Vijayawada: విజయవాడ బాణసంచా దుకాణాల్లో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవదహనం.. మరొకరి పరిస్థితి..
విజయవాడ నగరం గాంధీ నగర్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం జింఖానా గ్రౌండ్స్‌లోని బాణాసంచా స్టాల్‌లో మంటలు చెలరేగి.. 18 టపాసుల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.
విజయవాడ నగరం గాంధీ నగర్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం జింఖానా గ్రౌండ్స్‌లోని బాణాసంచా స్టాల్‌లో మంటలు చెలరేగి.. 18 టపాసుల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. తొలుత మూడు స్టాల్స్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత మంటలు అన్ని దుకాణాలకు వ్యాపించాయి. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. నిప్పు అంటుకోవడంతో టపాసులు ఒక్కసారిగా పేలిపోయి, స్టాల్స్ అన్నీ దగ్ధం అయ్యాయి. మృతి చెందిన వారు టపాసుల స్టాల్స్ లో పనిచేసే వర్కర్స్‌గా పోలీసులు తెలిపారు. పలువురికి గాయాలైనట్లు వెల్లడించారు. మరణించిన వారు ఖాసిం, సాంబలుగా గుర్తించారు. గోపాలకృష్ణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్‌లతో మంటలార్పుతున్నారు. మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
జింఖానా గ్రౌండ్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరగడానికి గల కారణాలపై లోతుగా విచారిస్తున్నారు. ప్రమాదం నేపథ్యంలో ఇవాళ టపాసుల అమ్మకాలు జరపొద్దని అధికారులు సూచించారు.
తిరుపతిలో..
ఇదిలాఉంటే.. తిరుపతి వడమాల పేటలో కూడా భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా విక్రయిస్తున్న రెండు షాపుల్లో మంటలు చెలరేగడంతో.. రెండు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..