YSR Congress: వైసీపీకి “విజయమ్మ రాజీనామా”.. ప్లీనరీ వేదికగా సంచలన ప్రకటన..
YS Vijayamma Resigns: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ విజయలక్ష్మిని పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఇలాంటి రోజు వస్తుందని తాను అనుకోలేదన్నారు. వైసీపీ ప్లీనరీ వేదికపైనే ఆమె రాజీనామా ప్రకటన చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భార్య, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తల్లి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ విజయలక్ష్మిని పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఇలాంటి రోజు వస్తుందని తాను అనుకోలేదన్నారు. వైసీపీ ప్లీనరీ వేదికపైనే ఆమె రాజీనామా ప్రకటన చేశారు. వక్రీకరణలకు, విమర్శలకు తావు లేుకుండా ఉండేందుకే రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. షర్మిలకు అండగా ఉండేందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. షర్మిలకు రాజకీయంగా అండగా ఉంటా.. తల్లిగా జగన్‌కు ఎప్పుడూ మద్దతుగా ఉంటానన్నారు. ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు, వేర్వేరు పార్టీలకు ప్రతినిధులుగా ఉన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రస్థానమంతా జనంతో ముడిపడి ఉందన్నారు.
మహానేత వైఎస్సార్ 73వ జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైసీపీ నిర్వహిస్తున్నారు. ప్లీనరీ సమావేశాలకు హాజరైన వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. రాజశేఖరరెడ్డి అందరివాడు. మీ అందరి హృదయాల్లో వైఎస్సార్‌గారు సజీవంగా ఉన్నారని అన్నారు. జగన్ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఉద్దండ నాయకులకే వైఎస్ జగన్ గొంతు ఎండిపోయేలా చేశారు. ఈ రోజు సగర్వంగా ప్లీనరీ జరుపుకుంటున్నాం. మీ అందర్నీ ఆశీర్వదించడానికి, అభినందించడానికి నేను వచ్చాను. ప్రజల అభిమానం, ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్‌సీపీ పుట్టింది. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.
వైఎస్ జగన మాస్ లీడర్. జగన్ యువతకు రోల్‌మోడల్. మీ అందరి ప్రేమ సంపాదించిన జగన్‌ను చూసి గర్వపడుతున్నా. నా బిడ్డను నడిపించుకోమని మీకే అప్పజెప్పా. నా బిడ్డను నడిపించిన మీ అందరిపైనా నా అణువణువునా కృతజ్ఞత ఉంది. మీ బిడ్డల్ని జగన్ చేతుల్లో పెట్టండి, వారికి ఉజ్వల భవిష్యత్ అందిస్తారు. మీతో నా అనుబంధం ఈనాటిది కాదు, 45 ఏళ్ల అనుబంధం ఉంది. ఇకపైనా ఈ అనుబంధం కొనసాగాలి అంటూ వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు.