Robbery: పార్క్ చేస్తే వారికి పండగే.. కళ్లు మూసి తెరిచేలోపు అంతా మాయం.. సినిమాను మించిన దోపిడీ, ఛేజింగ్..

Robbery: హైవేపై లారీ కంటైనర్‌ కనిపిస్తే చాలు.. కనికట్టు ప్రదర్శిస్తారు. లారీ పార్క్‌ చేసి ఉండగానే కంటైనర్‌లో సరుకంతా ఏనుగు..

Robbery: పార్క్ చేస్తే వారికి పండగే.. కళ్లు మూసి తెరిచేలోపు అంతా మాయం.. సినిమాను మించిన దోపిడీ, ఛేజింగ్..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 14, 2022 | 5:09 PM

Robbery: హైవేపై లారీ కంటైనర్‌ కనిపిస్తే చాలు.. కనికట్టు ప్రదర్శిస్తారు. లారీ పార్క్‌ చేసి ఉండగానే కంటైనర్‌లో సరుకంతా ఏనుగు మింగిన వెలక్కాయ పండు గుజ్జు మాయమైనట్టు మాయం చేసేస్తారు. గత మూడేళ్ళుగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని హైవేలపై ఆగి ఉన్న లారీ కంటైనర్ల నుంచి చాకచక్యంగా సరుకులను ఎత్తుకెళుతున్న చెన్నైకు చెందిన అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాలోని ప్రధాన నిందితుడిని ఎట్టకేలకు ప్రకాశం జిల్లా కందుకూరు పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో చెన్నైలోని నిందితుడి స్థావరంపై దాడి చేసి రూ. 23.60 లక్షల విలువైన నగదు, సరుకును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులకోసం గాలిస్తున్నట్టు గుంటూరు రేంజ్‌ డిఐజి త్రివిక్రమ్‌ వర్మ తెలిపారు.

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం తెట్టు దగ్గర 2021 ఆగస్టు 14వ తేదిన హైవేపై ఆగి ఉన్న లారీ కంటైనర్‌ తాళాలు పగులగొట్టి సొత్తును ఎత్తుకెళ్ళారు దొంగలు. లారీ కంటైనర్‌లో సొత్తు అపహరణకు గురైన వెంటనే.. ఆ కంటైనర్ డ్రైవర్‌ గౌహతిలోని ట్రాన్స్‌కార్గో ఇండియా కంపెనీ యజమానికి సమాచారం అందించారు. మరుసటి రోజు గుడ్లూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ట్రాన్స్‌పోర్ట్‌ యజమాని రోహిత్‌ ఫోగట్‌ పోలీసులకు పిర్యాదు చేశారు. కంటైనర్‌లో 7.62 లక్షల విలువైన పారాసిటమాల్‌ టాబ్లెట్లు చోరికి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పదిరోజుల అనంతరం మార్టూరు దగ్గర హైవేపై మరో లారీ కంటైనర్‌లోని 23 బాక్సుల్లోని రెడీమేడ్‌ దుస్తులు చోరీకి గురయ్యాయన్న మరో ఫిర్యాదు అందింది. ఈ కేసులో పోలీసులు నిందితులు సరుకుతో పారిపోతున్న లారీని గుర్తించి వెంటపడ్డారు. అయితే నిందితులు తమ ఐషన్‌ లారీని వేగంగా నడుపుతూ టంగుటూరు దగ్గర చెక్‌పోస్టును గుద్దుకుంటూ వెళ్ళిపోయారు. అయితే పోలీసులు పట్టువదలకుండా వెంటపడటంతో ఉలవపాడు దగ్గర లారీని వదిలేసి పారిపోయారు. నిందితులు చెన్నైకి పారిపోయారని గ్రహించిన పోలీసులు.. నిందితుల కోసం గత కొంతకాలంగా చెన్నైలో గాలిస్తున్నారు. అయితే వీరి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈనెల 13వ తేదిన నిందితుల గురించి పక్కా సమాచారం కందుకూరు పోలీసులకు లభించింది. నిందితులు చెన్నైలోని మాధవరం ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. నలుగురు ముఠా సభ్యులుగా ఏర్పడి హైవేలపై లారీ కంటైనర్లలోని సొత్తును అపహరిస్తున్న ముఠాలోని ప్రధాన నిందితుడు మాసిలామణి ప్రకాష్‌ను అరెస్ట్‌ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వీరంతా చెన్నైకి చెందిన వారిగా గుర్తించారు.

పట్టుబడిన ప్రధాన నిందితుడు మాసిలామణి దగ్గర నుంచి రూ. 18 లక్షల నగదు, మార్టూరు, కావలి ప్రాంతాల్లో చోరీ చేసిన 5.20 లక్షల విలువైన రెడీమేడ్‌ గార్మెంట్స్‌, కావలి రూరల్‌ పరిధిలో కంటైనర్‌ నుంచి చోరీ చేసిన 40 బాక్సుల మమ్మీపోకో డైపర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుంచి మొత్తం 23.60 లక్షల విలువైన నగదు, సరుకును స్వాధీనం చేసుకున్నట్టు గుంటూరు రేంజ్‌ డిఐజి త్రివిక్రమ్‌ వర్మ తెలిపారు. చెన్నైకి చెందిన నలుగురు ముఠా సభ్యులు గత మూడేళ్ళుగా ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని హైవేలపై మాటు వేసి పార్క్‌ చేసి ఉన్న లారీ కంటైనర్లలోని సొత్తును అపహరిస్తున్నట్టు తెలిపారు. మొత్తం 10 చోరీ కేసుల్లో నలుగురు నిందితులుగా ఉన్నారన్నారు. ప్రధాన నిందితుడు ప్రకాష్‌ను అరెస్ట్‌ చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని డిఐజి త్రివిక్రమ్‌వర్మ తెలిపారు. మూడేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న కేసులను చాకచక్యంగా వ్యవహరించి ఛేధించిన ప్రకాశం జిల్లా పోలీసు సిబ్బందిని ఈ సందర్బంగా డిఐజి ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలను అందించారు.

Also read:

Andhra Pradesh: కిలాడీ పేకాట రాయుళ్లు.. రైడ్ చేసేందుకు వెళ్లిన ఎస్‌ఐని దొంగ అంటూ చితకబాదారు

Vijayawada News: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. డబ్బులు ఇవ్వలేదని పేషెంట్‌తో అమానుషంగా..

Andhra Pradesh: ఒక వ్యక్తినే 2 సార్లు కిడ్నాప్ చేసిన కిడ్నాపర్.. ఇదో విచిత్రమైన స్టోరీ