Sirimanu Utsavam: పైడితల్లి అమ్మవారి ఉత్సవానికి ముహూర్తం ఖరారు.. జాతరకు ఏర్పాట్లు ప్రారంభం..
ఉత్తరాంధ్ర పెద్ద పండుగగా చెప్పుకునే విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను పండుగకు ముహూర్తం ఖరారు చేశారు ఆలయ అర్చకులు. పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతరంటే ఉత్తరాంధ్రవాసులకు ఒక సంబరం. జీవితంలో ఒక్కసారయినా ఆ జాతరను చూసి తరించాలని అందరూ పరితపిస్తుంటారు.
ఉత్తరాంధ్ర పెద్ద పండుగగా చెప్పుకునే విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను పండుగకు ముహూర్తం ఖరారు చేశారు ఆలయ అర్చకులు. పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతరంటే ఉత్తరాంధ్రవాసులకు ఒక సంబరం. జీవితంలో ఒక్కసారయినా ఆ జాతరను చూసి తరించాలని అందరూ పరితపిస్తుంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న పైడితల్లి అమ్మవారి జాతర కోసం ఇప్పటికే అధికారులు పనులు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా జరిపే ఈ పండుగకు విజయనగరంతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం, తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. నలభై రోజుల పాటు సాగే ఈ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది.
పైడితల్లి పండగ వచ్చిందంటే అందరూ ఆనందోత్సవాల్లో మునిగిపోతారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న అమ్మవారి పండగకు ముహూర్తం ఖరారు చేశారు అధికారులు. సెప్టెంబర్ 20 భాద్రపద బహుళ తదియ రోజున మండల దీక్షతో ప్రారంభమవనున్న ఈ పండుగ అదే రోజు ఉదయం 11 గంటలకు అమ్మవారికి పండుగ రాట వేసి ఉత్సవాలు ప్రారంభిస్తారు. అక్టోబర్ 14 న అమ్మవారి తొల్లెళ్ల ఉత్సవం జరుగనుండగా, ప్రధాన ఘట్టమైన సిరిమాను ఉత్సవం అక్టోబర్ 15న జరగనుంది. అక్టోబర్ 22వ తేదీ మంగళవారం పెద్దచెరువులో అమ్మవారి తెప్పోత్సవం, 27 సాయంత్రం కలశ జ్యోతుల ఊరేగింపు జరుపుతారు. అక్టోబర్ 29న మంగళవారం చదురుగుడి వద్ద ఉయ్యాల కంబాల మహోత్సవం, 30న బుధవారం వనం గుడి ఆవరణలో చండీహోమం, పూర్ణాహుతి, దీక్షా విరమణ ఉదయం ఎనిమిది గంటల నుండి సాగుతాయి.
సిరిమానోత్సవంలో భాగంగా అమ్మవారికి సంప్రదాయబద్దంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు అధికారులు. ఈ పండుగలో ప్రధాన ఘట్టమైన అమ్మవారి సిరిమానును ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు ఎనిమిదవ సారి సిరిమానును అధిరోహించి భక్తులకు అమ్మవారి ప్రతిరూపంగా దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారి సిరిమాను జాతర ఆలయ సంస్కృతి, సంప్రదాయాలతో సాగనుంది. గజపతిరాజుల ఆడపడుచు అయిన పైడితల్లి అమ్మవారి పండుగకు గజపతిరాజుల వారసులు, ఆలయ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు పర్యవేక్షణలో సాగనుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎమ్మెల్యే అదితి గజపతిరాజులు పండుగకు కావలసిన అన్నిరకాల ఏర్పాట్లు కోసం ముమ్మర కసరత్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..