Magha Masam 2022: మాఘమాసం మహా డేంజరా?.. వేలాది పెళ్లిళ్లు, శుభకార్యాలు కరోనాకు మళ్లీ అవకాశం కల్పిస్తాయా?..
పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకోవడానికి మాఘమాసానికి (Magha Masam) మించిన మంచి ముహూర్తం లేదు. అయితే ఈ పెళ్లిళ్ల సందడి, ఇతరు శుభకార్యాలు కరోనా (Covid19) విరుచుకుపడేందుకు కారణమవుతాయా అన్న అనుమానం వెంటాడుతూనే ఉంది.

పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకోవడానికి మాఘమాసానికి (Magha Masam) మించిన మంచి ముహూర్తం లేదు. అయితే ఈ పెళ్లిళ్ల సందడి, ఇతరు శుభకార్యాలు కరోనా (Covid19) విరుచుకుపడేందుకు కారణమవుతాయా అన్న అనుమానం వెంటాడుతూనే ఉంది. ఇప్పుడిప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టిన కొవిడ్ వైరస్ ఇదే మంచి ముహూర్తమని చెలరేగిపోయే అవకాశం ఉందన్న అభిప్రాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిబంధనలు పాటించకపోతే కరోనా పంజా విసిరే ప్రమాదం ఉంటుందని భావిస్తున్న అధికార యంత్రాంగం కట్టడి చేసేలా జాగ్రత్తలు పాటించపోతే పరిస్థితి ఏమిటన్న చర్చకు తెర తీస్తోంది. చిత్తూరు (Chittoor) జిల్లాలో దడ పుట్టించిన మూడు దశ కొవిడ్ క్రమంగా తగ్గుముఖం పడుతుండగా గత వారంతో పోల్చితే ఈ వారం కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఒక వైపు టెస్టుల సంఖ్య తగ్గడం అందుకు తగ్గట్టుగానే పాజిటివిటీ రేటు కూడా పడిపోవడంతో జనంలో కరోనా భయం మెల్లిమెల్లిగా పోతోంది. అయితే మాఘ మాసం పెళ్లిళ్ల ముహుర్తాలు ముంచుకు రావడంతో పరిస్థితి కరోనా మహమ్మారికి మళ్లీ అనుకూలంగా మారుతుందేమోనన్న భయం నెలకొంది. కొవిడ్ కేసుల సంఖ్య తగ్గిపోవడం, మరోవైపు ఒమిక్రాన్ భయం లేకపోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం భారీ మూల్యం తప్పదని జిల్లా వైద్యాధికారులు హెచ్చురిస్తున్నారు.
అదే అసలు సమస్య..
అయితే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సమయంలో పాటించాల్సిన కరోనా నిబంధనల అమలు విషయమే ఇప్పుడు సమస్యగా మారింది. గత నెలలో టెస్టులు చేసిన ప్రతి పది మందిలో నలుగురికి కొవిడ్ నిర్ధారణ కాగా ఇప్పుడు అంతమేర ప్రభావం చూపని కొవిడ్ పెళ్లిళ్ల సీజన్‌పై ప్రభావం చూపుతుందా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫిబ్రవరి మాసమంతా పెళ్లిళ్లకు ముహుర్తాలు ఉండగా శుక్ల పంచమి నుంచి క్రిష్ణ పంచమి వరకు మంచి ముహుర్తాలుగా పరిగణిస్తుండటంతో వేలాది పెళ్లిళ్లు జరగనున్నాయి. ఈమేరకు తిరుపతిలోని కల్యాణ మండపాలు, కన్వెన్షన్ హాల్స్, హోటళ్లు ముందుగానే బుక్కైపోగా తిరుమలలోని మఠాలు, కళ్యాణ వేదికలను పెళ్లిళ్ల కోసం రిజర్వు అయ్యాయి. ఈనేపథ్యంలో జిల్లాలో దాదాపు 5 వేల పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉండగా ఇప్పటికే పెళ్లిళ్లు జరిపించేందుకు సిద్ధమైన పంతుళ్లు తమకి మాఘమాసం పండగేనంటున్నారు. ఇక పిల్లల పెళ్లిళ్లను ఘనంగా జరిపేందుకు ఇటు పెద్దలు, మూడు ముళ్లతో ఒక్కటయ్యేందుకు అటు నూతన వధూవరులు సన్నద్ధమవుతున్నారు. అయితే శుభకార్యాల చాటున కొవిడ్ కేసుల సంఖ్య పెరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అదేవిధంగా వైరస్ వ్యాప్తికి కారకులు కాకుండా ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది.
