Andhra: ఇటుక బట్టీల కోసం తీసిన గుంతల్లో చేరిన నీరు.. చేపల కోసం దిగిన బాలికలు.. పాపం
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని బొడ్డమానుగూడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరు గిరిజన బాలికలు బిడ్డిక సునంద (12), మండంగి జెస్సిక (11)లు వ్యాపారుల ఇటుక బట్టీల కోసం తీయబడిన గుంతల్లో ప్రమాదవశాత్తు మునిగి ప్రాణాలు కోల్పోయారు.

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం బొడ్డమానుగూడలో విషాదం చోటు చేసుకుంది. చేపల కోసం వెళ్లిన ఇద్దరు గిరిజన బాలికలు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన బిడ్డిక సునంద (12), మండంగి జెస్సిక (11) ఇద్దరు బాలికలు లంకాజోడు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్నారు. వీరిద్దరు కలిసి గ్రామ శివారులో ఉన్న పాత ఇటిక భట్టీల ప్రాంతంలో చేపలు పట్టేందుకు వెళ్లారు. అయితే వ్యాపారులు ఇటుక బట్టీల కోసం మట్టిని తీయడంతో ఏర్పడిన పెద్ద గుంతలు వర్షపు నీటితో నిండిపోయి చెరువుగా మారిపోయింది. బాలికలకు గుంతలు లోతుగా ఉన్నాయని తెలియక ఆ గుంతల్లో చేపల కోసం దిగారు. దీంతో బాలికలు లోతైన గోతుల్లోని ఊబిలో కూరుకుపోయి అక్కడిక్కడే చనిపోయారు. కొంతసేపటి తరువాత బాలికలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు.
బాలికల కోసం గ్రామం అంతా వెదికారు. చివరికి గుంతలో బాలికల మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంటనే గ్రామస్తులు బాలికలను మొండెంఖల్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. బాలికల కుటుంబాల్లో తీరని దుఃఖం నెలకొంది. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో బాలికల ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని ఓదారుస్తున్నారు. విషయం తెలుసుకొని అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఘటన పై ఆరా తీశారు. ఈ ఘటన పట్ల బాలికల పాఠశాల యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..