Kodali Nani: హైదరాబాద్‌ను కోల్పోయి అనాథలమయ్యాం.. ఆ ఉద్యమాన్ని దేవుళ్లు కూడా హర్షించరు: కొడాలి నాని
అమరావతి ఉద్యమాన్ని దేవుళ్లు కూడా హర్షించరని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. అందరికీ న్యాయం చేయాలనే ఆకాంక్షతోనే సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
అమరావతి ఉద్యమాన్ని దేవుళ్లు కూడా హర్షించరని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. అందరికీ న్యాయం చేయాలనే ఆకాంక్షతోనే సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. వైసీపీ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై అమ్మ వారి ఆశీస్సులు కూడా ఉండాలని కొడాలి నాని ఆకాంక్షించారు. దసరా పర్వదినానాన్ని పురస్కరించుకుని బుధవారం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని కొండాలమ్మ అమ్మ వారి ఆలయంలో కొడాలి నాని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలంటూ మొక్కుకున్నానని నాని తెలిపారు.
రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల సంక్షేమం కోసమే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నామని నాని వెల్లడించారు. అమరావతి ఉద్యమాన్ని ప్రజలతోపాటు దేవుళ్లు కూడా హర్షించరంటూ వ్యాఖ్యానించారు. కులాలు, పార్టీల కోసమో కాకుండా.. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేయకూడదన్న భావనతోనే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని వివరించారు. రాష్ట్ర సంపద అంతా ఒకే చోట పెడితే ప్రాంతీయ విద్వేషాలు వస్తాయని తెలిపారు.
ఇప్పటికే హైదరాబాద్‌ను కోల్పోయి అనాథలమయ్యామని.. మళ్లీ శ్రమ అంతా అమరావతిపైనే పెడితే అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటూ నాని అభిప్రాయపడ్డారు. అందుకే సీఎం జగన్.. అందరికీ న్యాయం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.