వివేకా హత్య కేసు: హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్సీ పిటిషన్

మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే.. దీన్ని సీబీఐకి అప్పగించాలని ఆయన కోరారు. కాగా ఈ కేసును ప్రస్తుతం సిట్ బృందం విచారిస్తుండగా.. వారి విచారణలో భాగంగా ఇటీవల బీటెక్ రవికి నోటీసులు […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:16 am, Fri, 13 December 19
వివేకా హత్య కేసు: హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్సీ పిటిషన్

మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే.. దీన్ని సీబీఐకి అప్పగించాలని ఆయన కోరారు. కాగా ఈ కేసును ప్రస్తుతం సిట్ బృందం విచారిస్తుండగా.. వారి విచారణలో భాగంగా ఇటీవల బీటెక్ రవికి నోటీసులు అందాయి. ఈ క్రమంలో రవి, సిట్ విచారణకు సైతం హాజరయ్యారు. ఇక ఇప్పుడు ఈ కేసును సీబీఐకు అప్పగించాలని ఆయన హైకోర్టును ఆశ్రయించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలందరూ సీబీఐను వ్యతిరేకించారు. ఈ క్రమంలో సీబీఐను రాష్ట్రంలోకి నిషేధిస్తూ జీవో 176ను రద్దు చేశారు బాబు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోకి సీబీఐకు స్వాగతం చెప్పగా.. ఇప్పుడు పలు కేసులపై టీడీపీ నేతలు సీబీఐ విచారణ కోరడం గమనర్హం. ఆ మధ్యన వివేకా హత్యపై మాట్లాడిన చంద్రబాబు సైతం సీబీఐ విచారణను కోరిన విషయం తెలిసిందే.

కాగా సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి పులివెందులలోని స్వగృహంలో దారుణ హత్యకు గురయ్యారు. మొదట గుండెపోటుతో మరణించారని అనుకున్నప్పటికీ.. పోస్ట్‌మార్టంలో ఆయనది హత్య అని తేలింది. దీంతో రాజకీయంగానూ ఆయన హత్య పెద్ద దుమారాన్ని సృష్టించింది. ఇక ఈ కేసుపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సిట్‌ దర్యాప్తుకు ఆదేశించింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఈ కేసును కొత్త సిట్ బృందానికి అప్పగించారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా వివేకా హత్య కేసులో నిందితులను పట్టుకోలేదని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలో విచారణను సిట్ అధికారులు మళ్లీ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ ఫ్యామిలీతో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలు, టీడీపీ, బీజేపీ నేతలను సిట్ అధికారులు విచారించారు.