TTD Wedding Gift: పెళ్లి చేసుకునేవారికి గుడ్‌న్యూస్.. టీటీడీ నుంచి మ్యారేజ్ గిఫ్ట్.. కేవలం ఇలా చేస్తే చాలు..
భారతీయ సంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నూతన బంధాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా.. రెండు కుటుంబాలను ఒక్కటి చేస్తుంది.
భారతీయ సంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నూతన బంధాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా.. రెండు కుటుంబాలను ఒక్కటి చేస్తుంది. అందుకే పెళ్లి శుభకార్యాల సమయంలో సందడి.. ఆటపాటలు, సరదాలు కాస్తా ఎక్కువగానే ఉంటాయి. అలాగే పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో దేవుళ్లను పూజించడం మన సంప్రదాయం. అందులో ముందుగా విఘ్నేశ్వరుడిని పూజిస్తుంటారు. అలాగే శుభలేఖ దగ్గర్నుంచి.. ప్రతి వస్తువును ముందుగా దేవుడి ముందు పెడుతుంటారు. శుభలేఖను ముందుగా దేవుడి గదిలో పెట్టి ఆ తర్వాత తమ బంధువులకు, స్నేహితులకు అందజేస్తుంటారు. అయితే చాలా మందికి తమ మొదటి శుభలేఖను తిరుమల శ్రీవారికి అందించడం ఆచారంగా ఉంటుంది. అలాగే తమ పెళ్లి పత్రికను తిరుమల వెంకన్నకు పంపాలని కోరుకుంటారు. అయితే తిరుమలకు దగ్గర ఉన్నవారికి ఎలాంటి సమస్యలు లేవు. మరీ దూరంగా ఉన్నవారి పరిస్థితి ఏంటీ ? పెళ్లి పనులు దగ్గర పడుతున్న సమయంలో రెండు మూడు రోజుల ప్రయాణాన్ని కేవలం శుభలేఖ కోసం కేటాయించలేరు. ఎలా పంపించాలి ? ఒకవేళ పంపినప్పుడు తిరుమల శ్రీవారికి చేరిందా ? లేదా అనే సందేహాలు చాలా మందిలో ఉంటుంటాయి. అయితే ఇలాంటి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం మంచి అవకాశం కల్పిస్తోంది. అదెలాగో తెలుసుకుందామా.
మీ ఇంట్లో పెళ్లి తేదీ నిశ్చయం కాగానే.. మొదటిగా శుభలేఖను ఒక నెల ముందుగానే తిరుమలకు పంపించవచ్చు. వెంటనే తిరుమల నుంచి విశిష్టమైన కానుక అందుతుంది. అందులో చేతి కంకణాలు, అక్షింతలు (పెళ్లి తలంబ్రాలో కలుపుకోవచ్చు) వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుని ఆశీర్వచనాలతో బహుమతి పంపుతారు. తిరుమల శ్రీవారి నుంచి మీ పెళ్లికి కానుక అందడం వలన నేరుగా శ్రీనివాసుని ఆశీర్వాదం పొందినట్లే అని భావిస్తుంటారు. అయితే మీ మొదటి శుభలేఖను నెల ముందే.. ” శ్రీ లార్డ్ వేంకటేశ్వర స్వామి, ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కేటీ రోడ్డు, తిరుపతి” అనే చిరునామాకు కొరియర్ చేయాలి. అయితే ఈ అవకాశాన్ని టీటీడీ గతంలో కూడా అందించింది. ఇప్పటికే నూతన వధూవరులకు కానుకలు ఇస్తున్నట్లుగా ప్రకటించిన టీటీడీ మరోసారి ఈ మహదవకాశాన్ని వధూవరులకు కల్పిస్తోంది.
Also Read: Paytm Board: పేటీఎం బోర్డు నుంచి బయటకు వచ్చేసిన చైనీయులు.. వారి స్థానంలో భారతీయులు, అమెరికన్లు