Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల బరిలో టీడీపీ.. రేసులో ఉన్న అభ్యర్థులు వీరే..

రాజ్యసభ ఎన్నిక‌ల బ‌రిలో తాము కూడా ఉన్నామంటోంది తెలుగుదేశం పార్టీ. స‌రిప‌డా ఎమ్మెల్యేలు లేక‌పోయినా అనూహ్యంగా ఏదైనా జ‌రిగే అవ‌కాశం ఉందంటున్నారు ఆ పార్టీ నేత‌లు. ప్రధానంగా వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై ఆశలు పెట్టుకున్న టీడీపీ

Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల బరిలో టీడీపీ.. రేసులో ఉన్న అభ్యర్థులు వీరే..
Chandra Babu Naidu
Follow us
Basha Shek

|

Updated on: Jan 30, 2024 | 9:39 PM

రాజ్యసభ ఎన్నిక‌ల బ‌రిలో తాము కూడా ఉన్నామంటోంది తెలుగుదేశం పార్టీ. స‌రిప‌డా ఎమ్మెల్యేలు లేక‌పోయినా అనూహ్యంగా ఏదైనా జ‌రిగే అవ‌కాశం ఉందంటున్నారు ఆ పార్టీ నేత‌లు. ప్రధానంగా వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై ఆశలు పెట్టుకున్న టీడీపీ తమకు 50 మంది ఎమ్మెల్యేల మ‌ద్దతుందని చెబుతోంది. రాజ్యస‌భ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్‌ విడుద‌ల కావ‌డంతో ఆంధ్రప్రదేశ్‌లో అధికార‌, ప్రతిప‌క్ష నేతలు ఎవ‌రి లెక్కలు వారు వేసుకుంటున్నారు. రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వేమిరెడ్డి ప్రభాక‌ర రెడ్డి, సీఎం ర‌మేష్, క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్ పదవీకాలం ముగియనుంది. మొత్తం 175 ఎమ్మెల్యేల్లో ఇప్పటికే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్‌ ఆమోదం తెలిపారు. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన నలుగురు ఎమ్మేల్యేలు, వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు జనసేన నుంచి వైసీపీకి వచ్చిన రాపాక వరప్రసాద్‌పై అనర్హత వేటుకు సంబంధించి నేడో రేపో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ పది మందిని పక్కన పెడితే మిగిలేది 165 మంది ఎమ్మెల్యేలు. 165ను ప్రాతిపదికగా తీసుకుంటే ఒక్కో రాజ్యస‌భ అభ్యర్థి విజయానికి 41 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. సంఖ్యాపరంగా మూడు స్థానాలనూ తామే కైవసం చేసుకుంటామని వైసీపీ ధీమాగా చెబుతోంది.

రేసులో ఉన్న అభ్యర్థులు వీరే..

అయితే గ‌తంలో జ‌రిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున బ‌రిలో నిలిచిన పంచుమ‌ర్తి అనురాధ గెలిచారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు టీడీపీకి అనుకూలంగా ఓటెయ్యడంతో నాడు అధికార పార్టీ షాకైంది. పరిణామ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేల్లో ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి, మేక‌పాటి చంద్రశేఖ‌ర్ రెడ్డితో పాటు ఉండ‌వ‌ల్లి శ్రీదేవి తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో మరోసారి ఇలాంటి ప‌రిస్థితి రాకుండా వైసీపీ జాగ్రత్త ప‌డుతోంది. రాజ్యసభ స్థానానికి నామినేషన్‌ వేయడానికి పది మంది ఎమ్మెల్యేల మద్దతుంటే సరిపోతుండటంతో టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించాలని నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో రాజ్యసభ ఎన్నికల్లోనూ అనూహ్య గెలుపు ఆశిస్తోంది టీడీపీ. వైసీపీలో సీట్లు ద‌క్కని అసంతృప్త ఎమ్మెల్యేల ఓట్లతో రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందవచ్చని టీడీపీ అంచనా వేస్తోంది. టీడీపీ తరపున అభ్యర్థిని నిలపాలని వైసీపీ ఎమ్మెల్యేలే కోరుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.

రాజ్యసభ ఎన్నికల కోసం టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు వ‌ర్ల రామ‌య్య, టీడీఎల్పీ ఎల‌క్షన్ కోఆర్డినేట‌ర్ కోనేరు సురేష్‌, మరో మాజీ రాజ్యసభ ఎంపీ పేర్లను టీడీపీ అధిష్టానం ప‌రిశీలిస్తున్నట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..