Visakha Dog Park: గ్రామ సింహాల కోసం నగరంలో థీమ్ పార్క్.. కొత్త వివాదంలో ఏపీ కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం..
ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం మరో వివాదంలో చిక్కుకుంది. అందమైన నగరంగా, పర్యాటకంగా ఎంతో పేరున్న నగరం.. వేగంగా స్మార్ట్ సిటీగా అభివృద్ధిలో దూసుకెళ్తోంది.
Dog Park in Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం మరో వివాదంలో చిక్కుకుంది. అందమైన నగరంగా, పర్యాటకంగా ఎంతో పేరున్న నగరం.. వేగంగా స్మార్ట్ సిటీగా అభివృద్ధిలో దూసుకెళ్తోంది. అయితే, నగరంలో ఎన్నో సమస్యలను పక్కనబెట్టి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఏకంగా కుక్కలకు పార్కు నిర్మించడం సంచలనంగా మారింది. దీనికి దాదాపు రూ.2కోట్లు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. నగరంలో చాలా సమస్యలుంటే కోట్ల రూపాయలు ఖర్చు చేసి కుక్కలకు పార్కు నిర్మించడం అవసరమా అని విపక్షాలు పండిపడుతున్నాయి. ఇటీవల జరిగిన జీవీఎంసీ సమావేశంలో ఇదే అంశంపై రచ్చ అయింది. ప్రజాసమస్యలు గాలికొదిలేసి ఇదేంటని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.
విశాఖలోని సుజాతనగర్‌లో రూ.2కోట్లతో కుక్కల పార్కు నిర్మించేందుకు.. విశాఖ జీవీఎంసీ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. దీన్ని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ కార్యాలయం ఎదుట కుక్కలతో నిరసన తెలియజేశారు. నగరంలో ప్రస్తుతం జ్వరాలు ప్రబలుతున్నాయని.. దోమల నియంత్రణకు చర్యలు తీసుకోకుండా.. కుక్కల గురించి ఆలోచించడం ఏంటని ప్రశ్నించారు. జీవిఎంసీ అధికారుల తీరుకు నిరసనగా.. వామపక్ష నేతలు ఏకంగా నడిరోడ్డుపై కుక్కలతో నిరసన వ్యక్తం చేశారు. రకరకాల వ్యాధులతో.. ఇతరత్రా సమస్యలతో చచ్చిపోతున్న మనుషుల్నే కాపాడలేని జీవిఎంసీ.. ఇప్పుడు కుక్కలకి పార్క్ పెట్టడమేంటని మండిపడుతున్నారు. దోమల్ని నివారించేలని అధికారులు.. కుక్కల కోసం కోట్ల రూపాయల్ని కేటాయిస్తారా.. అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజలకే పార్కులకు దిక్కు లేదు.. కానీ, ఉన్న పార్కులను అభివృద్ధి చేయకుండా.. కుక్కల కోసం పార్కులు కడతారా అని పలువురు నిలదీస్తున్నారు. అన్ని అంశాల్లోనూ పన్నులు విధిస్తూ జనం సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు. ముందు మనుషుల గురించి ఆలోచించాలని సూచించారు. వెంటనే కుక్కల పార్కు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ అంశంపై ప్రభుత్వ వివరణ మరోలా ఉంది. ఇది కుక్కల పార్కు కాదని కేవలం థీమ్ పార్క్ మాత్రమేనని చెబుతోంది. నగరంలో పలు చోట్ల థీమ్ పార్కులు నిర్మిస్తున్నామని.. ఇవి ఆహ్లాదాన్ని పంచడమే కాకుండా విజ్ఞానం అందించేవిగా ఉంటాయని వివరిస్తోంది. కేవలం డాగ్స్ పార్క్ మాత్రమే కాకుండా.. బటర్ ప్లై పార్కు, పంచతత్వ పార్క్, ఫ్రీడమ్ ఫైటర్స్ పార్క్, ఆయుర్వేదిక్ పార్కు, హెర్బల్ పార్కు, యోగా అండ్ మెడిటేషన్ పార్క్ వంటి పార్కులు కూడా నిర్మిస్తున్నామన్నారు.
ప్రస్తుతం విశాఖనగరం 626 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. నగరంలో 22.5 లక్షల మంది జనాభా నివశిస్తున్నారు. స్మార్ట్ సిటీ ప్లాన్ లో భాగంగా నగరంలో పచ్చదనం పెంచడంతో పాటు థీమ్ పార్కుల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తున్నామని జీవీఎంసీ వెల్లడించింది. అన్ని థీమ్ పార్కులు ఓకే మరి కుక్కల పార్కుపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో జీవీఎంసీ వెనక్కి తగ్గుతుందా..? లేదా ముందుకు వెళ్తుందా..? అనేది వేచి చూడాలి.
Read Also… Sreeleela: టాలీవుడ్ క్రేజీ ఆఫర్లు అందుకుంటున్న పెళ్ళిసందడి బ్యూటీ.. స్టార్ హీరో సరసన శ్రీలీల…