దుమ్ము లేపిన బొబ్బిలి యువకులు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేసి..
విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఇద్దరు యువకులు బ్యాంకింగ్ పోటీ పరీక్షల్లో ఏకంగా నాలుగు చొప్పున ఉద్యోగాలు సాధించి ప్రతిభ చాటుకున్నారు. కళ్యంపూడి భానుప్రకాశ్, పెంట రాకేశ్ కుమార్ వరుస విజయాలతో స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నారు. పూర్తి వివరాలు కథనం లోపల ...

ఇటీవల విడుదలైన బ్యాంకింగ్ పోటీ పరీక్షల ఫలితాల్లో విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఇద్దరు యువకులు ఏకంగా నాలుగు చొప్పున ఉద్యోగాలు సాధించి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. బొబ్బిలి పట్టణంలోని నాయుడుకాలనీకి చెందిన కళ్యంపూడి భానుప్రకాశ్, పెంట రాకేశ్ కుమార్ తమ ప్రతిభతో ఒక్కోరు నాలుగు బ్యాంకు ఉద్యోగాలు సాధించారు. తాడేపల్లిగూడెంలోని ఎన్ఐటీలో ఈసీఈలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన భానుప్రకాశ్, కాలేజీ నుంచి రిలీవ్ అయిన నలభై రోజులు కూడా పూర్తికాకముందే వరుస విజయాలు సాధించాడు. ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడా సూరత్ జోన్‌లో పీవోగా, ఎస్‌బీఐ ఏపీ సర్కిల్‌లో క్లర్క్‌గా, సెంట్రల్ బ్యాంక్‌లో క్లర్క్‌గా, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో పీవోగా ఎంపికై ప్రతిభ చాటుకున్నాడు. భానుప్రకాశ్ తండ్రి సూర్యనారాయణ పక్కి ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తుండగా, తల్లి జయలక్ష్మి గృహిణి. అక్క సత్యప్రియ ప్రస్తుతం బ్యాంక్ పరీక్షలకు సిద్ధమవుతోంది.
మరోవైపు పెంట రాకేశ్ కుమార్ కూడా నాలుగు బ్యాంకు ఉద్యోగాలు సాధించి స్థానికులను గర్వపడేలా చేశాడు. బాపట్లలో అగ్రికల్చరల్ బీఎస్సీ పూర్తిచేసిన రాకేశ్ మూడో ప్రయత్నంలోనే కెనరా బ్యాంక్ పీవో, తెలంగాణ ఆర్ఆర్బీ పీవో, ఎస్‌బీఐ క్లర్క్, యూనియన్ బ్యాంక్ క్లర్క్ పోస్టులకు ఎంపికయ్యాడు. వీటిలో కెనరా బ్యాంకులో పీవోగా చేరనున్నట్లు తెలిపాడు. రాకేశ్ తండ్రి గోపినాయుడు బాడంగి మండలం గజరాయునివలస ప్రభుత్వ హైస్కూల్లో బయాలజీ టీచర్‌గా పనిచేస్తుండగా, తల్లి సుశీల గృహిణి. అన్నయ్య జయవర్ధన్ ప్రస్తుతం రాజస్థాన్‌లోని బిట్స్ పిలానీలో ఎం.టెక్ చదువుతున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఒకేసారి ఇంత పెద్ద స్థాయిలో విజయాలు సాధించడం బొబ్బిలి ప్రాంతంలో ఆనందాన్ని నింపింది. క్రమశిక్షణ, పట్టుదల, స్పష్టమైన లక్ష్యం ఉంటే ఏ విజయమూ దూరం కాదని వీరి విజయం మరోసారి నిరూపించింది.
