AP News: ఈ బైకులన్నీ చూసి వేలం జరుగుతోందనుకునేరు.. అసలు బాగోతం తెలిస్తే మైండ్ బ్లాంక్.!
దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటారనే నానుడి తెలిసిందే.! కానీ ఇక్కడ దొంగలు, గంజాయి వ్యాపారి జతకట్టి చోరీ బైక్‌లను పంచుకున్నారు..
దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటారనే నానుడి తెలిసిందే.! కానీ ఇక్కడ దొంగలు, గంజాయి వ్యాపారి జతకట్టి చోరీ బైక్‌లను పంచుకున్నారు. అదీ కూడా వస్తుమార్పిడి విధానం లా..! అదేనండీ.. చోరీ చేసి దొంగలు బైక్‌లు తెస్తే.. ఆ బైకులు తీసుకుని గంజాయి ఇచ్చాడు మరొకడు. తీసుకున్న బైకులు ఎక్కడ పెట్టాలో తెలియక కొండ కోనల్లో దాచి పెట్టాడు. గంజాయి కేసులో కూపి లేగితే బైక్ చోరీల గుట్టు బయటపడింది. ఇంతకీ ఎవరా దొంగలు..?! వాళ్లకు గంజాయి అమ్ముతున్న వాడు ఎవడు..?!
అల్లూరి జిల్లా మాడుగుల కొత్తపల్లి జలపాతం వద్ద కొంతమంది యువకులు టూరిస్టుల మాదిరిగా అనుమానాస్పదంగా కనిపించారు. వారిని పోలీసులు ఆపి ప్రశ్నించేసరికి నీళ్లు నమిలారు. చెక్ చేస్తే గంజాయి ఏజెన్సీ నుంచి కొనుగోలు చేసి ఇతర జిల్లాల్లో అమ్మకాలు చేస్తున్న బ్యాచ్ అది. కేసు నమోదు చేసిన మాడుగుల పోలీసులు.. వారిని ఇంటరాగేషన్ చేశారు. తప్పును ఒప్పుకునే సరికి.. బాబ్జి, బత్తుల సాయికిరణ్ లను అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టారు. గతేడాది ఏప్రిల్ 24న ఇది జరిగింది.
గంజాయి స్మగ్లింగ్ వెనుక బైక్ చోరీల కథ..!
గంజాయి కేసులో కూపి లాగిన పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు, గుడివాడ ప్రాంతాలకు చెందిన షేక్ బాబ్జి, సాయికిరణ్.. బైక్ దొంగలు. వాళ్లకు సయ్యద్, సాయిరాం అనే మరో ఇద్దరి సహకారం. వీళ్లు వేర్వేరు జిల్లాల్లో బైక్‌లను చోరీలు చేస్తుంటారు. వీళ్లకు అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అన్నవరంకు చెందిన శివ, జి మాడుగుల మండలం చిన్నబంధ వీధికి చెందిన చంటి పరిచయమయ్యారు. వీరి పరిచయం కాస్త బైక్ చోరీల దగ్గర నుంచి గంజాయి స్మగ్లింగ్ వరకు చేరింది. ఎలా అంటే.. బైకులు చోరీలు చేస్తున్న బాబ్జి, సాయికిరణ్‌లు గంజాయి రుచి చూసారు. అనుకున్నదే తడవుగా అల్లూరు ఏజెన్సీకి వాలిపోయి.. శివ, చంటిలతో చేతులు కలిపారు. అప్పటికే గంజాయి వ్యాపారంలో ఆరితేరిపోయిన శివ, చంటి.. సాయి కిరణ్, బాబ్జిలకు గంజాయి సప్లై చేయడం ప్రారంభించారు. ఇదే సమయంలో.. గంజాయి కోసం డబ్బులకు బదులుగా.. చోరీ చేసిన విలువైన బైకులను ఆఫర్ చేశారు బాబ్జి, సాయికిరణ్. దీంతో.. ఆ బైక్‌లను అమ్మడం ప్రారంభించాడు శివ. ఆ తర్వాత ఈ కేసులో సాయిరాం, సయ్యద్ అనే మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
అలా తెలిసింది..!
