Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజుల పాటు ఈ సేవలు బంద్..
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. ఫిబ్రవరి 26 నుంచి సాలకట్ల తెప్పోత్సవాలు తిరుమలలోని పుష్కరిణిలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఐదు రోజుల పాటుప పలు సేవలను రద్దు చేయనుంది. ఆ వివరాలు..

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ జారీ చేసింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ తెప్పొత్సవాల నిర్వహణకు ఇప్పటినుంచే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఘనంగా వీటిని నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ తెప్పోత్సవాల్లో భాగంగా పుష్కరిణిలో స్వామివారు విహరిస్తూ దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక సూచనలు జారీ చేసింది. పలు సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.. భక్తులు దీనిని గమనించాలని కోరారు.
ఆర్జిత సేవలు రద్దు
స్వామివారి సాలకట్ల తెప్పోత్సవాల సందర్భంగా పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఫిబ్రవరి 26,27వ తేదీల్లో సహస్రదీపాలంకార, ఫిబ్రవరి 28, మార్చి 1,2వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. భక్తులు దీనిని గమనించాలని సూచించింది. తెప్పోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 26న సీత లక్ష్మ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి పుష్కరిణిలో తెప్పలపై తిరుగుతూ దర్శనమివ్వనున్నారు. ఇక ఫిబ్రవరి 27న రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి దర్శనమిస్తారు. ఇక ఫిబ్రవరి 28న శ్రీభ సమేత మలయప్పస్వామి పుష్కరిణిలో తెప్పలపై తిరుగుతూ దర్శనమిస్తారు. ఇక మార్చి 1,2వ తేదీల్లో కూడా శ్రీమలయప్పస్వామి పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ స్పష్టం చేసింది.
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే..?
మంగళవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టికెట్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా.. టైం స్లాట్ సర్వదర్శనానికి 5 గంటలు పడుతుంది. అటు సోమవారం శ్రీవారిని 70 వేల మంది దర్శించుకున్నారు. 22,728 మంది తలనీలాలు సమర్పించగా.. హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు వచ్చింది. సాలకట్ల తెప్పోత్సవాల సందర్భంగా తిరుమలకు భక్తుల రద్దీ పెరిగే అవకాశముంది. దీంతో టీటీడీ సిబ్బంది ఇప్పటినుంచే భద్రతా ఏర్పాట్లలో మునిగిపోయారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
