మూడేళ్ల క్రితం పెళ్లి.. పిల్లలు పుట్టలేదంటూ వేధింపులు.. చివరకు గ్రామ చెరువులో..
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వివాహిత అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. రామసముద్రం మండలం బాలసముద్రం గ్రామం సమీపంలోని చెరువులో వివాహిత మృతదేహం లభ్యమైంది.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వివాహిత అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. రామసముద్రం మండలం బాలసముద్రం గ్రామం సమీపంలోని చెరువులో వివాహిత మృతదేహం లభ్యమైంది. భర్తతో పాటు కుటుంబసభ్యులే ఆమెను చంపేశారంటూ వివాహిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. అన్నమయ్య జిల్లా పెద్దపంజాణి మండలం చీమనపల్లికి చెందిన అమృతకు.. బాలసముద్రానికి చెందిన గణేష్‌తో మూడేళ్ల క్రితం పెళ్లైంది. పెళ్లి అయిన కొంతకాలానికే గణేష్ కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారంటూ.. అమృత బంధువులు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో సంతానం కలగకపోవడానికి అమృతనే కారణం అంటూ గణేష్ మరింత వేధించసాగాడు. భర్తతోపాటు, అత్త వేధింపులు కూడా తీవ్రమవ్వడంతో.. అమృత పుట్టింటి దృష్టికి తీసుకెళ్లిది. దీంతో గతంలో పెద్దలు పంచాయతీ కూడా నిర్వహించారు. అయినా పరిస్థితి మారలేదు. ఈ నెల 15 నుంచి అమృత కనిపించడం లేదంటూ.. ఆమె తల్లిదండ్రులకు గణేష్ సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత రోజే రామసముద్రం పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది.
ఈ క్రమంలో గ్రామంలోని చెరువులోనే అమృత శవమై తేలడంతో పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్థులు, బంధువుల ఆందోళన చేస్తున్నారు. గణేష్ హత్య చేసి చెరువులో పడేశారని అమృత తల్లి ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అమృత భర్త గణేష్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..