భారత్‌లో డేటా సెంటర్ బూమ్.. 2030 నాటికి యువతకు భారీ ఉపాధి అవకాశాలు
భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న డేటా సెంటర్ పరిశ్రమ దేశంలోని అతిపెద్ద ఉపాధి కల్పన రంగాల్లో ఒకటిగా అవతరిస్తోంది. 2030 నాటికి ఈ రంగంలో దాదాపు లక్ష మంది నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం ఏర్పడనున్నట్లు ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ (NLB Services) తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో సుమారు 1.5 గిగావాట్ల (GW) స్థాపిత డేటా సెంటర్ సామర్థ్యం ఉండగా, దశాబ్దం చివరి నాటికి ఇది 6.5 గిగావాట్లకు చేరుకునే అవకాశముందని నివేదిక పేర్కొంది. అదే సమయంలో భారత డేటా సెంటర్ మార్కెట్ విలువ 22 బిలియన్ డాలర్లకు పైగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది..

హైదరాబాద్, జులై 15: భారత డేటా సెంటర్ మార్కెట్ రంగంలో ఇప్పటికే 126 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి హామీలు నమోదయ్యాయి. దీంతో డేటా సెంటర్ పరిశ్రమ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాల రంగాల్లో ఒకటిగా నిలుస్తోంది. అయితే, పరిశ్రమ వృద్ధికి అవసరమైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల కొరత భవిష్యత్తులో సవాలుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌లో డేటా సెంటర్‌లు, ఏఐ మౌలిక సదుపాయాల విస్తరణ కేవలం నిర్మాణాత్మక అభివృద్ధి మాత్రమే కాదని, యువతకు ఇది గొప్ప ఉపాధి అవకాశాలను అందించే జాతీయ స్థాయి అవకాశం అని ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ సీఈవో సచిన్ అలుగ్ అన్నారు. దేశం డిజిటల్ పరివర్తన దిశగా వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ ఆపరేషన్స్, ఆటోమేషన్, పవర్ సిస్టమ్స్, క్రిటికల్ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన కొత్త తరహా ఉద్యోగుల కోసం భారీ డిమాండ్ ఏర్పడుతోందని ఆయన తెలిపారు. ఇది కేవలం ఉద్యోగాల భర్తీ మాత్రమే కాకుండా, భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థను రాబోయే దశాబ్దాల పాటు ముందుకు నడిపించే నైపుణ్యవంతులైన శ్రామిక శక్తిని తయారు చేయడమే లక్ష్యమని వివరించారు.
కృత్రిమ మేధస్సు వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్, క్లౌడ్ ఆపరేషన్స్, ప్లాట్‌ఫార్మ్ ఇంజినీరింగ్, డెవ్‌ఓప్స్ (DevOps), ఎంఎల్‌ఓప్స్ (MLOps), డేటా సెంటర్ ఆటోమేషన్ వంటి విభాగాల్లో నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం మరింత పెరుగుతోంది. భవిష్యత్తులో దేశంలోని మొత్తం డేటా సెంటర్ సామర్థ్యంలో సుమారు 30 శాతం ఏఐ వర్క్‌లోడ్లే ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. అదే సమయంలో భౌతిక మౌలిక సదుపాయాల విభాగంలో కూడా ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కోసం డిమాండ్ పెరుగుతోంది.
ముఖ్యంగా ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆపరేషన్స్ ఇంజినీర్లు, లిక్విడ్ కూలింగ్ ఇంజినీర్లు, ఎనర్జీ ఆప్టిమైజేషన్ స్పెషలిస్టులు, క్రిటికల్ ఫెసిలిటీస్ ఇంజినీర్లు, పవర్ సిస్టమ్స్ నిపుణులు వంటి ఉద్యోగాలు రాబోయే రోజుల్లో కీలకంగా మారనున్నాయి. తదుపరి తరం ఏఐ ఆధారిత డేటా సెంటర్లకు అధునాతన కూలింగ్ వ్యవస్థలు, శక్తి నిర్వహణ, కీలక మౌలిక సదుపాయాల సామర్థ్యాలు అవసరం కావడంతో ఈ ఉద్యోగాలకు మరింత ప్రాధాన్యం పెరుగుతోంది. డిజిటల్ ఇండియా, ఏఐ విప్లవం, క్లౌడ్ టెక్నాలజీ విస్తరణతో డేటా సెంటర్ రంగం రానున్న సంవత్సరాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
