Madanapalle Files: సీఐడీ లెక్క తేలింది..! మదనపల్లి ఫైల్స్‌కు కారణం వాళ్లేనట.. బిగుస్తున్న ఉచ్చు..!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసు దర్యాప్తులో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకవైపు సీఐడీ లోతైన దర్యాప్తు కొనసాగిస్తుండగా మరోవైపు రెవెన్యూ శాఖ కొరడా జులిపిస్తోంది.

Madanapalle Files: సీఐడీ లెక్క తేలింది..! మదనపల్లి ఫైల్స్‌కు కారణం వాళ్లేనట.. బిగుస్తున్న ఉచ్చు..!
Madanapalle Files
Follow us
Raju M P R

| Edited By: Balaraju Goud

Updated on: Nov 16, 2024 | 11:39 AM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెవెన్యూ అధికారులపై అభియోగాలు నమోదు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ప్రభుత్వ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కుట్ర పూరితంగా జరిగినట్లు సీఐడీ ఇచ్చిన నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఆధారాల ధ్వంసం కోసమే మదనపల్లి ఫైల్స్ మంటల్లో దగ్ధమైనట్లు ఎంక్వయిరీ చెబుతోంది. భూ అక్రమాలను సమాధి చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే జరిగిన పక్కా ప్లాన్ గా అనుమానిస్తున్న రెవెన్యూ శాఖ అభియోగాలపై వివరణ కోరింది. పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్‌తో ఫైల్స్ కాలిపోయాయన్న అనుమానం రాజకీయ పెద్దల ఉచ్చు బిగించేలా చేస్తోంది.

అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు దగ్ధమైన ఘటన కు నాలుగు నెలలు గడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసు దర్యాప్తులో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకవైపు సీఐడీ లోతైన దర్యాప్తు కొనసాగిస్తుండగా మరోవైపు రెవెన్యూ శాఖ కొరడా జులిపిస్తోంది. గత జూలై 21వ తేదీన రాత్రి జరిగిన ఘటనపై ఇప్పటిదాకా జరిగిన ఎంక్వయిరీ పలు అంశాలను బయట పెట్టింది ఎంక్వేరీ కమిటీ.

రెవెన్యూ, పోలీస్, ఫైర్, విద్యుత్ శాఖలతోపాటు పలు ఏజెన్సీలు ఇచ్చిన ప్రాథమిక నివేదికలు ఆధారంగా కీలక అంశాలను ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు భూ అక్రమాలకు ఆధారాలు ఉండ కూడదన్న ఉద్దేశంతోనే రికార్డులను దహనం చేసినట్లు సీఐడీ ఇచ్చిన నివేదికపై దృష్టి పెట్టింది. ఈ మేరకు ఆర్డీవోలుగా పనిచేసిన మురళీ, హరిప్రసాద్ తోపాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ లపై అభియోగాలు మోపింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 10 రోజుల్లో సమాధానం కోరుతూ రెండ్రోజుల క్రితం నోటీసులు కూడా జారీ చేసింది.

అయితే, ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్న అధికారులు ఇచ్చే వివరణ తరువాత తదుపరి కార్యాచరణపై చర్యలు తీసుకోనుంది రెవెన్యూశాఖ. జులై 21 న రాత్రి జరిగిన అగ్నిప్రమాదం కుట్ర దారులను, సూత్రధారులను గుర్తించే పని చేపట్టింది. ఫైల్స్ ఫైర్ లో కుట్ర దాగి ఉందని గుర్తించిన ప్రభుత్వం రెవెన్యూ అధికారులు పొలిటికల్ లీడర్స్ తో కుమ్మక్కై ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలు చట్టాలను ఉల్లంఘించినట్లు నిర్ధారించి చర్యలు చేపట్టింది. నిషేధిత జాబితా 22ఏ నుంచి భూములను తొలగించి ఫ్రీ హోల్డ్ చేయడంలో అనేక అక్రమాలకు పాల్పడినట్లు నివేదికలో స్పష్టం చేసింది. ఆధారాలను సమాధి చేసేందుకు పెట్టిన నిప్పులో దాదాపు 2440 ఫైల్స్ కాలినట్లు గుర్తించిన ప్రభుత్వం మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పొలిటికల్ ప్రమేయం ఉందన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తోంది.

రాష్ట్రంలోనే అతిపెద్ద రెవిన్యూ డివిజన్‌గా ఉన్న మదనపల్లి సబ్ డివిజన్ లో 79,107 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేయాలని అప్పట్లో తహసిల్దార్ ల నుంచి ప్రతిపాదనలు రాగా, 74,374 ఎకరాలకు పూర్తి హక్కులను కల్పించిన జిల్లా కలెక్టర్ కార్యాలయం 4,732 ఎకరాలను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 22ఏ నోటిఫికేషన్ నివేదికలను మార్చి రికార్డులను అనుకూలంగా తయారు చేసి భూ అక్రమాలకు తెర తీసిన వ్యవహారం ఇప్పుడు ఆ అధికారుల మెడకే చుట్టుకుంది. 22ఏ పరిధిలో ఉన్న 500 ఎకరాల భూములతో పాటు మరో 13 వేల ఎకరాల అసైన్డ్ భూముల రికార్డులను ప్రాసెస్ చేసినట్లు ఇప్పటికే విచారణలో తేలిపోయింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించింది రెవెన్యూ అధికారులే నని ఎంక్వయిరీ బయట పెట్టింది.

గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పెద్దల హస్తం ఇందులో ఉందని భావిస్తుండటంతో రాజకీయంగా కూడా ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో మదనపల్లికి చెందిన వైసీపీ నేత మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాష తో పాటు కొందరు నేతల అనుచరులకు నోటీసులు ఇచ్చి విచారించిన పోలీసులు ఈ కేసులో ఇప్పటిదాకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు. అయితే ఇప్పటికే అభియోగాలు ఎదుర్కొంటున్న ఆర్డీవోలు ఇద్దరిలో మురళి ఏసీబీ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లగా మరో ఆర్డీవో హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ మాత్ర సస్పెన్షన్ లో ఉన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…