Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakha: ప్రభుత్వాలు మారుతున్నా మారని గిరిజనుల తలరాత.. 8 కి.మీ. డోలీలో డెడ్ బాడీ మోత.. విషాదంలోనూ అవస్థలు

ఎన్నికల సమయంలో చేస్తాం చూస్తామంటున్న ప్రజాప్రతినిధులు కూడా.. మొహం చాటేస్తుండడంతో ఆ గిరిజనుల కష్టాలు తీరడం లేదు. తాజాగా.. ఓ మృతదేహానికి డోలి కట్టి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది కిలోమీటర్లు మోసారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లా లో మారుమూల ప్రాంతలో చోటు చేసుకుంది.

Visakha: ప్రభుత్వాలు మారుతున్నా మారని గిరిజనుల తలరాత.. 8 కి.మీ. డోలీలో డెడ్ బాడీ మోత.. విషాదంలోనూ అవస్థలు
Tribal Woman Dead Body
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Surya Kala

Updated on: Jul 21, 2023 | 5:06 PM

తరాలు మారుతున్న తలరాతలు మారడం లేదని అంటుంది ఆ గిరిజనుల పరిస్థితి. అడవిని నమ్ముకుని కొండ కోనల్లో నివసించే అడవి బిడ్డలకు.. నిత్యం జీవన పోరాటం వెంటాడుతోంది. కనీస సౌకర్యాలు లేక.. అల్లాడిపోతున్నారు ఆ గిరిజనులు. ఎన్నికల సమయంలో చేస్తాం చూస్తామంటున్న ప్రజాప్రతినిధులు కూడా.. మొహం చాటేస్తుండడంతో ఆ గిరిజనుల కష్టాలు తీరడం లేదు. తాజాగా.. ఓ మృతదేహానికి డోలి కట్టి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది కిలోమీటర్లు మోసారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లా లో మారుమూల ప్రాంతలో చోటు చేసుకుంది. రోగం వచ్చిన అత్యవసరమైనా.. రహదారి సౌకర్యం లేక డోలి కట్టక తప్పడం లేదు. తాజాగా మహిళ మృతదేహానికి డోలి కట్టారు గిరిజనులు. 8 కిలోమీటర్లు డోలిలో మృతదేహాన్ని మోసుకొని గ్రామానికి తరలించిన ఘటన అందరినీ కలచివేస్తుంది.

అనారోగ్యంతో వెళ్లి.. ప్రాణాలు పోయి..

జీకే వీధి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన చిలకల దేవి అనే 22 ఏళ్ల వివాహిత అనారోగ్యం బారిన పడింది. ఆమెను చింతపల్లి పీహెచ్సీ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దేవి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె మృతదేహం తరలించే సమయంలో గిరిజనులకు అసలు కష్టాలు మొదలయ్యాయి.

రహదారి లేక.. అంబులెన్స్ వెళ్లక…

ఇవి కూడా చదవండి

ఆసుపత్రి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ ను ఇచ్చింది. దీంతో దేవి మృతదేహాన్ని కేవలం శ్యామగడ్డ వరకే తీసుకెళ్లగలికారు. ఎగువున కురుస్తున్న వర్షాలకు పెద్ద కాలువ నుంచి వరద నీరు ప్రవహిస్తోంది.. మరోవైపు రహదారి సౌకర్యం సరిగా లేకపోవడంతో అంబులెన్స్ ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో దేవి మృతదేహానికి డోలి కట్టారు. మృతదేహాన్ని తీసుకుని వాగుని ఆ డోలీతో దాటుకుంటూ దాదాపుగా ఎనిమిది కిలోమీటర్లు తీసుకుని వెళ్లారు. అతి కష్టం మీద గొల్లపల్లి వరకు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు.

ఇప్పటికైనా కరుణించండి..

‘ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ మా కష్టాలు అనేకసార్లు వివరించాం. వర్షాలు వస్తే మాకు కష్టాలు వర్ణనాతీతం. గడ్డలు పొంగిపోతాయి. మారుమూల గ్రామాల నుంచి బయటకు వెళ్లలేం. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా మా బతుకులు మారడం లేదు. గతంలోనూ మృతదేహాలకు ఇటువంటి దుస్థితే ఎదురయింది. ఇప్పటికైనా మా గోడు విని.. రోడ్డు సౌకర్యం కల్పించి కష్టాలు తీర్చాలి’ అని కోరుతున్నారు గాలికొండ ఎంపిటిసి బుజ్జిబాబు.

అవును.. ఈ అమాయక అడవి బిడ్డల ఓట్లతో గెలిచే నేతలకు కార్లు ఏసీలు ఫ్లైట్లు కావాలి.. కానీ ఈ గిరిజనులకు మాత్రం తాగేందుకు గుక్కడు మంచినీళ్లు, సరైన రహదార్లు మాత్రం ఉండవు. పాలకుల్లారా.. కాస్త ఆలోచించండి. ఆ అమాయక అడవి బిడ్డల కష్టాలు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..