AP Weather Report: దక్షిణ కోస్తాకు వాయుగుండం ఎఫెక్ట్.. రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు
AP Weather Report: ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. రాగల 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర
AP Weather Report: ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. రాగల 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. పశ్చిమ-వాయువ్యదిశగా కదులుతూ గురువారం తెల్లవారుజామున వాయుగుండంగా ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. రాబోవు 4 రోజుల పాటు దక్షిణకోస్తా-తమిళనాడు తీరాల వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అలజడిగా ఉంటుంది. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.
మరోవైపు.. తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా దంచికొడుతోన్న కుండపోత వర్షాలతో దక్షిణ తమిళనాడు అతలాకుతలమవుతోంది. కన్యాకుమారి, కోయంబత్తూరు, తిరునల్వేలి జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. కన్యాకుమారి టౌన్ మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. తిరునల్వేలి జిల్లాలో అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు లోతట్టు ప్రాంత లప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.