Andhra Pradesh: ఆర్కే బీచ్‌లో కొనసాగుతున్న గాలింపు.. రంగంలోకి దిగిన నేవీ హెలికాప్టర్..
విశాఖ ఆర్కే బీచ్‌లో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇప్పటికే గల్లంతైన వారిలో ఒకరి మృతదేహాం దొరికింది. నేవీ హెలికాప్టర్ సాయంతో సముద్రంలో గాలించిన సిబ్బంది..
విశాఖ ఆర్కే బీచ్‌లో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇప్పటికే గల్లంతైన వారిలో ఒకరి మృతదేహాం దొరికింది. నేవీ హెలికాప్టర్ సాయంతో సముద్రంలో గాలించిన సిబ్బంది డెడ్‌బాడీని పట్టుకున్నారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన శివగా గుర్తించారు. మరో యువకుడు ఆజీజ్ కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్- బేగంపేట్ కి చెందిన 8 మంది యువకులు.. నిన్న స్నానానికి ఆర్కే బీచ్‌లోకి దిగారు. వీళ్లల్లో ఏకంగా ముగ్గురు గల్లంతయ్యారు. సముద్రంలో పడి కొట్టుకుపోయిన తమ స్నేహితులను కాపాడండీ అంటూ అరిచారు మిగిలిన యువకులు.
అక్కడే ఉన్న ఓ ఇద్దరు స్థానికులు- సముద్రంలోకి దిగారు. గల్లంతైన ముగ్గుర్లో ఒకరైన ఒకరిని ఒడ్డుకు చేర్చారు. కొన ఊపిరితో ఉన్న అతడ్ని ఎలాగైనా సరే బతికించాలని.. చేయాల్సిన ప్రాథమిక వైద్యసాయమంతా చేశారు. కానీ అతడి ప్రాణం నిలవలేదు.
విశాఖ బీచ్ లో సంభవించిన మరణాలు
ఇప్పటి వరకూ విశాఖ బీచ్ లో సంభవించిన మరణాలను ఒక సారి చూస్తే 2108 లో 55, 2019 లో 51, 2020 లో 64, 2021 లో 63. బీచ్ పోలీస్ స్టేషన్ అన్నది కేవలం ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పటివరకు కార్యరూపం దాల్చక పోవడం ఒక విషాదం. ఒక్క ఔట్ పోస్ట్ మాత్రమే ఉంది, అక్కడా పరిమితమైన సిబ్బంది మాత్రమే ఉండటం మరో దౌర్భాగ్యం. మాములుగా అయితే మూడు అంచెల పోలీసింగ్ ఉంటుంది. వాటిలో ఒకటి స్టాండ్ పోలీస్. రెండు రోడ్ పోలీస్. మూడు రూఫ్ టాప్ పోలీస్.
వీళ్లంతా చెప్పుకోడానికి మాత్రమే. ఈ మూడు ప్రాంతాల్లో కేవలం నలుగురు మాత్రమే ఉంటారు. వీకెండ్ లో పదివేల మంది వరకూ బీచ్ కి వస్తారు. వీళ్లను నియంత్రించేందుకు ఈ స్టాఫ్ సరిపోరు. వీళ్లకు 18 మంది గజ ఈతగాళ్లు లైఫ్ గార్డ్స్ అనే పేరిట ఉంటారు. కానీ వీళ్లకు లైఫ్ జాకెట్లు ఉండవు. కనీసం స్ట్రెచర్ గానీ ఎమర్జెన్సీ కిట్ కానీ ఉండదు. కొసమెరుపు ఏంటంటే.. వీళ్లకు 9 నెలలుగా జీవీఎంసీ జీతాలే ఇవ్వక పోవడం.