Andhra pradesh: బీటెక్ చదివిన వ్యక్తి.. కిరాణ కొట్టు పెట్టాడు.. పేరేం పెట్టాడో తెలిస్తే.. బిత్తరపోతారు
ఎవరైనా ఏదైనా వ్యాపారం, షాపు ప్రారంభిస్తే ఆ వ్యాపారానికి కుటుంబసభ్యుల పేరు కానీ లేకపోతే నమ్మే దేవుడి పేరు కానీ పెట్టడం పరిపాటి. కానీ ఓ యువకుడు మాత్రం అందుకు భిన్నంగా అందరినీ ఆలోచింపజేసేలా ఓ వినూత్నమైన పేరు పెట్టాడు. ఆ షాపు పేరే నిరుద్యోగి కిరాణా & జనరల్ స్టోర్.. ఈ పేరు చూడటానికి ఆశ్చర్యంగా ఉన్నా, పిలవడానికి...
ఎవరైనా ఏదైనా వ్యాపారం, షాపు ప్రారంభిస్తే ఆ వ్యాపారానికి కుటుంబసభ్యుల పేరు కానీ లేకపోతే నమ్మే దేవుడి పేరు కానీ పెట్టడం పరిపాటి. కానీ ఓ యువకుడు మాత్రం అందుకు భిన్నంగా అందరినీ ఆలోచింపజేసేలా ఓ వినూత్నమైన పేరు పెట్టాడు. ఆ షాపు పేరే నిరుద్యోగి కిరాణా & జనరల్ స్టోర్.. ఈ పేరు చూడటానికి ఆశ్చర్యంగా ఉన్నా, పిలవడానికి ఇబ్బందిగా ఉన్నా ఆ యువకుడు చేసిన పనికి యువత ప్రశంసలు కురిపిస్తున్నారు. అతను తన దుకాణానికి పెట్టిన పేరు ఇప్పుడు అందరి మనస్సును కదిలిస్తుంది.
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం వంగర గ్రామానికి చెందిన దత్తి వెంకటరమణ బీటెక్ తో పాటు డిగ్రీ కూడా పూర్తి చేశాడు. రైల్వేలో అప్రెంటీస్ చేసి కాలేజ్‌లో పలు కంపెనీలు నిర్వహించిన ఉద్యోగ పరీక్షల్లో పాల్గొన్నాడు. అందులో అతనికి నెలకు పన్నెండు వేల జీతంతో కూడిన ఉద్యోగం పొరుగు రాష్టానికి చెందిన కంపెనీలో సెలక్ట్ అయ్యాడు. అయితే అంత దూరం వెళ్లి రూ. పన్నెండు వేలకు ఉద్యోగం చేస్తే వచ్చే జీతం చాలదని అభిప్రాయపడి, ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వలేదు. తరువాత అనేక చోట్ల ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
ప్రతి చిన్న అవసరానికి రైతు కూలీలు అయిన తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సి వచ్చింది.. దీంతో ఏదో ఒక చిరు వ్యాపారం పెట్టుకొని అయినా సరే తన కాళ్ల మీద తాను బ్రతకాలని నిర్ణయానికి వచ్చాడు. వెంటనే స్నేహితుల వద్ద కొద్దిపాటి అప్పు తీసుకొని సొంత గ్రామంలోనే ఒక చిరు దుకాణం పెట్టుకున్నాడు.. ఉద్యోగవకాశాలు లేక తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టుకున్న దుకాణం కావున దానికి నిరుద్యోగి కిరాణా అండ్ జనరల్ స్టోర్ అని పెట్టుకున్నాడు. నిరుద్యోగిలా తాను పడే బాధ, ఆవేదన అందరికీ అర్ధం కావాలని, ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ సమస్య పై ప్రతి ఒక్క పౌరుడు, ప్రజాప్రతినిధి, అధికారి స్పందించడం కోసమే తన దుకాణంకు ఈ పేరు పెట్టుకున్నానని చెబుతున్నాడు దత్తి వెంకటరమణ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..