Bank Scam: ఘరానా మోసం.. భారీగా డిపాజిట్లు చేసుకుని బోర్డు తిప్పేసిన బ్యాంకు..!
Bank Scam: పిల్లల పెళ్ళిళ్ళ కోసం దాచుకున్న వారు ఒకరు, వైద్యం కోసం బిడ్డలిచ్చిన డబ్బుల్ని భద్రంగా పెట్టుకున్న వారు ఇంకొకరు. పిల్లల చదువుల కోసం పైసా పైసా కూడబెట్టిన..
Bank Scam: పిల్లల పెళ్ళిళ్ళ కోసం దాచుకున్న వారు ఒకరు, వైద్యం కోసం బిడ్డలిచ్చిన డబ్బుల్ని భద్రంగా పెట్టుకున్న వారు ఇంకొకరు. పిల్లల చదువుల కోసం పైసా పైసా కూడబెట్టిన వాళ్ళు ఇంకొకళ్ళు. ఇంట్లో చెప్పిన వాళ్ళొకరు, ఎవ్వరికీ చెప్పకుండా డబ్బు బ్యాంకులో పెట్టినవాళ్లు ఎందరో. అందర్నీ నట్టేట్లో ముంచి ఎంచక్కా చెక్కేసింది జయలక్ష్మి. మోసపోయామని తెలిసేలోగా డైరెక్టర్ సహా, బ్యాంకు మేనేజర్లు, సిబ్బంది అంతా ఊరి నుంచి ఉడాయించేశారు. దీంతో రోడ్డునపడ్డ కాకినాడలోని ఖాతాదారులు ధర్నాచౌక్ వద్ద రిలే నిరాహార దీక్షకు దిగారు. కష్టపడి సంపాదించిన డబ్బు. 12.5 శాతం వడ్డీ వస్తుందని ఆశపడ్డారు. పిల్ల పెళ్ళికో, అనారోగ్యం నుంచి బయటపడటానికో, పిల్లల చదువుకో పనికొస్తుందనుకున్నారు. అంతా మూటగట్టి బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. సొసైటీ బ్యాంకు బోర్డు తిప్పేయడంతో జనం గుండెలు బాదుకుంటున్నారు.
బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసిన వారిలో రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులు, సీనియర్ సిటిజన్లు, వివిధ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. ది జయలక్ష్మి కో ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ జయలక్ష్మి కోట్లాది రూపాయలతో పరారయ్యారు. అయితే పదిరోజులు గడుస్తున్నా ఈ బడామోసగాళ్ళని ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ మేనేజర్లు ను అరెస్ట్ చేస్తే అసలు విషయం బయటపడుతుందంటున్నారు.
కాకినాడ జిల్లా సర్పవరం జంక్షన్ కేంద్రంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ సుమారు రూ. 520 కోట్లు డిపాజిట్లుగా సేకరించినట్లు సమాచారం. కాకినాడ సర్పవరం హెడ్ ఆఫీస్ కేంద్రంగా 28 బ్రాంచీల్లో జయలక్ష్మి కో- ఆపరేటివ్ సొసైటీ బ్యాంకులు ఉన్నాయి. ఘరానా మోసగాళ్ళని పట్టుకొని బాధితులకు న్యాయం చేయాలంటూ జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు బాధితులు నిరాహార దీక్షని కొనసాగిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి