Tirumala: 2024లో తిరుమల వెంకన్న హుండీ ఆదాయం ఎంతో తెల్సా..?
ఏడుకొండలపై కొలువు తీరిన వెంకన్న రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. హుండీ ఆదాయంలో తగ్గేదేలే అంటున్నారు. రికార్డులను బద్దలు కొడుతూ కానుకలతో ఫుల్ కలెక్షన్లు రాబడుతున్నారు. దాంతో.. గత కొన్ని నెలలుగా శ్రీవారి.. నెలవారీ హుండీ ఆదాయం 100కోట్లకు ఏమాత్రం తగ్గడం లేదు.
నూతన సంవత్సరం నేపథ్యంలో గతేడాది తిరుమల శ్రీవారి హుండీ లెక్కలను టీటీడీ వెల్లడించింది. 2024లో హుండీ ద్వారా వెంకన్నకు 1,365 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపింది. ఈ లెక్కన.. సగటున ఒక్కో నెల హుండీ ఆదాయం 113.75కోట్లు టీటీడీ ఖాతాకు జమవుతోంది. సగటున ఒక్క రోజు హుండీ ఆదాయం 3.73కోట్లుగా రికార్డ్‌లకెక్కుతోంది. గతేడాదిలో జులై, ఆగస్టులో అత్యధికంగా 125 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
భక్తులు సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా కానుక ప్రియుడైన శ్రీ వేంకటేశ్వరునికి వ్యవసాయ ఉత్పత్తులు, బెల్లం, నవధాన్యాలు, పశువులు, బంగారం, వాహనాలు, విలువైన రాళ్లు, విదేశీ కరెన్సీ, భూమితో సహా వివిధ కానుకలను సమర్పిస్తూ ఉంటారు. శ్రీవారికి ముడుపులు కట్టి హుండీలో భక్తులు చెల్లించే కానుకలు టీటీడీకి కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి. తిరుమలేశుడి హుండీ ఆదాయం ప్రతి నెల వంద కోట్లు క్రాస్ అవుతుండడంతో వెంకన్న ఆదాయం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఎంతలా అంటే.. కొవిడ్ తర్వాత గత 33 నెలలుగా వంద కోట్ల ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలోనే.. సామాన్య భక్తుల నుండి సంపన్నుల వరకు హుండీలో సమర్పిస్తున్న కానుకలతో గతేడాది శ్రీవారి హుండీ ఆదాయం 1,365 కోట్ల రూపాయలు దాటింది. హుండీ ద్వారా సగటు రోజువారీ సాధారణ రోజుల్లో రూ.3.6 కోట్లు, వారాంతాల్లో రూ.3.85 కోట్లుగా ఉంది. డిసెంబర్ 31న ఆలయానికి హుండీ ఆదాయం రూ.4.10 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. గత ఏడాది సుమారు 99 లక్షల మంది భక్తులు తలలు నీలాలు సమర్పించగా… 9 లక్షల మంది యాత్రికులు తమ మూడు కత్తెర్లు ఇచ్చారు.
2024లో శ్రీవారికి మొత్తం 1,365 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
- –జనవరిలో 116.46 కోట్ల ఆదాయం
- –ఫిబ్రవరిలో 111.71 కోట్లు
- –మార్చిలో 118.49 కోట్లు
- –ఏప్రిల్‌లో 101. 63 కోట్లు
- –మే నెలలో 108.28 కోట్లు
- –జూన్‌లో 113.64 కోట్లు
- –జులైలో 125.35 కోట్లు
- –ఆగస్టులో 125.67 కోట్లు
- –సెప్టెంబర్‌లో 114.11 కోట్లు
- –అక్టోబర్‌లో 107.30 కోట్లు
- –నవంబర్‌లో 111.30 కోట్లు
- –డిసెంబర్‌లో 111.27 కోట్లు
మొత్తంగా.. ఏడుకొండలస్వామి ఆదాయం కొండలు కొండలుగా పెరుగుతూనే ఉంది. ఇక.. గతేడాది మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ ప్రకటించింది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..