Tirumala: తిరుమల కొండపై స్పిరిచువల్ జర్నీ.. శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి!
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలో భక్తుల నిరీక్షణ సమయాన్ని మరింత ఆధ్యాత్మికంగా, జ్ఞానదాయకంగా మార్చేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఇందులో భాగంగానే హీలింగ్ అండ్ డివోషనల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.

తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని 17వ కంపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన హీలింగ్ అండ్ డివోషనల్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుబాటులోకి తెచ్చారు. పిల్గ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌తో పాటు ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియంను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఈ రెండు ప్రాజెక్టుల వివరాలు, మీడియా ప్రతినిధుల ఫీడ్‌బ్యాక్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 16న సీఎం చంద్రబాబు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 17వ కంపార్ట్మెంట్లో పిల్గ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించారు. భక్తుల నిరీక్షణ సమయం జ్ఞానదాయకంగా ఉండాలన్న సంకల్పంతో దీనిని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.
క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు స్వామి వారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణాలు, ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక అంశాలు తదితరాలను 3డీ, వర్చువల్ రియాలిటీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందించేందుకు ఈ కేంద్రాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు. భక్తులు దర్శనం కోసం వేచి ఉండే సమయం కేవలం నిరీక్షణగా కాకుండా, ఆధ్యాత్మికతను పెంపొందించుకునే జ్ఞానాన్ని పొందే సమయంగా మార్చాలన్నదే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి పేర్కొన్నారు.
ఇప్పటికే దుర్లభ్ దర్శనం సంస్థ ఆధ్వర్యంలో వర్చువల్ రియాలిటీకి సంబంధించిన కంటెంట్‌ను రూపొందించారని, భారీ స్థాయిలో భక్తులను ఆకట్టుకునేలా ఈ సాంకేతికతను ఎలా వినియోగించాలన్న అంశంపై మరింతగా కృషి జరుగుతోందన్నారు. భవిష్యత్తులో స్వామివారికి సంబంధించిన కథలు, భక్తుల అనుభవాలు, తిరుమల కొండపై ఉన్న వివిధ విశిష్టతలు, ఆలయ చరిత్ర, నిర్మాణం, పరిపాలన, సేవలు, పురాణాలు, దాతలు తదితర అంశాలపై నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించి ఎప్పటికప్పుడు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.
కంటెంట్ కోసం ప్రత్యేక వ్యవస్థ
ఎక్స్పీరియన్స్ సెంటర్లో నిరంతరం కొత్త కంటెంట్ అందుబాటులో ఉండేలా ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని అదనపు ఈఓ తెలిపారు. పురాణాలు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవం, స్వామివారి సేవలు, భక్తుల కథలు, ఆలయ నిర్మాణం, చరిత్ర, పరిపాలన, దాతల సేవలు తదితర అంశాలపై విభిన్న కథనాలను రూపొందించి క్రమం తప్పకుండా ప్రసారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో భక్తులు దర్శనానికి వెళ్లే ముందు స్వామివారి గురించి, తిరుమల ఆలయం గురించి, ఇక్కడి సంప్రదాయాలు, సేవలు, చరిత్ర గురించి మరింత తెలుసుకుని ఆధ్యాత్మిక పరిపూర్ణత, సంతృప్తితో దర్శనం చేసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.
14 గ్యాలరీలతో ఎస్వీ మ్యూజియం
సీఎం చేతుల మీదుగా ప్రారంభమైన మరో ముఖ్యమైన ప్రాజెక్టు.. నూతనంగా ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం అని అదనపు ఈవో తెలిపారు. డిజిటల్ కంటెంట్‌తో పాటు తిరుమల ఆలయ చరిత్ర, వారసత్వం, పురాతన కళాఖండాలు, చారిత్రక వస్తువులను సమగ్రంగా ప్రదర్శించే విధంగా మ్యూజియంను ఆధునీకరించినట్లు చెప్పారు. దాదాపు 14 గ్యాలరీల్లో ప్రత్యేకమైన థీమ్‌తో మ్యూజియాన్ని తీర్చిదిద్దామని, ఆలయ సంప్రదాయం, వారసత్వానికి అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు.
మ్యూజియం నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక మాన్యువల్‌ను రూపొందిస్తున్నామని, ఇందులో సీసీ కెమెరాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, గైడ్ల సేవలు, భద్రతా చర్యలు, కళాఖండాల ప్రత్యేక నంబరింగ్ తదితర అంశాలను పొందుపరుస్తున్నట్లు తెలిపారు. మ్యూజియంను ఎస్ఓపీ (SOP) ప్రకారం నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
తిరుమల ఆధ్యాత్మిక అనుభూతికి కొత్త కోణం
తిరుమలలో భక్తులకు దర్శనంతో పాటు ఇతర ఆధ్యాత్మిక, జ్ఞానదాయక అనుభూతులను అందించడమే టీటీడీ లక్ష్యమన్నారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. భక్తులు తమ నిరీక్షణ సమయంలో ఎక్స్పీరియన్స్ సెంటర్, మ్యూజియం వంటి ప్రదేశాలను సందర్శించి తిరుమల చరిత్ర, ఆలయ విశిష్టత, స్వామివారి సేవలు, సంప్రదాయాలు తదితర అంశాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తే వారి తిరుమల యాత్ర మరింత పరిపూర్ణంగా మారుతుందన్నారు.
తిరుమలను మరింత ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఇటువంటి ప్రాజెక్టులు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. మీడియా సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని, ముఖ్యంగా తెలుగు కంటెంట్‌ను మరింతగా పెంచడం, కంటెంట్‌ను క్రమం తప్పకుండా మార్చడం, విభిన్న అంశాలను అందించడం తదితర సూచనలను అమలు చేస్తామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
