Sathya Sai District: కొండపైనే తిష్ట వేశాయ్.. పాపం అక్కడివారికి నిద్ర అన్నదే కరువు
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలో చిరుత పులుల సంచారం స్థానికులను భయానికి గురిచేస్తోంది. గ్రామానికి సమీపంలోని కొండ ప్రాంతంలో చిరుతలు గుంపులుగా సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పశుపోషకులు తమ పశువులను కోల్పోయి నష్టపోతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ...

శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలో చిరుత పులుల సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామానికి అత్యంత సమీపంలో ఉన్న కొండపై చిరుతలు గుంపులుగా సంచరిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో స్థానికులు కంటి మీద కునుకు కరువై బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గ్రామానికి దగ్గరలోని కొండ ప్రాంతంలోని పొదల్లో చాలా కాలంగా 3 చిరుతలు ఆవాసం ఏర్పరుచుకున్నాయని స్థానికులు అంటున్నారు. పగటిపూట కొండపైనే ఉంటున్న చిరుతలు, రాత్రి వేళల్లో ఆహారం కోసం గ్రామ పరిసరాల్లోకి వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా నివాస ప్రాంతాలకు సమీపంలోకి వచ్చి పశువులను చంపి తినేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుతల కారణంగా తాము జీవనాధారం కోల్పోతున్నామని వాపోతున్నారు.
మరోవైపు చిరుతల భయంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే భయమేస్తోందని, ఎక్కడ తమపై దాడి చేస్తాయోనని భయపడాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. తమ ప్రాణాలకు, పశువులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యపై అటవీశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గుడిబండ వాసులు ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, చిరుతల బెడద నుంచి తమను కాపాడాలని, గ్రామస్థులు కోరుతున్నారు.
వీడియో దిగువన చూడండి…
