ప్రాణ భయంతో పారిపోయిన రోగి.. పట్టుకొచ్చి ఆపరేషన్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు..!

ఏలూరు జిల్లా పేదవేగి మండలం అమ్మపాలెంకు చెందిన ఆంధ్రయ్య గత కొంతకాలంగా ప్యాంక్రియాస్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. వివిధ ఆసుపత్రుల చుట్టూ తిరిగిన ఆంధ్రయ్యను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు బంధువులు.

ప్రాణ భయంతో పారిపోయిన రోగి.. పట్టుకొచ్చి ఆపరేషన్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు..!
Ggh Superintendent Kiran And Team
Follow us
T Nagaraju

| Edited By: Balaraju Goud

Updated on: Aug 21, 2024 | 1:10 PM

పేదవారికి ఏదైనా రోగం వచ్చిందంటే ఆశగా చూసేది ప్రభుత్వ ఆసుపత్రి వైపే.. అయితే సర్కార్‌ దవాఖానా జనాన్ని వ్యాధి కంటే ఎక్కువగా భయపడుతున్నారు. ఆసుపత్రికి వెళ్లే కంటే ఇంటి దగ్గరే ప్రాణాలు వదిలిపెట్టడం మేలనే స్థితికి చేరుకున్నారు. ఆసుపత్రుల్లో కనిపించే దారుణ పరిస్థితులు గుర్తు చేసుకుంటూ, వైద్యుల తీరుపై ఆసుపత్రికి రావాలంటే జంకుతున్నారు. అయితే తాజాగా గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఓ రోగిని పట్టుకువచ్చి మరీ వైద్య చేశారు. ప్రాణ భయాన్ని పొగొట్టారు.

ఏలూరు జిల్లా పేదవేగి మండలం అమ్మపాలెంకు చెందిన ఆంధ్రయ్య గత కొంతకాలంగా ప్యాంక్రియాస్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. వివిధ ఆసుపత్రుల చుట్టూ తిరిగిన ఆంధ్రయ్యను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు బంధువులు. వివిధ వైద్య పరీక్షలు నిర్వహించిన జీజీహెచ్ వైద్యులు ప్యాంక్రియాస్ క్యాన్సర్ కు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. అయితే ఏడు గంటల పాటు ఐదు దశల్లో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని ఆంధ్రయ్య కుటుంబసభ్యులకు వివరించారు.

అధునాతన వైద్య పరికరాలు ఉపయోగించి ఆపరేషన్ చేస్తామని వైద్యులు రోగి బంధువులకు తెలిపారు. సంక్లిష్టమైన ఆపరేషన్ అని తెలియడంతో ఆంధ్రయ్య భయపడ్డాడు. దీంతో జీజీహెచ్ నుండి ఆంధ్రయ్య పారిపోయాడు. ఇంటికి వెళ్లిన రోగికి తిరిగి బంధువులు నచ్చజెప్పారు. అయితే ససేమిరా అంటున్న ఆంధ్రయ్యకు జీజీహెచ్ ఆసుపత్రి వైద్యులు కూడా ధైర్యం నింపారు. అయినప్పటికీ అయిష్టంగానే శస్త్రచికిత్సకు ఒప్పుకున్నాడు ఆంధ్రయ్య. ఎటకేలకు అందరు కలసి ఒప్పించి, తిరిగి ఆసుపత్రికి తీసుకువచ్చారు.

ఎన్టీఆర్ వైద్య సేవ కింద పది లక్షల రూపాయల ఖర్చయ్యే ఆపరేషన్‌ను గుంటూరు జిల్లా జనరల్ ఆసుపత్రి వైద్య బృందం ఉచితంగా చేసింది. గాల్ బ్లాడర్, ప్రాంక్రియాస్‌పై భాగం, చిన్న ప్రేగులతో అతుక్కొని ఉన్న భాగాలను వైద్యుల అత్యంత చాకచక్యంగా కట్ చేసి, విజయవంతంగా ఆపరేషన్ చేశారు. దీంతో రోగి కోలుకున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. విప్పల్స్ సర్జరీగా పేరున్న ఆపరేషన్ జీజీహెచ్‌లో విజయవంతంగా నిర్వహించిన కోటి వెంకటేశ్వరావు వైద్య బృందానికి రోగి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నట్లు వైద్య సిబ్బంది తెలిపింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..