Andhra Pradesh: సెల్‌ఫోన్ గేమ్‌పై గొడవ.. కర్రలు,కత్తులతో రెండు గ్రామాల మధ్య ఘర్షణ
సెల్‌ఫోన్ గేమింగ్‌కు సంబంధించి కొంతమంది యువకుల మధ్య మొదలైన వివాదం రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఓ గ్రామం వారు కత్తులు, కర్రలతో మూకుమ్మడిగా మరో గ్రామంపై దాడికి దిగడం కలకలం రేపుతోంది.

సెల్‌ఫోన్ గేమింగ్‌కు సంబంధించి కొంతమంది యువకుల మధ్య మొదలైన వివాదం రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఓ గ్రామం వారు కత్తులు, కర్రలతో మూకుమ్మడిగా మరో గ్రామంపై దాడికి దిగడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లాలోని మహానంది మండలంలో సెల్‌ఫోన్ గేమింగ్ సంబంధించి బసవాపురం, గాజులపల్లె గ్రామాల యువకుల మధ్య వివాదం జరిగింది. మాటమాట పెరగడంతో తీవ్ర దూషణలకు దారితీసింది. బసవాపురానికి చెందిన యువకుడు ఇంటికి వెళ్లాక ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పాడు. దీంతో బుధవారం రాత్రి దాదాపు 50 మంది బసవపురం వాసులు గాజులపల్లె గ్రామంలోకి వచ్చారు. కర్రలు, కత్తులు చేత పట్టుకని ఆ గ్రామంలోని కొందరు యువకులు, వారి కుటుంబ సభ్యులను గాలిస్తూ దాడులు చేశారు.
ఈ దాడిలో కొందరు తప్పించుకోగా.. మరికొందరు ఇళ్లల్లో దాక్కున్నారనే విషయం తెలుసుకొని వారి తలుపులను కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో తాజ్, జహరాబీ దంపతులను తీవ్రంగా కొట్టడంతో వారింటి తలుపులు పగలగొట్టినట్లు స్థానికులు తెలిపారు. మరో ముగ్గురికి గాయాలైనట్లు పేర్కొన్నారు. దాడులు జరుగుతున్న సమయంలో సమాచారం అందుకున్న మహానంది ఎస్సై జి. నాగేంద్రప్రసాద్ సిబ్బందితో సహా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడులు చేసుకుంటున్న గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం
