YCP MP : ఇంత నీచమైన పనులు రాజ వంశీకులు చేయాల్సినవేనా అశోక్..? ఇది ఒక నీటి బొట్టే. ఇంకా చాలా వస్తాయి బయటకు : విజయసాయిరెడ్డి
టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు మీద దాడిని రోజు రోజుకూ తీవ్రం చేస్తున్నారు వైసీపీ..
YSRCP MP Vijayasai Reddy Hot comments on Ashok Gajapathi Raju : టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు మీద దాడిని రోజు రోజుకూ తీవ్రం చేస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇవాళ మళ్లీ అశోక్ గజపతిరాజుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు వైసీపీ ఎంపీ. “ఇంత నీచమైన పనులు రాజ వంశీకులు చేయాల్సినవేనా అశోక్? సాక్ష్యాత్తు అప్పన్న ఆస్తులను బాబు కోసం ప్రసాదంలా పంచిపెట్టారు. 748 ఎకరాల విలువ10 వేల కోట్ల పైనే. ఆలయ రికార్డుల నుంచి ఆ భూముల వివరాలు తొలగించడమంటే సాధారణ కుంభకోణం కాదు. స్కాముల సముద్రంలో ఇది నీటి బొట్టే. ఇంకా చాలా వస్తాయి బయటకు.” అంటూ విజయసాయి ఆరోపణలు చేశారు.
అశోక్ గజపతి రాజు మాన్సాస్ ట్రస్ట్ ను నడిపిన తీరును ఈ సందర్భంగా విజయసాయి విమర్శించారు. ” తానేదో బాధితుడైనట్లు గుండెలు బాదుకుంటున్నాడు పూసపాటి అశోక్. అస్తవ్యస్త పాలనతో మాన్సాస్ విద్యా సంస్థలను భ్రష్టు పట్టించిన అసమర్ధడు. ఏళ్ళ తరబడి తప్పుడు డేటా అప్‌లోడ్ చేసినందునే ప్రభుత్వం నుంచి మాన్సాస్‌కు ఆర్థిక సాయం అందలేదు. చైర్మన్ పదవి అతనికి అలంకారం మాత్రమే. బాధ్యత కాదు. అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు విజయసాయి.
అశోక్ గజపతి రాజు హయాంలో జరిగిన తప్పులకు చంద్రబాబు పాలన కాబట్టి సరిపోయింది.. లేకపోతే కటకటాలేనని విజయసాయి వ్యాఖ్యానించారు. “అశోక్ హయాంలో మాన్సాస్ ట్రస్ట్‌కు వాటిల్లిన నష్టం అపారం. ఆ నష్టాన్ని ఇంకా అంచనా వేసే పనిలో ఉన్నారు అధికారులు. ఇదే ఏ ప్రైవేట్ సంస్థలోనో జరిగితే తీవ్ర నిర్లక్ష్యం, ఉల్లంఘనలు, ఆర్థిక అవతవకలకు పాల్పడిన ఆరోపణలతో అశోక్‌ను పీకి పారేసేవారు. అది దివాణా పాలన కదా. అడిగే దిక్కే లేదు”. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“మాన్సాస్ ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలపై ఫోరెన్సిక్ ఆడిట్‌కు చాలా కాలం పడుతుంది. అశోక్ చట్టవిరుద్ద చర్యలపై ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి. దొంగలు ఆనవాళ్ళను ఎలా చెరిపేస్తారో అధికారులకు బాగా తెలుసు. అశోక్ ముసుగు తీసి అతని అక్రమాలను బహిర్గతం చేసే ఆధారాలు వారి కళ్ళ ముందే ఉన్నాయి.” అంటూ వరుస ట్వీట్లలో విజయసాయి మండిపడ్డారు.
Read also : Huzurabad : హుజురాబాద్‌లో హీటెక్కిన రాజకీయం.. దూకుడు పెంచిన టీఆర్ఎస్, బీజేపీ.. సైలెంట్‌గా కాంగ్రెస్..!