అప్పటికే గంజాయి కేసులో పట్టుబడిన బాబ్జి, సాయికిరణ్‌లు.. పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటపెట్టారు. తాము బైకు చోరీ దొంగలమని చెప్పుకొచ్చారు. మరి ఈ గంజాయి వ్యవహారం ఏంట్రా అనే ప్రశ్నించేసరికి.. ఈ వస్తు మార్పిడి విధానంలో గంజాయి సప్లై వ్యవహారం గుట్టు విప్పారు. అరెస్ట్ అయిన సమయంలో పోలీసుల ఇంటరాగేషన్లో శివ,చంటి పేర్లను చెప్పుకొచ్చారు. ఇద్దరు అరెస్ట్ అయిన కొంతకాలానికి.. అదే కేతులో చిన్నబంధ వీధికి చెందిన చంటిని కూడా పోలీసులు పట్టుకున్నారు. మరి బైకులన్నీ ఏమయ్యాయి అంటే.. అవన్నీ వంశీ దగ్గరే ఉన్నాయని చెప్పుకొచ్చాడు చంటి.
కొండకోనల్లో బైక్లు దాచిపెట్టి..!
ఈ కేసులో పరారీలో ఉన్న శివ అలియాస్ వంశీ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. పోనీ దొంగలించిన బైకులు ఎక్కడైనా ఉంటాయా అనే దాని పైన పోలీసులు ఆరా తీశారు. కానీ ఎక్కడ ఆచూకీ లభించలేదు. చివరకు మాడుగుల తహసీల్దారు కార్యాలయం కూడలిలో వంశి వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు మాటువేసి.. పట్టుకున్నారు. అతన్ని పట్టుకునే విచారించేసరికి ఈ బైక్‌ల గోప్యం గుట్టు బయటపడింది. బాబ్జి బత్తుల సాయికిరణ్‌ల నుంచి.. గంజాయి వస్తు మార్పిడి విధానంలో బైకులను తీసుకున్న.. తాను వాటిని సరైన రికార్డులు లేకపోవడంతో కొండ కోనల్లో దాచిపెట్టినట్టు చెప్పుకొచ్చాడు. ఒడిస్సాలోని సిమిలిగూడలో అన్నిటినీ ఒకేసారి స్క్రాప్ దుకాణానికి అమ్మాయిలని ప్లాన్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. వంశీని పట్టుకున్న తర్వాత ఎంటరాగేషన్ చేసిన.. బైకులు దాచిపెట్టిన ప్రాంతాలపై ఆరా తీశారు. అన్నవరం కొండ కోనల్లో.. దాచిపెట్టిన బైక్లను గుర్తించగలిగారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 బైకులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఆ బైకులన్నీ అక్కడివే..!
12 బైకులను స్వాధీనం చేసుకున్న జిమాడుగుల పోలీసులు.. ఎస్పి తుహిన్ సిన్హా దృష్టికి తీసుకెళ్లారు. ఆ బైకులన్నీ వెరిఫై చేసేసరికి.. ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాతో పాటు.. ప్రకాశం కృష్ణా జిల్లాల్లో చోరీకి గురైనట్టు ఫిర్యాదులు కూడా. 12 బైకుల్లో 10 బైకుల చోరీ ఎఫ్ఐఆర్‌లు కూడా ఆయా జిల్లాల్లో నమోదయ్యాయి. మరో రెండు బైకులు.. చోరీకి గురైనట్టు ఎక్కడా.. నమోదు కాలేదని అన్నారు అల్లూరి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. కేసును అత్యంత చాకచకంగా ఛేదించిన జి మాడుగుల సిఐ సత్యనారాయణ, ఎస్సై శ్రీనివాసరావు, ఏఎస్ఐ మచ్చ రాజుతో పాటు సిబ్బందిని అభినందించారు ఎస్పి. ఇదీ.. వస్తు మార్పిడి విధానంలో ఈ గంజాయి, బైక్ చోరీల వ్యవహారం..! ఎక్కడో గంజాయి కేసుకూపి లాగితే.. ఈ బైకు చోరీల దొంకంతా కదిలింది. నిజంగా ఈ నిందితులను ట్రాక్ చేసిన పోలీసులకు సెల్యూట్ చేయాల్సిందే..!