TTD News: మే 28న టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు.. దరఖాస్తుల ఆహ్వానం..
సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ ఏడాది మే 28వ తేదీ కల్యాణమస్తు సామూహిక వివాహాలు నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది.
సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ ఏడాది మే 28వ తేదీ కల్యాణమస్తు సామూహిక వివాహాలు నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. కళ్యాణమస్తులో వివాహం చేసుకోవడానికి ఆసక్తి గల అవివాహితులైన యువతీ యువకుల నుంచి టీటీడీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. టీటీడీ గతంలో పెద్ద ఎత్తున కల్యాణమస్తు సామూహిక వివాహాల కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లా కేంద్రాలతో పాటు తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, దరఖాస్తు పత్రములు www.tirumala.org నుండి కానీ, ఆయా జిల్లాల హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం అసిస్టెంట్స్ నుంచి గానీ పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను ఏప్రిల్ 25వ తేదీ లోపు ఆయా జిల్లా కేంద్రాలల్లోని కల్యాణ మండపాల కార్యాలయాలకు చేర్చాల్సి ఉంటుంది. మే 28న నిర్ణయించిన సమయంలో వివాహాలు జరగనున్నట్లు టీటీడీ వెల్లడించింది. దంపతులకు మంగళసూత్రంతో పాటు వస్త్రాలు, 40 మందికి బోజనాలు ఉచితంగా అందించనున్నారు.
గుడికో గోమాత పథకానికి కూడా దరఖాస్తుల ఆహ్వానం
హిందూ ధర్మ ప్రచారంలోభాగంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ” గుడికో గోమాత ” కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని దేవాలయాలకు తగిన వసతి ఉండి గోవును స్వీకరించాలనే ఆసక్తి కలిగిన దేవాలయాలు వినతి పత్రాలు పంపాలని హిందూ ధర్మ ప్రచార పరిషత్తు బుధవారం ఒక ప్రకటనలో కోరింది.
వినతిపత్రం పంపిన ఆలయానికి గోవును అందిస్తామని తెలిపింది. దరఖాస్తులు ” గుడికో గోమాత” హిందూ ధర్మ ప్రచార పరిషత్తు..తి. తి. దే. శ్వేత భవనం, తిరుపతి చిరునామాకు పంపాలని కోరింది.
Also Read: చేపను కొనుగోలు చేసిన వ్యక్తి.. దాన్ని కటింగ్ చేయిస్తుండగా కడుపులో షాకింగ్ దృశ్యం