Iconic Bridge: కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన.. నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా.. ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి
కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల మధ్య రూ.1,082.56 కోట్లతో ఈ వంతెన నిర్మించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ ట్విటర్ ద్వారా వెల్లడించారు...

కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల మధ్య రూ.1,082.56 కోట్లతో ఈ వంతెన నిర్మించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఐకానిక్ వంతెన ఫొటోలను ట్విట్టర్ లో పంచుకున్నారు. కాగా.. దేశంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న కేబుల్, సస్పెన్షన్ ఐకానిక్ వంతెన ఇదే కావడం విశేషం. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని 30 నెలల్లోనే పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. వంతెనలో గోపురం ఆకారంలో పైలాన్, లైటింగ్ వ్యవస్థ ఉంటుందని చెప్పారు. చుట్టూ నల్లమల అడవులు, ఎత్తైన కొండలు, శ్రీశైలం రిజర్వాయర్ పరిసరాలతో ఉండే ప్రాంతంలో ఈ వంతెన నిర్మిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పర్యాటక ప్రాంతంగా మారే అవకాశం ఉంది. ఈ వంతెన నిర్మాణంతో ఎట్టకేలకు 15 ఏళ్ల చిరకాల స్వప్నం సాకారం కానుంది.
తెలంగాణలోని కొల్లాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి రాకపోకలు సాగించాలంటే కృష్ణా నదిలో పడవ ప్రయాణం చేయాల్సిందే. ప్రమాదమని తెలిసినా ఏమీ చేయలని పరిస్థితి అక్కడి ప్రజలది. కానీ రోడ్డు మార్గంలో రావాలంటే వంద కిలోమీటర్లు ప్రయాణించాలి. 2007 లో కృష్ణానదిలో పడవ మునగిన ఘటనలో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి నదిపై బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదం వేసింది. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి కడప, చిత్తూరు, తిరుపతి వైపు ప్రయాణించేవారికి కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉండదు. హైదరాబాద్ – తిరుపతి మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.




Bringing Prosperity Through World Class Infrastructure in New India
Iconic cable-stayed cum suspension bridge across Krishna river in Andhra Pradesh and Telangana has been approved at total cost of Rs 1082.56 Cr with the construction period of 30 months. #PragatiKaHighway pic.twitter.com/elKeMRhL4m
— Nitin Gadkari (@nitin_gadkari) October 13, 2022
కాగా.. గతంలోనూ ఇబ్రహీంపట్నం – ఉద్దండరాయపాలెంలను కలుపుతూ కృష్ణా నదిపై ఐకానిక్ వంతెనను నిర్మించనున్నట్లు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్, భద్రాచలం హైవేల నుంచి విజయవాడ రాకుండా నేరుగా అమరావతికి వెళ్లేందుకు ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుంది.