YCP Plenary: అంబరాన్నంటిన వైసీపీ ప్లీనరీ.. కేడర్‌లో ఫుల్ జోష్.. మొదటి రోజు సాగిందిలా..!
YCP Plenary: ఏపీలో వైసీపీ ప్లీనరీ మొదటి రోజు సమావేశం గ్రాండ్‌గా జరిగింది. తల్లి విజయలక్ష్మితో కలిసి ప్లీనరీకి హాజరయ్యారు సీఎం జగన్. ముందుగా వైసీపీ జెండాను ఆవిష్కరించిన..
YCP Plenary: ఏపీలో వైసీపీ ప్లీనరీ మొదటి రోజు సమావేశం గ్రాండ్‌గా జరిగింది. తల్లి విజయలక్ష్మితో కలిసి ప్లీనరీకి హాజరయ్యారు సీఎం జగన్. ముందుగా వైసీపీ జెండాను ఆవిష్కరించిన వైఎస్ జగన్.. తర్వాత వైఎస్‌ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ప్రారంభోపన్యాసం చేశారు. ఎన్ని అడ్డంకులు, అవమానాలు ఎదురైనా.. కార్యకర్తలు తనకు అండగా నిలబడ్డారని అన్నారు సీఎం జగన్. వైసీపీ జెండాను గుండెగా మార్చుకున్న కేడర్‌కు సెల్యూట్ చేశారు. ఇక వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేశారు.ఏపీలో జగన్‌ను ప్రజలు ఎంతో ఆదరించారని.. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నారన్నారు విజయమ్మ అన్నారు. ఇలాంటి సమయంలో జగన్ కన్నా తన అవసరం షర్మిలకే ఎక్కువ ఉందన్నారు. దీంతో ఈ పార్టీలో ఉండడం భావ్యం కాదని.. అందుకే రాజీనామా చేస్తున్నానన్నారు విజయమ్మ. వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్టు విజయమ్మ ప్రకటించిన తర్వాత.. భావోద్వేగానికి గురైన తల్లిని ఓదార్చారు సీఎం జగన్. తల్లితో కాసేపు ముచ్చటించారు.
ప్లీనరీలో మంత్రులు ఏమన్నారంటే..
సీఎం జగన్ నవరత్నాలు తప్పు అనే దుష్ప్రచారాలకు ప్రతిపక్షాలు దిగాయన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. వారి హయాంలో జరగనిది జగన్ హయాంలో జరుగుతుంటే చూసి ఓర్వలేకపోయారన్నారు. ఏపీ ప‍్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. పిల్లలకు మనం ఇచ్చే విలువైన ఆస్తి విద్య మాత్రమే అన్నారు. అమ్మఒడి వంటి స్ఫూర్తిదాయక పథకాలు అమలు అవుతున్నాయన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.
ఆవేశంలో అల్లూరికి, పోరాటంలో చెగూవెరాకు, ఆలోచనలో అంబేడ్కర్‌కు, ఆశయ సాధనలో జ్యోతి ఫులేకు, ఆచరణలో మహాత్మా గాంధీకి ప్రతిబింబంబం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని మంత్రి విడదల రజిని అన్నారు.
మహిళా సాధికారత, దిశ చట్టంపై ప్రసంగించారు మంత్రి ఉషశ్రీ చరణ్. 50శాతమని చెప్పినా అంతకంటే ఎక్కువగానే మహిళలకు అవకాశం కల్పించిన ఘనత సీఎం జగన్‌దని కొనియాడారు.
ఇది వైసీపీ ప్లీనరీలా లేదు.. రెండోసారి జగన్ ప్రమాణస్వీకారంలా ఉందన్నారు మంత్రి రోజా. సోనియాను గడగడలాడించిన పార్టీ అని.. చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టించిన పార్టీ పంచ్ డైలాగులు విసిరారు.
వైసీపీ ప్లీనరీ సందర్భంగా వరుణుడు హర్షం ప్రకటించాడని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. ప్రత్యర్థులపై తాము ప్రకటించే యుద్ధభేరి ఎలా ఉంటుందో చూస్తారని అన్నారు.
ఇక పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతల రాకతో కోలాహలంగా మారింది ప్లీనరీ ప్రాంగణం. పలువురు వైసీపీ నేతలు కళాకారులతో కలిసి వేదికపై చిందేశారు. వారి పాటలకు స్టెప్పులేశారు.
దీంతో వైసీపీ సంబరం అంబరాన్నంటింది. మళ్లీ జగనే సీఎం అంటూ పాటలతో ఉర్రూతలూగించారు కళాకారులు. డాన్సులతో హోరెత్తించారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. వైసీపీ ప్లీనరీ వేడుకలతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఇవాళ దాదాపు లక్షమంది వరకు పార్టీ శ్రేణులు వచ్చినట్టు అంచనా వేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచీ భారీ ర్యాలీలుగా పార్టీ శ్రేణులు తరలి వచ్చారు. లీడర్స్‌తో పాటు కేడర్ ఫుల్ జోష్‌తో ఉన్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
వైసీపీ ప్లీనరీతో గుంటూరులో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇవాళ, రేపు వైసీపీ సమావేశాలు జరుగుతుండడంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయి. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా హైవే పక్కనే వైసీపీ ప్లీనరీ జరుగుతుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
మూడేళ్ల పాలనపై ఫోటో ఎగ్జిబిషన్..
వైఎస్ఆర్ కుటుంబం ఫోటోలు, సీఎం జగన్ చేసిన సంక్షేమ పధకాలు, నెరవేర్చిన హామీలు చిత్ర రూపంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మూడేళ్ల పాలనలో తాము చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించేలా ఈ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న వైసీపీ శ్రేణులను ఆ ఫొటో ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి