Andhra Pradesh: నా చావుకు అతనే కారణం.. సెల్ఫీ వీడియో తీసుకుని యువతి బలవన్మరణం..
ఆంధ్రప్రదేశ్‌లో ఓ యువతి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రేమ పేరిట ఓ యువకుడు వేధించడంతో.. మనస్థాపం చెందిన ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఓ యువతి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రేమ పేరిట ఓ యువకుడు వేధించడంతో.. మనస్థాపం చెందిన ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా, తనకల్లు మండలం యర్రబల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. నల్లచెరువుకు చెందిన రాళ్లపల్లి ఇంతియాజ్ అనే యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచమై వేధిస్తున్నాడని.. తన చావుకు అతనే కారణమని మృతురాలు సంధ్యారాణి సెల్ఫీ వీడియోలో తెలిపింది. ఈ విషయం తెలిసి తన తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారని, ఆవేదన చెందుతున్నారని తెలిపింది. సెల్ఫీ వీడియోలో మాట్లాడిన అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం యువతి తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. దీంతో సంధ్యారాణి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కూతురి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోగిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంతియాజ్ తెలుగుదేశం పార్టీకి చెందిన ఐటీడీపీ సోషల్ మీడియాలో పని చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. పోస్ట్ మార్టం కోసం యువతి మృతదేహాన్ని కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఇదంతా తన తప్పేనని.. తన తల్లిదండ్రులకు ఎలాంటి సంబంధం లేదని యువతి చేసిన వీడియో ఇప్పుడీ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. అనవసరంగా తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని. ఏదైనా ఉంటే పోలీసులకు చెప్పి పరిష్కరించుకోవల్సింది పోయి.. తొందరపాటు నిర్ణయం తీసుకుందని కుటుంబసభ్యులు వాపోతున్నారు.
సోషల్ మీడియాలోని ఫేస్ బుక్, తదితర పరిచయాలన్ని నిజమేనని నమ్మి మోస పోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అకారణంగా ఒక నిండు ప్రాణం బలై పోయిందని.. ఇలాంటి అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. విచారణ అనంతరం ఇంతియాజ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తనకల్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..