంది? పెద్దిరెడ్డి, ఆయన కుటుంబీకుల పేర్లపైకి ఎలా వచ్చింది? అనే వివరాలను కలెక్టర్ ఆరాతీశారు. ఈ వారంలో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి తుది నివేదిక ఇవ్వనున్నారు..సంయుక్త కమిటీలోని అధికారులు. దీంతో వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..