వంగవీటి రంగా ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు.. పాలకొల్లు పర్యటన వెనుక వ్యూహం అదేనా?
వంగవీటి రంగా కుటుంబం నుంచి మరొకరు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే రంగా కుమారుడు రాధా రాజకీయాల్లో కొనసాగుతుండగా.. త్వరలోనే ఆయన కుమార్తె ఆశా కిరణ్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారు. అయితే తాను ఏ పార్టీలోకి చేరేది ఇప్పుడే చెప్పలేనని ఆశా కిరణ్ తేల్చి చెప్పారు. అయితే తాజాగా రాజకీయ కురువృద్దులు , మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యతో ఆమె భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది.

వంగవీటి రంగా వారసులుగా ఆయన కుటుంబం నుంచి అనేక మంది రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రంగా మరణం తరువాత ఆయన భార్య రత్నకుమారి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తరువాత రంగా కుమారుడు రాధా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రాణించారు. లేటెస్ట్‌గా వంగవీటి ఫ్యామిలీ నుంచి మరొకరు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుండటం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. వంగవీటి రంగా కూతురు ఆశాకిరణ్ ప్రజాజీవితంలోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించారు. ప్రజాసేవ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు. ప్రజా సమస్యలపై తన తండ్రి స్పందించినట్టే ఇకపై తాను కూడా స్పందిస్తానన్నారు ఆశాకిరణ్. సమాజ సేవ చేయడానికి ఎప్పుడూ తాను ముందుంటానన్నారు.
ఇక తన సోదరుడు రాధాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆశా కిరణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా , ఏ పార్టీలో చేరకపోయినా తాను ప్రజా జీవితంలోనే ఉన్నానంటూ ఆశాకిరణ్ ప్రకటించటం ఆమె పక్కా పొలిటికల్ ప్రణాళికతోనే వున్నారనే చర్చ జరుగుతుంది. విజయవాడలో వంగవీటి మోహనరంగా విగ్రహానికి ఘాన నివాళి అర్పించిన ఆమె పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాల్లో జరుగుతున్న కాపు వనసమారాధనల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయ కురువృద్దులు , మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యతో ఆమె భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది.
గతంలో హరిరామ జోగయ్య రాసిన పుస్తకం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. రంగా హత్యకు కారణం ఎవరని విషయంపై ఆయన తన పుస్తకంలో రాసిన అంశాలతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రాజకీయంగా అనేక సూచనలు చేస్తూ.. సపోర్ట్ చేస్తుండటంతో తన రాజకీయ రంగ ప్రవేశానికి రాష్ట్రంలో కాపు ముఖ్య నాయకులలో ఒకరైన మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య ను కలసి కొంత సేపు చర్చించారని అంటున్నారు.
అంతే కాకుండా దారి పొడవునా ఉన్న పట్టణాలు, పల్లెల్లోని కాపు ముఖ్య నాయకులను ఆమె మర్యాద పూర్వకంగా కలవడం ఆసక్తికరంగా మారింది. వంగవీటి రాధా ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్‌గా ఉండటం కూడా ఆశాకిరణ్ కు కలిసొస్తున్న అంశంగా కనిపిస్తుందంటున్నారు. ఆశాకిరణ్ సోదరుడు యాక్టివ్ పాలిటిక్స్‌లో లేకపోయినా.. తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మరో వైపు రాధా రంగా మిత్రమండలి అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర వైసీపీ పార్టీలో ఉండటంతో రాధాకు చెక్ పెట్టేందుకు రంగా తనయురాలు ఆశాకిరణ్ ను ప్రత్యక్ష రాజకీయాలలోకి తీసుకు వచ్చేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారనే వాదన సైతం వినిపిస్తుంది. ఇదిలావుంటే, వైసీపీ ఆహ్వానంపై ఇప్పుడే స్పందించలేనని.. తన తండ్రి వంగవీటి రంగా ఆశయ సాధనకు తనకు ముఖ్యమన్నారు.
వంగవీటి రంగా భార్య రత్నకుమారి తరువాత ఆయన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వస్తున్న రెండో మహిళగా ఆశాకిరణ్ నిలవబోతున్నారు. వంగవీటి రంగా మరణించి మూడు దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆయన పేరు విజయవాడ రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. అన్ని పార్టీల్లోనూ రంగాకు అభిమానులు ఉన్నారు. దీంతో ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీ బెజవాడ పాలిటిక్స్‌లో ఎలాంటి ప్రభావం చూపనుందనే చర్చ మొదలైంది. మరోవైపు రాధారంగా మిత్రమండలి సలహా మేరకు నిర్ణయం తన నిర్ణయాలు ఉంటాయని.. వారు సూచించిన పార్టీలో చేరుతానని ఆశాకిరణ్ చెప్పారు. దీంతో ఆమె అడుగులు ఏ రాజకీయ పార్టీ వైపు ఉండబోతున్నాయనే దానిపైనా ఆసక్తి నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
