AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IAS Officers Marriage: హంగు ఆర్భాటం లేకుండా సింపుల్‌గా ఒక్కటైన ఐఏఎస్‌ల జంట.. ఆదర్శంగా నిలుస్తున్న కలెక్టర్లు!

సాధారణంగా ఐఏఎస్‌ అధికారి స్థాయిలో ఉన్న వ్యక్తులు పెళ్లంటే ఎలా ఉంటుంది.. మేళ తాళాలు, సహపంక్తి భోజనాలతో అట్టహాసంగా జరుగుతుంది. కానీ ఇక్కడో ఇద్దరు ఐఏఎస్‌లు మాత్రం ఈ హడావుడి అంతా లేకుండా ఏంతో నిరాడంబరంగా, సాంప్రదాయంగా వివాహం చేసుకొని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకు ఆ యువ ఐఏఎస్ అధికారులు ఎవరనేగా మీ డౌట్‌ తెలుసుకుందాం పదండి.

IAS Officers Marriage: హంగు ఆర్భాటం లేకుండా సింపుల్‌గా ఒక్కటైన ఐఏఎస్‌ల జంట.. ఆదర్శంగా నిలుస్తున్న కలెక్టర్లు!
Andhra News
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Nov 22, 2025 | 6:41 PM

Share

వివాహం అంటే.. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట.. మేళ తాళాలు, సహపంక్తి భోజనాలు.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సందడి.. అట్టహాసంగా ఏర్పాట్లు.. స్థాయికి తగ్గట్టుగా ఆతిథ్య మర్యాదలు..! జీవితంలో ఒక్కసారి చేసుకునే వివాహం అంటే దిగువ మధ్య తరగతి ప్రజలకు కూడా ఇప్పుడు అట్టహాసంగా చేసుకోవడం ట్రెండ్‌గా మారిపోయింది. లక్షల మాట పక్కన పెడితే.. కోట్లాది రూపాయల ఖర్చు చేసిన పెళ్లిళ్లు కూడా ఉన్నాయి. కానీ విశాఖలో ఓ ఇద్దరు యువ ఐఏఎస్ నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. సాంప్రదాయ బద్ధంగా ఆలయంలో ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటై.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో సంతకాలు చేసి దండలు మార్చుకున్నారు. చట్టబద్ధంగా దంపతులయ్యారు. హంగు ఆర్భాటం లేకుండా జరిగిన వివాహానికి రెండు కుటుంబాలు హాజరై ఆశీర్వదించాయి. సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అధికారులు సిబ్బంది మధ్య చట్టబద్ధంగా దంపతులైన వీరిని అభినందించారు.

ఇంతకీ ఆ యువ ఐఏఎస్ అధికారులు ఎవరంటే.. వధువు తిరుమణి శ్రీ పూజ, వరుడు ఆదిత్య వర్మ. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ గా తిరుమణి శ్రీ పూజ ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. ఇక.. ఆదిత్య వర్మ మేఘాలయ క్యాడర్ కు చెందిన ఐఏఎస్. ఆ రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. వేరువేరు రాష్ట్రాలు వేరువేరు బ్యాచులకు చెందిన ఈ యువ ఐఏఎస్ లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. కుటుంబ సభ్యులు ఇష్టపడ్డారు.. వధూవరులు కూడా ఐఏఎస్‌లు కావడంతో వారి అభిప్రాయాలు కూడా కలిశాయి. దీంతో ఏడడుగులు నడవాలని నిర్ణయించుకున్నారు.

అంతేకాదు నిరాడంబరంగా వివాహం చేసుకొని ఆదర్శంగా నిలవాలని అనుకున్నారు. ఇద్దరి అభిప్రాయాలను పెద్దలు కూడా అంగీకరించారు. దీంతో విశాఖలోని ఓ శివాలయంలో సాంప్రదాయ బద్దంగా వివాహం చేసుకొని. వన్ టౌన్ లోని జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చారు. అక్కడ చట్టబద్ధంగా వివాహ రిజిస్ట్రేషన్ చేసుకుని సంతకాలు పెట్టారు. ఒకరికి ఒకరు దండలు మార్చుకున్నారు. రెండు వైపులా కుటుంబాలు.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సిబ్బంది వారిని ఆశీర్వదించి.. అభినందించారు. నిజంగా ఈ కాలంలోనూ… నిరాడంబరంగా వివాహం చేసుకున్న ఈ యువ ఐఏఎస్ జంట మరింత మందికి ఆదర్శంగా నిలిచి కలకాలం సుఖ సౌఖ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us