వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల కొండ.. అర్ధరాత్రి తెరుచుకోనున్న శ్రీవారి వైకుంఠ ద్వారాలు
తిరుమల కొండ వైకుంఠ ఏకాదశికి ముస్తాబైంది. ఈ రోజు అర్ధరాత్రి 12.05 గంటలకు శ్రీవారి ఆలయ వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. స్వామివారికి అభిషేక సేవ, నిత్య కైంకర్యాల...
తిరుమల కొండ వైకుంఠ ఏకాదశికి ముస్తాబైంది. ఈ రోజు అర్ధరాత్రి 12.05 గంటలకు శ్రీవారి ఆలయ వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. స్వామివారికి అభిషేక సేవ, నిత్య కైంకర్యాల అనంతరం 4.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సర్వ దర్శనం ప్రారంభం కాగా, కోవడ్ నిబంధనలకు అనుగుణంగా పది రోజుల వైకుంఠ ద్వారా దర్శనాలకు ఏర్పాట్లు చేశారు. రేపు ప్రోటోకాల్ ప్రముఖులు స్వయంగా తిరుమలకు వస్తేనే దర్శనం, బస వసతి కల్పించనున్నారు టీటీడీ అధికారులు. వైకుంఠ ఏకాదశి, జనవరి 1 తేదీల్లో వీఐపీ సిఫార్సులను ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించమని టీటీడీ ప్రకటించింది.
అలిపిరి చెకింగ్ పాయింట్, గదుల కేటాయింపు కేంద్రాలు, వైకుంఠ క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం వద్ద భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. తిరుమలలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. అన్న ప్రసాద కేంద్రంలో పది రోజుల పాటు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాద వితరణ జరగనుంది.
రేపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉదయం 9 గంటలకు స్వర్ణ రథంపై మాడవీధుల్లో స్వామివారు విహరించనున్నారు. స్వర్ణరథం లాగేందుకు టీటీడీ మహిళా ఉద్యోగులకు కోవిడ్ పరీక్షలు తప్పనిసరి చేసింది. అలాగే 26న వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని ఉదయం 4.30 గంటలకు శ్రీవారి పుష్కరిణీలో ఏకాంతంగా చక్రస్నానం కార్యక్రమం నిర్వహించనున్నారు.