Mandamus: కంటిన్యూస్ మాండమస్ అంటే ఏమిటి.. దీన్ని కోర్టు ఏ సమయాల్లో ఉపయోగిస్తుంది?

అమరావతి రాజధాని పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలనేది ఆ తీర్పు సారాంశం. అయితే ఈ విషయంలో హైకోర్టు కంటిన్యూస్ మాండమస్ డిక్లేరేషన్ ఇవ్వడం హాట్ టాపికైంది.

Mandamus: కంటిన్యూస్ మాండమస్ అంటే ఏమిటి.. దీన్ని కోర్టు ఏ సమయాల్లో ఉపయోగిస్తుంది?
Ap High Court
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 03, 2022 | 2:50 PM

Continuous Mandamus: అమరావతి(Amaravati) రాజధాని పై ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) హైకోర్టు(High Court) తీర్పునిచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలనేది ఆ తీర్పు సారాంశం. అయితే ఈ విషయంలో హైకోర్టు కంటిన్యూస్ మాండమస్ డిక్లేరేషన్ ఇవ్వడం హాట్ టాపికైంది. అసలు మాండమస్ అంటే ఏమిటి. ఈ కంటిన్యూస్ మాండమస్ అంటే ఏంటనే అంశం చర్చనీయాంశమైంది. రాజధాని విషయంపై మొత్తం 70 పిటిషన్లను విచారించిన త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పునిచ్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలంది. అమరావతి భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని, రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి భూములు ఇవ్వొద్దని చెప్పింది కోర్టు. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని చెప్పింది. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 6 నెలల్లో ఒప్పందం ప్రకారమే అభివృద్ధి చేయాలి. మూడు నెలల్లోనే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. అమరావతి అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అభివృద్ధి పనులు ఎంత వరకు వచ్చాయి. రైతులకు ప్లాట్లు అప్పగించారా లేదా.. ఏంటనే విషయం పై హైకోర్టు గమనిస్తూ ఉంటోంది. దాన్నే కంటిన్యూస్ మాండమస్ అంటారు.

మాండమస్ రిట్.. చట్టబద్ధమైన విధిని నిర్వహించాలని సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఇచ్చే ఉత్తర్వులను రిట్ లు అంటారు. భారతదేశంలో హేబియాస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, క్వో వారంటో, సెర్టియోరారి రిట్ లను కోర్టులు జారీ చేస్తాయి. మాండమస్‌ అంటే ఆదేశం అని అర్థం. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జారీ చేసే అత్యున్నత ఆదేశమే మాండమస్. ఇందులో కంటిన్యూ మాండమస్ డిక్టేర్ అంటే కోర్టు తానిచ్చిన తీర్పును పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వాధికారి లేదా సంస్థ తన చట్టబద్ధ విధులను నిర్వర్తించనప్పుడు ప్రజల హక్కులకు భంగం కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఆ విధులను నిర్వర్తించాలని న్యాయస్థానం ఈ రిట్‌ను జారీ చేస్తుంది. ఈ రిట్ ను పబ్లిక్, క్వాజి పబ్లిక్, జ్యుడీషియల్, క్వాజి జ్యుడీషియల్‌ సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయొచ్చు. భారతదేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 32లో రిట్లు, పరిధి, పరిమితుల గురించి వివరణ ఉంది. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు జారీ చేసే ప్రత్యేక ఆదేశాలను రిట్లు అంటారు. వీటిని జారీచేసే పద్ధతిని బ్రిటిష్‌ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. నిబంధన–32 ప్రకారం వీటిని జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. నిబంధన–226 ప్రకారం రాష్ట్ర హైకోర్టులకు కూడా రిట్ జారీ చేయవచ్చు. పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా ఈ అధికారాన్ని జిల్లా న్యాయస్థానాలకు కూడా కల్పించొచ్చు. కాకపోతే ఇప్పటివరకు పార్లమెంటు ఇలాంటి చట్టాలను రూపొందించలేదు. సుప్రీంకోర్టు, హైకోర్టులకు మాత్రమే రిట్లు జారీచేసే అధికారం ఉంది. అయితే రిట్ల జారీలో సుప్రీం కోర్టు, హైకోర్టుల మధ్య వ్యత్యాసాలున్నాయి.

ప్రాథమిక హక్కుల పరిరక్షణలో సుప్రీంకోర్టుకు ప్రత్యేక, ప్రధాన, ప్రాథమిక విచారణ పరిధి ఉంటోంది. వాటికి భంగం వాటిల్లినప్పుడు సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల పరిరక్షణకు పూనుకుంటోంది. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ప్రకరణ–32 ప్రకారం పౌరులు తమ హక్కుల కోసం నేరుగా సుప్రీంకోర్టు లేక హైకోర్టును ఆశ్రయించొచ్చు. న్యాయం పొందవచ్చు. హైకోర్టు ద్వారా తగిన రక్షణ, ఉపశమనం లభిస్తుందని భావిస్తే మొదట హైకోర్టుకు వెళ్లాలని గతంలో కనుభాయ్‌ బ్రహ్మభట్‌ V/S స్టేట్‌ ఆఫ్‌ గుజరాత్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

మినహాయింపులు: రాష్ట్రపతి, గవర్నర్లకు ఈ రిట్‌ వర్తించదు. ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలకు వ్యతిరేకంగా ఈ రిట్‌ను జారీ చేయడానికి వీల్లేదు. దీన్ని అంతిమ ప్రత్యామ్నాయంగా మాత్రమే జారీ చేసే వీలుంది. పాలనాపరంగా ప్రజలు న్యాయం పొందలేనప్పుడు ఈ రిట్‌ ద్వారా ఉపశమనం పొందొచ్చు. ఈ రిట్‌ జారీ కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాధికారుల తప్పనిసరి విధులకే ఈ రిట్‌ వర్తిస్తుంది. సంబంధిత అధికారి విచక్షణాపూర్వక విధులకు ఇది వర్తించదు.

కొండవీటి శివనాగరాజు, సీనియర్ జర్నలిస్టు రీసెర్చ్ ప్రొడ్యూసర్, టీవీ9 తెలుగు.

Read Also… Chennai Mayor: చెన్నైకు తొలి దళిత మహిళా మేయర్‌.. సీఎం బాటలోనే నడుస్తానంటూ ప్రకటన