AP Government: ఇక ఏపీలో అది కుదరదంటే.. కుదరదు.. కొత్త చట్టం తీసుకొచ్చే యోచనలో సర్కార్..
ప్రభుత్వ వైద్యులు అయి ఉండి.. ప్రైవేటు ప్రాక్టీసు ఏంటి? ఇక నుంచి అది కుదరదు అంటే కుదరదు అంటోంది ఏపీ ప్రభుత్వం. ప్రైవేటు ప్రాక్టీసు మానుకోవాలని తేల్చి చెప్పింది.
ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు వైద్యం అందించడంపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించబోతుంది. దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌లు వేర్వేరు చోట్ల పని చేస్తున్న వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం విధించనున్నారు. దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ప్రభుత్వం కొత్తగా చేపట్టనున్న రిక్రూట్ మెంట్ ప్రక్రియలో ఈ నిబంధన విధించనుంది.
గతంలో ప్రభుత్వంలో నియమితులైన వైద్యులకూ ప్రైవేటు ప్రాక్టీసు నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా 14,037 మంది వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఫార్మాసిస్టు పోస్టుల నియామకానికి అనుమతిచ్చిన ప్రభుత్వం.. 3194 మంది నర్సింగ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని భావిస్తోంది.
సిబ్బంది నియామకానికి సెప్టెంబర్ 27 తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వం. 85 రోజుల్లోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే భారీగా నియామక ప్రక్రియ చేపట్టింది ఏపీ ప్రభుత్వం. కొత్తగా నియమించనున్న వైద్యులు, నర్సులు, ఫార్మాసిస్టుల కోసం ఏటా ప్రభుత్వంపై అదనంగా 676 కోట్ల రుపాయల భారం పడనుంది.
కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఆస్పత్రులు నిర్మిస్తున్నా.. సిబ్బంది లేక రోగులకు సేవలు అందని పరిస్థితి ఏర్పడుతోంది. సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలే మనం నిత్యం చూస్తున్నాం. ఇకపై దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందంటూ శుక్రవారం నాటి సమీక్ష సమావేశంలో సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇవి కూడా చదవండి: MLA Roja: నగరిలో చెల్లని ఎమ్మెల్యే రోజా మాట.. ఇలా తిరగబడ్డారేంటి..?